నార్నే నితిన్ హీరోగా రూపొందిన సినిమానే 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'. చింతపల్లి రామారావు నిర్మించిన ఈ సినిమాకి, సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించాడు. జూన్ 6వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 'ఆయ్' .. 'మ్యాడ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నార్నె నితిన్, ఈ సినిమాలో ఎంతవరకూ అలరించాడనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ 'ఆత్రేయపురం'లో .. 1996లో మొదలవుతుంది. సుబ్బరాజు (నరేశ్) దంపతుల సంతానమే రాజా ( నార్నే నితిన్). పురిటిలోనే అతను చనిపోయాడని అంతా అనుకుంటారు. కానీ అనుకోకుండా సిగరెట్ పొగ పీల్చిన అతను, ఈ లోకంలోకి వస్తాడు. అందువలన టీనేజ్ నుంచి  రాజా సిగరెట్ తాగుతున్నాడని తెలిసినా, సుబ్బరాజు తెలియనట్టే ఉంటాడు. దాంతో సిగరెట్ కి రాజా బానిస అవుతాడు. అలాంటి అతను కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) ప్రేమలో పడతాడు. 

కృష్ణమూర్తి రాజకీయంగా ఎదగాలని అనుకుంటూ ఉంటాడు. ఈ సారి ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే సుబ్బరాజు కూడా అదే ఆలోచనలో ఉండటం అతనిని టెన్షన్ పెడుతూ ఉంటుంది. అంతకుముందు ఇద్దరూ స్నేహితులే అయినప్పటికీ, ఇప్పుడు రాజకీయ పరిణామాల కారణంగా కాస్త తేడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కూతురు సుబ్బరాజు కొడుకు రాజాను ప్రేమిస్తోందనే విషయం కృష్ణమూర్తికి తెలుస్తుంది. 

నిజానికి రాజాతో తన కూతురు వివాహాన్ని జరిపించడం కృష్ణమూర్తికి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. రాజా ఒక్కగంట కూడా సిగరెట్ తాగకుండా ఉండలేడనే విషయం అతనికి తెలుసు. దాంతో రాజాకి ఒక గడువు పెట్టి, అప్పటివరకూ సిగరెట్ జోలికి వెళ్లకుండా ఉంటే తన కూతురు నిచ్చి పెళ్లి జరిపిస్తానని సవాల్ విసురుతాడు. నిత్య కోసం రాజా సిగరెట్ మానేస్తాడా? ఆమెతో అతని వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ.

విశ్లేషణ: గ్రామీణ నేపథ్యం .. హీరో హీరోయిన్స్ మధ్య ప్రేమ .. వాళ్ల తండ్రుల మధ్య రాజకీయ పరమైన గొడవలు .. హీరోకి గల సిగరెట్ స్మోకింగ్ అలవాటు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గ్రామీణ రాజకీయాలు .. ప్రేమ గొడవలు వంటి అంశాలతో గతంలో చాలానే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తరహాలో అల్లుకున్న కథనే ఇది. ఆసక్తికరమైన సన్నివేశాలు .. అనూహ్యమైన మలుపులు ఎక్కడా కనిపించవు. 

సిగరెట్ తాగకుండా హీరో ఒక్క గంట కూడా ఉండలేడు. అలాంటి అతను లవర్ కోసం అలవాటును మానేస్తానంటూ ఒక సవాల్ ను స్వీకరిస్తాడు. ఇక అప్పటి నుంచి కథ ఊపందుకుంటుందని ఆడియన్స్ అనుకుంటారు. కానీ ఆ తరువాత కథ కూడా రొటీన్ గానే సాగుతుంది. అయినా హీరోతో ఎవరు ఎలాంటి సవాల్ చేసిన చివరికి హీరోనే గెలుస్తాడనే విషయం అందరికీ తెలిసిందే గనుక, ఆడియన్స్ పెద్దగా టెన్షన్ పడిపోరు. 

ఇక హీరో చైన్ స్మోకర్ అని చెప్పడం కోసం తెరపై ఒక రేంజ్ లో సిగరెట్లు తాగించారు. నిజంగా అది ఆడియన్స్ కి చాలా అసహనాన్ని కలిగిస్తుంది. ఈ కథలో కామెడీకి .. రొమాన్స్ కి .. విలేజ్ నేపథ్యంలో సాంగ్స్ కి మంచి అవకాశం ఉంది. కానీ వాటిని గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. ఈ కథకు ప్రధానమైన ఆకర్షణగా ఏదైనా ఉందీ అంటే, అది విలేజ్ నేపథ్యంలోని లొకేషన్స్ అనే చెప్పవలసి ఉంటుంది. 

పనితీరు: పల్లె అందాల మధ్యలో .. ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో కథలను పరిగెత్తించడంలో   సతీశ్ వేగేశ్న కి మంచి నైపుణ్యం ఉంది. అయితే ఈ కథకి గ్రామీణ నేపథ్యం బలంగా నిలిచినప్పటికీ, ఆ స్థాయిలో కథాకథనాలు కనిపించవు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే ఒక కుతూహలం ఆడియన్స్ లో కలిగేలా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. 

రావు రమేశ్ .. నరేశ్ ఇద్దరూ కూడా తమ మార్క్ చూపించారు. నార్నే నితిన్ - సంపద నటన ఫరవాలేదు. దాము నర్రావుల ఫొటోగ్రఫీ బాగుంది. గ్రామీణ నేపథ్యంలోని దృశ్యాలు ఆకట్టుకుంటాయి. కైలాశ్ మీనన్ సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. మధు ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: విలేజ్ నేపథ్యం .. రెండు కుటుంబాలు .. ఒక ప్రేమజంట .. స్థానిక రాజకీయాలను కలుపుకుంటూ ఈ కథ సాగుతుంది. కొత్తదనం లేకపోవడం .. ఏం జరుగుతుందనేది ఆడియన్స్  ముందుగానే గెస్ చేసేలా ఉండటం మైనస్ గా అనిపిస్తుంది.