మలయాళ కథానాయకుడు మోహన్‌ లాల్‌ నటించిన విజయవంతమైన చిత్రం  'లూసిఫర్‌'కు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే 'ఎల్‌2, ఎంపురాన్‌'. ఈ చిత్రం ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అందరిలోనూ చూడాలనే ఉత్సుకత మొదలైంది. అసలు ఎంపురాన్‌ కథేంటి? ఈ చిత్రంలోనే ఉన్న రాజకీయ నేపథ్యం ప్రేక్షకులను ఎంత వరకు అలరించింది? తెలుసుకుందాం...

కథ: 'లూసిఫర్‌' తొలిపార్ట్‌ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ కథను మొదలుపెట్టాడు దర్శకుడు. పీకే రామదాస్‌ (సచిన్‌ ఖేడ్కర్‌) చనిపోయిన తరువాత ఆయన పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను సద్డుమణిగేలా చేసి జతిన్‌ రామదాస్‌ (టోవినో థామస్‌)ను సీఎంగా చేసి ఐయూఎఫ్‌ పార్టీకి వారసుడిగా నిలబెట్టిన  స్టీఫెన్‌ వట్టిపల్లి (మోహన్‌ లాల్‌) ఎవరికి కనిపించకుండా వెళ్లిపోతాడు. చేతికి పవర్స్‌ రాగానే జతిన్‌ రామదాస్‌ ఎన్నో అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడటంతో పార్టీ సిద్డాంతాలను కూడా తుంగలో తొక్కి పరిపాలన చేస్తుంటాడు. 

ఇక ఆ పార్టీ నుంచి బయటికొచ్చి ఐయూఎఫ్‌ పీకే అనే కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో బాబా భజరంగీ ( అభిమన్యు)తో కలిసి పోటీ చేస్తానని ప్రకటిస్తాడు. అయితే జతిన్‌ నిర్ణయాన్ని అతని సోదరి ప్రియదర్శి (మంజు వారియర్‌)కు నచ్చదు. పీకేఆర్‌ పార్టీ కార్యకర్తలు, ప్రతినిధులు కూడా ఆయన నిర్ణయానికి ఒప్పుకోరు. అయితే ఇప్పుడు తన రాష్ట్రంపై జరుగుతున్న రాజకీయ కుట్ర, సహజ వనరుల దోపీడిని ఆరికట్టడానికి , ఐయూఎఫ్‌ పార్టీని నిలబెట్టడానికి స్టీఫెన్‌ తిరిగొచ్చాడా? వచ్చిన తరువాత జరిగిందేమిటి? బాబా భజరంగ కుట్రను ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటంలో సయ్యద్‌ మసూద్‌ ( పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) ఎవరు? ఆయన స్టీఫెన్‌కు ఎలా సాయం చేశాడు? అనేది మిగతా కథ 


విశ్లేషణ: 'లూసిఫర్‌' ముఖ్యంగా రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ నేపథ్యంతో కొనసాగితే. ఇప్పుడు ఎల్‌2 ఎంపురాన్‌కు అదనంగా పొలిటికల్‌ డ్రామాతో పాటు డ్రగ్స్‌ మాఫియాను కూడా జోడించారు. అయితే ఈ రెండో భాగంలో దర్శకుడు కథను రాసుకోవడంలో విఫలమయ్యాడు. సాంకేతికంగా ఎంతో అత్యున్నతంగా తీర్చిదిద్ది రచన పరంగా పెద్దగా కసరత్తులు చేయలేదనిపిస్తుంది. తొలిభాగం ఎంతో నిరాశజనకంగా స్లోగా కొనసాగితే, సెకండాఫ్‌ కొంత మేరకు ఫరవాలేదనిపిస్తుంది. సినిమా మొదలైన గంట తరువాత ముఖ్యపాత్ర మోహన్‌లాల్‌ కనిపిస్తాడు. అప్పటి వరకు జరిగే సన్నివేశాలు అన్ని బోరింగ్‌గా అనిపిస్తాయి. 

లూసిఫర్‌లో కనిపించిన పొలిటికల్‌ డ్రామాలోని ఉత్కంఠ, ఉత్తేజం ఈ చిత్రంలోని పొలిటికల్‌ డ్రామాలో లోపించింది. సన్నివేశాలు అన్ని పేలవంగా ఉంటాయి. తెరపై మోహనల్‌ లాల్‌ కనిపించిన సీన్స్‌తో పాటు అక్కడక్కడా రెండు మూడు సన్నివేశాలు మినహా పెద్దగా ప్రేక్షకుల్లో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనే ఉత్సహాకరమైన సీన్స్‌ ఉండవు. 
ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్‌  సన్నివేశాలు, పతాక సన్నివేశాలు మాత్రమే అలరించే విధంగా ఉంటాయి. 

స్టీఫెన్‌ కేరళకు రావడం, అక్కడ రాజకీయ ఎత్తుగడలు, పార్టీని కాపాడటం తదితర సన్నివేశాలపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే సినిమా ఆసక్తికరంగా ఉండేది. ఇలాంటి పొలిటికల్‌ డ్రామాల్లో సన్నివేశాలు ఎంత బలంగా రాసుకుంటే ఆడియన్స్‌ను అంత బలంగా ఆకట్టుకుంటాయి. సినిమా అంతా రోటిన్‌ రివేంజ్‌ డ్రామాలా అనిపిస్తుంది. కథలో ఎమోషన్స్‌, బలమైన డ్రామా కనిపించవు. ఇక ఈ సినిమాకు మూడో పార్ట్‌ అవసరమా అనే రీతిలో ముగించారు. పార్ట్‌2 ముగించిన విధానం బాగలేదు. 

నటీనటుల పనితీరు: అబ్రహాం ఖురేషి అలియాస్‌ స్టీఫెన్‌ వట్టిపల్లిగా మోహన్‌లాల్‌ తెరపై ఎంతో హుందాగా, స్టైలిష్‌గా కనిపించారు. చూపులతోనే ఆయన సన్నివేశాన్ని రక్తికట్టించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో మెహన్‌లాల్‌ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. సయ్యద్ మసూద్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మెప్పించాడు. టోవినో థామస్‌, కన్నడ కిషోర్‌, మంజు వారియర్‌ పాత్రలకు అభినయానికి పెద్దగా స్కోప్‌ లేదు కానీ తన పరిధుల మేరకు నటించారు. ఫోటోగ్రఫీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

లూసిఫర్‌లో ఉన్న ఎమోషన్‌, పొలిటికల్‌ డ్రామను ఎల్‌2, ఎంపురాన్‌లో జోడించే విషయంలో దర్శకుడు విఫలమయ్యడు. దర్శకుడి టేకింగ్‌, మేకింగ్‌ చాలా హైస్టాండర్స్‌లో, హాలీవుడ్‌ మేకింగ్ స్టయిల్‌లో ఉన్నా కథను, సన్నివేశాలను రాసుకోవడంతో కసరత్తలు చేయకపోవడంతో సినిమా యావరేజీ స్థాయిలోనే ఉండిపోయింది. స్టయిలిష్‌ మేకింగ్‌, స్టయిలిష్‌ యాక్షన్‌ సన్నివేశాలను ఇష్టపడేవారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రెగ్యులర్‌ సినీ ఆడియన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఆకట్టుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.