జీవా - రాశి ఖన్నా ప్రధాన పాత్రలుగా 'అగత్యా' సినిమా రూపొందింది. తమిళంలో నిర్మితమైన ఈ సినిమా, ఫిబ్రవరి 28వ తేదీన థియేటర్లకు వచ్చింది. హిస్టారికల్ హారర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, థియేటర్ల వైపు నుంచి మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్  ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా తెలుగులోను స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: అగత్యా (జీవా) ఆర్ట్ డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఆ విషయంలో అతనిని వీణ (రాశి ఖన్నా) ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే అగత్యా ఒక సినిమా కోసం సెట్ వేసిన తరువాత షూటింగ్ కేన్సిల్ అవుతుంది. ఆ సెట్ ను భూత్ బంగ్లాగా మార్చేసి .. టూరిస్ట్ ప్లేస్ గా మార్చడం వలన, కొంత ఇన్ కమ్ వస్తుందని అగత్యాకి వీణ సలహా ఇస్తుంది. దాంతో అతను అదే విధంగా చేస్తాడు. 

అగత్యా వేసిన ఆ భూత్ బంగ్లా సెట్ ను చూడటానికి చాలామంది వస్తుంటారు. అలా వచ్చిన వాళ్లలో ఒక యువకుడు అదృశ్యమవుతాడు. అందుకు గల కారణాన్ని కనుక్కోవడానికి అగత్యా రంగంలోకి దిగుతాడు. ఆ సెట్ భూగర్భంలో ఓ సీక్రెట్ ప్లేస్ ఉండటాన్ని అతను గమనిస్తాడు.  అందుకు సంబంధించిన పరిశోధనలో ముందుకు వెళ్లిన అగత్యాకి, ఆ సెట్లో నిజంగానే దెయ్యాలు తిరుగుతున్నాయనే విషయం అర్థమవుతుంది. 

 అతనికి అక్కడ ఒక డాక్టర్ అస్థిపంజరం .. అతను రాసిన డైరీ .. ఫిల్మ్ తో కూడిన ప్రొజెక్టర్ లభిస్తాయి. దాంతో అతను వాటిని పరిశీలన చేస్తాడు.1940లలో ఆంగ్లేయులతో కూడిన ఒక భారతీయ సిద్ధవైద్యుడి గురించి అగత్యాకి అప్పుడే తెలుస్తుంది. సిద్ధార్థ (అర్జున్) అనే ఆ సిద్ధవైద్యుడికి ఆంగ్లేయులతో ఉన్న సంబంధం ఏమిటి? అతను ఎందుకు చనిపోతాడు? ప్రేతాత్మలుగా మారినది ఎవరు? అనేవి కథలోని ఆసక్తికరమైన అంశాలుగా కనిపిస్తాయి. 

విశ్లేషణ: సాధారణంగా దెయ్యాల కథలన్నీ ఒక బంగ్లాలో జరుగుతూ ఉంటాయి. దెయ్యాలు ఆ బంగ్లా దాటి బయటికి పోవు గనుక, కథ కూడా లోపలే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ కథలో మాత్రం కాస్త కొత్తదనం కనిపిస్తుంది. ఈ కథ ఆంగ్లేయుల కాలంతో ముడిపడి ఉంటుంది. అప్పటి వాతావరణం .. కాస్ట్యూమ్స్ .. ఫర్నీచర్ .. వెహికల్స్ .. చూడటానికి కొత్తగా అనిపిస్తుంది. ఇక ఒక బంగ్లాలో కాకుండా ఒక సెట్ లో ఈ కథ నడవడం కూడా దర్శకుడి దృష్టిలో కొత్తదనమే అనుకోవాలి. 

దెయ్యాల సినిమా అనగానే భయపడుతూనే చూడటానికి ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తారు. ఎవరు ఎందుకు దెయ్యాలుగా మారారు? దెయ్యాల ఉద్దేశం ఏమిటి? బ్రతికున్న వాళ్లపై వాటి అభిప్రాయం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవడానికే వాళ్లంతా ప్రయత్నిస్తుంటారు. వాళ్లకి కావలసిన సమాధానాలను భయపెడుతూ చెప్పకపోతే ఫీలవుతారు. ఈ సినిమా విషయంలో జరిగింది అదే.

దెయ్యాలుగా ఎవరు మారారు? ఎందుకు మారారు? అనేది హీరో పరిశోధించి పట్టుకుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అలా కాకుండా పాతకాలం నాటి డైరీ .. ప్రొజెక్టర్ .. వీడియో టేప్ .. ఇవన్నీ దొరికేసరికి ఆడియన్స్ లో ఆసక్తి తగ్గిపోతుంది. ఇక ఆంగ్లేయుల కాలం నాటి ఎపిపోడ్ ఓకే .. కానీ సెట్ కి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం టీవీ గేమ్ షోను గుర్తుచేస్తుంది. ఈ సినిమా అటు భయపెట్టలేకపోయింది .. ఇటు నాసిరకం కామెడీతో నవ్వించలేకపోయిందని చెప్పచ్చు. 

పనితీరు: దర్శకుడు తయారు చేసుకున్న కథాకథనాలు అంత ఆసక్తికరంగా అనిపించవు. గతం - వర్తమానం నేపథ్యంలో సాగే సన్నివేశాలలో ఆకట్టుకునే స్థాయిలో ఏవీ లేవు. నటన పరంగా చెప్పుకోవడానికి ఆ స్థాయిలో డిజైన్ చేసిన సీన్స్ కనిపించవు. దీపక్ కుమార్ కెమెరా పనితనం .. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం .. సాన్ లోకేశ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఆంగ్లేయుల కాలం నాటి ఎపిసోడ్ లో గ్రాఫిక్స్ పరంగా బాగానే కష్టపడ్డారు గానీ, కథలో విషయం లేకపోవడం వలన ప్రయోజనం లేకుండా పోయింది అంతే.

ముగింపు: కొన్ని హారర్ సినిమాలు పెర్ఫెక్ట్ కంటెంట్ తో భయపెడతాయి. మరికొన్ని హారర్ సినిమాలు కంటెంట్ లేక భయపెడతాయి. రెండో కేటగిరిలో మనకి ఈ సినిమా కనిపిస్తుంది.