ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలోని కథలకు ముఖ్యంగా 1990 - 2000 ల నాటి కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. శివాజీ - వాసుకీ ప్రధాన పాత్రలుగా ఆ మధ్య వచ్చిన '90'స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్' సిరీస్ కి విశేషమైన స్పందన వచ్చింది. దాంతో అదే తరహాలో రూపొందిన 'హోమ్ టౌన్' సిరీస్ నిన్నటి నుంచి 5 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. '90స్ ' నిర్మాతల నుంచి వచ్చిన ఈ సిరీస్, అదే స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా .. లేదా అనేది చూద్దాం. 

కథ: అది తెలంగాణ ప్రాంతంలోని 'హనుమంతుల గూడెం' అనే పల్లెటూరు. ఆ విలేజ్ లో ప్రసాద్ దంపతులు (రాజీవ్ కనకాల - ఝాన్సీ) నివసిస్తూ ఉంటారు. వారి సంతానమే శ్రీకాంత్ ( ప్రజ్వల్) జ్యోతి (యాని). ఫొటో స్టూడియోపై వచ్చిన కొద్ది పాటి ఆదాయంతోనే ప్రసాద్ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. తన కొడుకు తమ మాదిరిగా కష్టాలు పడకూడదని భావించిన ప్రసాద్, అతణ్ణి పై చదువుల కోసం విదేశాలకు పంపించాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ దిశగా కష్టపడుతూ ఉంటాడు. 

జ్యోతి విషయానికి వచ్చేసరికి, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలో ప్రసాద్ ఉంటాడు. అయితే జ్యోతికి పై చదువులు చదువుకోవాలని ఉంటుంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి ఆ మాటను పైకి చెప్పలేకపోతుంది. ఎప్పుడు చూసినా జగదీశ్ - శాస్త్రి అనే ఫ్రెండ్స్ తో తిరిగే శ్రీకాంత్, చదువు విషయంలో ఎప్పటికప్పుడు వెనకబడుతూ ఉంటాడు. సినిమా డైరెక్టర్ కావాలనే కోరిక అతనిలో బలంగా ఉంటుంది.

తన మనసులోని మాటను తండ్రికి చెప్పడానికి భయపడిన శ్రీకాంత్, చదువు విషయంలో తల్లిదండ్రులను మోసం చేస్తూ వస్తుంటాడు. అది తెలియని ప్రసాద్ అతణ్ణి విదేశాలకు పంపించడానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అతను తన కొడుకును విదేశాలకు పంపించగలుగుతాడా? అనుకున్నట్టుగా జ్యోతి పెళ్లి చేయగలుగుతాడా? ఒక మధ్యతరగతి తండ్రిగా అతను సక్సెస్ అవుతాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ప్రతి తల్లిదండ్రులు తమలా తమ పిల్లలు కష్టాలు పడకూడదని భావిస్తారు. వాళ్లు విదేశాలలో పై చదువులు చదవాలని కలలు కంటారు. ఆ కలలు నిజం చేసుకోవడానికి కష్టాలు పడతారు. అయితే తమ పిల్లలకు ఏ రంగంలోకి వెళ్లాలని ఉంది? తమ ఆశయం నెరవేర్చే దిశగా అడుగులు వేయాలనే ఆలోచన వాళ్లకి ఉందా అనే ఆలోచన మాత్రం చేయరు. అలాగే అత్తవారింటికి వెళ్లే అమ్మాయికి పై చదువులు దండగనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి ఒక అంశం చుట్టూ తిరిగే కథనే ఇది. 
 
ఒక వైపున తల్లిదండ్రుల దృష్టికోణం .. మరో వైపున టీనేజ్ పిల్లల ఆలోచనలను కలుపుకుని ఈ సిరీస్ కొనసాగుతుంది. అప్పటివరకూ సరైన పునాదులు లేని విద్యతో తరగతులు దాటుకుంటూ వచ్చిన పిల్లలు, కొత్తగా వస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్న తీరును చూపిస్తూ ఆలోచింపజేసిన దర్శకుడు .. అక్కడే సున్నితమైన హాస్యాన్ని ఆవిష్కరించాడు. ఎక్కువ పాత్రల జోలికి వెళ్లకుండా .. పరిమితమైన పాత్రలతోనే ఆసక్తికరమైన డ్రామాను నడిపించాడు. 

దర్శకుడు కథను సిద్ధం చేసుకున్న తీరు .. సరదాగా కథనాన్ని నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. ప్రధానమైన పాత్రలను మలచిన తీరు .. ఆ పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన తీరు మెప్పిస్తాయి. ఆ కాలంలోకి ఆడియన్స్ ను తీసుకెళ్లాలనే దర్శకుడి ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. కాకపోతే మొదటి నాలుగు ఎపిసోడ్స్ కథను తాపీగా నడిపించిన దర్శకుడు, చివరి ఎపిసోడ్ లోనే పూర్తి కథను చెప్పేయాలని హడావిడిపడినట్టుగా అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు ఈ కథలో ఫ్రెండ్షిప్ .. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేశాడు. అయితే లవ్ ట్రాక్ నిడివి ఇంకాస్త ఉండి ఉంటే బాగుండునని అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ - ఫ్యామిలీ ఎమోషన్స్ .. ఈ రెండు కోణాల వైపు నుంచి కథను చెప్పిన విధానం బాగుంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా సాయిరామ్ కామెడీ ఆకట్టుకుంటుంది. అతను కమెడియన్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

దేవ్ దీప్ గాంధీ ఫొటోగ్రఫీ బాగుంది. సురేశ్ బొబ్బిలి బాణీలు .. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలన్నింటిలోను ఫీల్ వర్కౌట్ అయింది. కార్తీక్ ఎడిటింగ్ నీట్ గా ఉంది.

ముగింపు: గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. సహజత్వంతో కూడిన సన్నివేశాలు ఈ సిరీస్ కి ప్రధానమైన బలం అని చెప్పక తప్పదు. తల్లిదండ్రులు తమ ఆలోచనలు .. ఆశయాలు పిల్లలపై రుద్దకూడదు. వాళ్ల అభిప్రాయాలు .. ఇష్టాయిష్టాలను కూడా తెలుసుకోవలసిన అవసరం ఉందనే సందేశాన్ని ఇచ్చే సిరీస్ ఇది.