నయనతార - సిద్ధార్థ్ - మాధవన్ .. ఈ ముగ్గురికీ కూడా అటు తమిళంలోనూ .. ఇటు తెలుగులోను మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఈ ముగ్గురూ ప్రధానమైన పాత్రలను పోషించిన 'టెస్ట్' మూవీ నేరుగా ఓటీటీకి వచ్చేసింది. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అర్జున్ (సిద్ధార్థ్) ఒక క్రికెటర్. ఆయనకి క్రికెట్ గురించి తప్ప మరో ధ్యాస ఉండదు. తన కుటుంబానికంటే కూడా క్రికెట్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అయితే కొంతకాలంగా ఆయన ఒక్క సెంచరీ కూడా చేయకపోవడంపై విమర్శలు వస్తుంటాయి. ఆయన ఫామ్ కోల్పోయాడనే అభిప్రాయం కమిటీ సభ్యులలో బలంగానే ఉంటుంది. అందువలన పాకిస్థాన్ తో జరిగే టెస్టు మ్యాచ్ లో తనని తాను నిరూపించుకోవాలని ఆయన భావిస్తూ ఉంటాడు.

అర్జున్ ను అభిమానించేవారిలో 'కుముద' (నయనతార) ఒకరు. క్రికెట్ అంటే ఆమెకి చాలా ఇష్టం. అర్జున్ .. కుముద ఒకానొక సమయంలో స్కూల్ మేట్స్. అందువలన వాళ్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. తన టీచర్ ఉద్యోగం చేసుకుంటూనే, ఆమె అర్జున్ కెరియర్ ను గమనిస్తూ ఉంటుంది. అయితే వివాహమై చాలా కాలమైనా సంతానం కలగలేదనే బాధ ఆమెను మానసికంగా కుంగదీస్తూ ఉంటుంది. ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనడానికి తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

ఇక కుముద భర్తనే శరవణన్ (మాధవన్). అతను ఒక సైంటిస్ట్. పెట్రోల్ వాడకం పెరిగిపోవడం .. ఫలితంగా పొల్యూషన్ పెరుగుతూ ఉండటంతో, నీటితో ఇంజన్స్ నడిచే ఒక ఫార్ములాను ఆయన కనుక్కుంటాడు. అలా ఒక ఇంజన్ ను సిద్ధం చేసిన ఆయన, ప్రభుత్వ అనుమతి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే తన ప్రయత్నాలు ఫలించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని గ్రహిస్తాడు. తమని తాము నిరూపించుకునే ఒక టెస్ట్ ఇప్పుడు ఈ ముగ్గురి ముందు ఉంటుంది. ఆ టెస్ట్ లో వాళ్లు నెగ్గారా లేదా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: జీవితంలో అంతా సాధించేశాము .. అనుకున్నదంతా ఒక్కసారిగా సొంతం చేసుకున్నామని అనుకోవడానికి లేదు. జీవితమనే ప్రయాణంలో ప్రయత్నమనేది నిరంతరం సాగుతూ ఉండవలసిందే. అంచలంచెలుగా సవాళ్లను ఎదుర్కోవలసిందే. ప్రతి సవాలు ఒక టెస్ట్ .. దానిని అధిగమించడానికి తీవ్రమైన కృషి అవసరమే. ప్రతికూల పరిస్థితుల్లో ఆ టెస్టును అధిగమించడానికి ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తారు? అనేది ఈ కథలోని ప్రధానమైన అంశం.

ఈ కథలో ప్రధానమైన పాత్రలు అర్జున్ .. కుముద .. శరవణన్. వీళ్లకి కావలసినదేమిటి? దేని కోసం వీళ్లంతా విపరీతమైన మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు? అనేది కథ మొదలుపెట్టిన వెంటనే దర్శకుడు చెబుతాడు. ఈ ముగ్గురికి కూడా తాము తలపెట్టిన పనుల్లో అనుకున్నది సాధించాలనే తపన ఉంటుంది. పైగా అదే చివరి అవకాశం అని తెలియడంతో వాళ్లు మరింత పట్టుదలగా ముందుకు కదులుతారు. 

అయితే అందుకు సంబంధించిన కథ ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా నడవడమే ఈ కథకి మైనస్ అయిందేమోనని అనిపిస్తుంది. ఎవరి ట్రాక్ పట్టుకున్నా మానసిక సంఘర్షణ ఎక్కువ .. జరిగే తతంగం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఒక స్థాయి దాటిన తరువాత కథనం కాస్త పుంజుకున్నట్టుగా అనిపించినా, ఆ తరువాత నీరసపడకుండా ఉండలేకపోయింది. 'అవసరం అనేది నైతిక విలువలను గురించి ఆలోచించనీయదు' అనే సందేశం ఉన్నప్పటికీ, ఆ దిశగా కదిలే కథ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. 

పనితీరు
: ప్రధానమైన మూడు పాత్రలలో ఒకరిది ఆశ .. ఒకరిది ఆశయం .. మరొకరిది ప్రయత్నం. అయితే ఈ మూడు పాత్రలను ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు. దర్శకుడు కథలో తాను అనుకున్న మలుపును తెరపైకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. అక్కడ ఆ మలుపు ఉంటుందని ఆడియన్స్ కి తెలియదు గనుక, కాస్త అసహనానికి లోనవుతారు. 

 విరాజ్ సింగ్ ఫొటోగ్రఫీ .. శక్తిశ్రీ గోపాలన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. సురేశ్ ఎడిటింగ్ విషయానికి వస్తే, నిడివి ఎక్కువగానే ఉంది గనుక, సాగతీత సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. ఇక ప్రధానమైన పాత్రలు పోషించినవారికి నటన ఏమీ కొత్తకాదు. కాకపోతే ఆ పాత్రలను డిజైన్ చేసిన విధానం .. అసలు కథాంశం చుట్టూ అల్లుకున్న పలచని సన్నివేశాలు ఆడియన్స్ ను కాస్త ఇబ్బంది పెడతాయంతే. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. సంభాషణలు లేవు గనుక, ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే చూడొచ్చు.