మలయాళంలో ఈ మధ్య కాలంలో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన సినిమాగా 'మూన్ వాక్' కనిపిస్తుంది. లిజో జొస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2020లోనే షూటింగును పూర్తిచేసుకుంది. కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ, ఈ ఏడాది మే 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. దాదాపు కొత్తవాళ్లు నటించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే ఓటీటీలోకి అడుగుపెట్టింది. 

కథ: ఈ కథ 1980లలో నడుస్తూ ఉంటుంది. జాక్ (అనునాథ్) శిబూ (సిద్ధార్థ్) వరుణ్ (రిషి) షాజీ (మనోజ్) సుదీప్ (ప్రేమ్) అరుణ్ (సుజిత్) ఒకే విలేజ్ కి చెందిన కుర్రాళ్లు. ఒకే కాలేజ్ లో వీళ్లంతా చదువుతూ ఉంటారు. అయితే చదువుపై కంటే కూడా సరదాగా తిరగడం పైనే ఫోకస్ పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఆ ఊళ్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిటీ నుంచి వచ్చిన కొందరు కుర్రాళ్లు డాన్స్ చేస్తారు. యూత్ లో డాన్స్ కి ఉన్న క్రేజ్ చూసిన తరువాత, తాము కూడా నేర్చుకోవాలని వీళ్లంతా అనుకుంటారు. 

ఇంట్లో వాళ్ల వైపు నుంచి ఈ కుర్రాళ్లకి ఎలాంటి సపోర్ట్ లభించకపోయినా, అందరూ తమకున్న వనరులని ఉపయోగించుకుంటూ ప్రాక్టీస్ చేయడం మొదలుపెడతారు. యూత్ పై మైఖేల్ జాక్సన్ ప్రభావం ఎక్కవగా ఉండటం .. ఆయన 'మూన్ వాక్' కి విపరీతమైన క్రేజ్ ఉండటంతో తమ టీమ్ కి 'మూన్ వాకర్స్' అనే పేరు పెట్టుకుంటారు. 'మూన్ వాక్'ను స్పెషల్ ఐటమ్ గా చేయాలని నిర్ణయించుకుంటారు. 

ఈ నేపథ్యంలోనే ఈ టీమ్ లోని జాక్ తల్లి, చదువుకోమంటూ అతణ్ణి కట్టడి చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి బ్రదర్ తో తన్నులు తిని, వరుణ్ హాస్పిటల్ పాలవుతాడు. మిగతా కుర్రాళ్లు పోలీసుల కంటపడటంతో, వాళ్ల జుట్టు కత్తిరించి వదిలేస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఆ యువకులు ఏం చేస్తారు? 'మూన్ వాకర్స్'గా పేరు తెచ్చుకోవాలనే వాళ్ల ప్రయత్నం ఫలిస్తుందా? అనేది కథ. 

విశ్లేషణ: 1980 కాలం నాటి కథ. ఆరుగురు కాలేజ్ కుర్రాళ్లపై మైఖేల్ జాక్సన్ తీసుకొచ్చిన బ్రేక్ డాన్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్లు డాన్స్ నేర్చుకోవాలని అనుకుంటారు. ఇటు ఇంట్లోవాళ్లు .. అటు కాలేజ్ లోని వాళ్లు ఎంకరేజ్ చేయకపోయినా ఎలా తమ కోరికను నెరవేర్చుకున్నారు? తాము అనుకున్నది సాధించారు? అనే కథను ఆనాటి వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా ఆవిష్కరించాడు. 

కాలేజ్ ఏజ్ లోకి అడుగుపెట్టగానే, ట్రెండ్ ను ఫాలో అవ్వడానికి యూత్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదైనా కొత్తగా చేయాలనీ, అందరూ తమవైపు గొప్పగా చూడాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఫ్రెండ్షిప్ చాలా బలంగా ఉంటుంది. అలాగే ఆకర్షణలు .. ప్రేమలలో కూడా కదలిక మొదలవుతూ ఉంటుంది. అలాంటి సన్నివేశాలతో ఈ కథను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 

విలేజ్ నేపథ్యం .. కాలేజ్ లైఫ్ .. ఫ్రెండ్స్ .. లవర్స్ .. పేరెంట్స్ .. ఎనిమీస్ ..  ఇలా అన్ని వైపుల నుంచి ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా నడుస్తుంది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన తీరు .. తెరపై ఆవిష్కరించిన విధానం బాగున్నాయి. అయితే డాన్సు ప్రాక్టీస్ లు .. స్టేజ్ పై డాన్సులకు సంబంధించిన నిడివిని కాస్త తగ్గించి, లవ్ ట్రాక్ లకు సంబంధించిన నిడివిని మరికాస్త పెంచితే బావుండేదేమో అనిపిస్తుంది. 

పనితీరు: 1980 కాలం నటి వాతావరణాన్ని .. అప్పటి యూత్ స్వభావాన్ని ఆవిష్కారించిన తీరు ఆకట్టుకుంటుంది.  కొత్తవాళ్లే అయినా కుర్రాళ్లంతా బాగా చేశారు. అన్సర్ షా ఫొటోగ్రఫీ .. ప్రశాంత్ పిళ్లై నేపథ్య సంగీతం .. దీపు జోసెఫ్ ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: తక్కువ బడ్జెట్ లో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇది. 1980 కాలానికి చెందిన యూత్ ను మరోసారి ఆ కాలంలోకి తీసుకుని వెళుతుంది. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు .. సాధన చేసేవారిని విజయం వెదుక్కుంటూ వస్తుందనే సందేశాన్ని అందించిన సినిమా ఇది.