ధనుశ్ తన కెరియర్ లో తొలిసారిగా నటించిన ఇంగ్లిష్ మూవీ 'ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 2019 జూన్ లో విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక ఫ్రెంచ్ నవల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి, కెన్ స్కాట్ దర్శకత్వం వహించాడు. అడ్వెంచర్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో రాజ్ కుమార్ .. ఆయన తల్లి సరోజ జీవిస్తూ ఉంటారు. రాజ్ కుమార్ కి ఊహ తెలియడం మొదలవుతుంది. తనకి తండ్రి లేడనీ .. అలాగే తాము చాలా పేదవాళ్లమనే విషయం అర్థమవుతుంది. తన తండ్రి ఎవరనేది తెలుసుకోవాలి. అలాగే తాము బాగా డబ్బున్నవాళ్లం కావాలనే కోరిక బలపడుతుంది. ఈ రెండు విషయాలను గురించిన ఆలోచనలతోనే పెద్దవాడవుతాడు.
జీవితం ఒక మేజిక్ ల జరిగిపోవాలని కోరుకునే రాజ్ కుమార్, డబ్బు సంపాదించడం కోసం మేజిక్ ను మార్గంగా ఎంచుకుంటాడు. ఒక రోజున అతని తల్లి చనిపోతుంది. చాలా కాలం క్రితం తన తండ్రి .. తన తల్లికి రాసిన లెటర్ అతని కంటపడుతుంది. మేజిక్ చేయడమనేది తన తండ్రి నుంచే తనకి వచ్చిందనే విషయం అతనికి అర్థమవుతుంది. తన తండ్రి ప్యారిస్ లో ఉంటున్నాడని, ప్రతి ఆదివారం ఐఫిల్ టవర్ దగ్గర ఆయన మేజిక్ ప్రదర్శన ఉంటుందని తెలుసుకుంటాడు.
తన తండ్రిని కలుసుకోవాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకు అవసరమైన డబ్బును అతి కష్టం మీద సమకూర్చుకుంటాడు. తండ్రి సమక్షంలోనే తల్లి అస్థికలను ప్యారిస్ లో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రిని కలుసుకోవాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ముంబైలోని ఒక స్లమ్ ఏరియాకి చెందిన యువకుడు, ప్యారిస్ లోని తన తండ్రిని కలుసుకోవాలని అనుకుంటాడు. నిజానికి ఇది చాలా అసాధ్యమైనదిగా అనిపించే విషయం. అయితే సంకల్పం బలమైనదే అయితే సాధించలేనిది లేదు అనుకోగలిగితే ఇది సాధ్యమే. అలా ఒక బలమైన సంకల్పంతో ప్యారిస్ కి బయల్దేరిన ఒక యువకుడి జర్నీకి సంబంధించిన కథ ఇది.
ఈ కథలో కనిపించే తల్లి పట్ల హీరోకి ఎంతో ప్రేమ ఉంటుంది. అలాగే తన తండ్రి ఎవరనేది తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటుంది. అలాగే తాను ఇష్టపడిన యువతిని దక్కించుకోవాలనే ఆరాటం ఉంటుంది. ఈ మూడు అంశాలు కూడా హీరో వైపు నుంచి ఎమోషన్స్ ను టచ్ చేసేవే. కానీ అలాంటి ఫీల్ ను ఏ మాత్రం కనెక్ట్ చేయలేకపోయిన కంటెంట్ ఇది అనే చెప్పవలసి ఉంటుంది.
హీరో తన స్థాయికి మించిన ఆలోచన చేశాడు. తన తండ్రిని కలుసుకోవడానికి అతనికి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనే అంశాలపైనే ఆడియన్స్ దృష్టి పెడతారు. అయితే ఆ ట్రాక్ అంతా కూడా అంత ఇంట్రెస్టింగ్ గా సాగదు. ఇచ్చిన కామెడీ టచ్ వర్కౌట్ కాలేదు. కథ అసలు అంశం వైపుకు వెళ్లకుండా ఎక్కడెక్కడో షికార్లు చేస్తూ ఉంటుంది. దాంతో ఎక్స్ ట్రార్డినరీగా కాకుండా అతగాడి జర్నీ సిల్లీగా సాగిపోతుంది.
పనితీరు: ధనుశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. తన పాత్రకి తగినట్టుగా అతను చేస్తూ వెళ్లాడు. అయితే ఈ కథలో అతను కాకుండా అని చూస్తే .. మరో బలమైన పాత్ర ఏదీ కనిపించదు. బలహీమైన పాత్రలతో .. పలచబడిన సన్నివేశాలతోనే ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.
ముగింపు: హీరో ప్యారిస్ కి బయలుదేరే ఉద్దేశం వేరు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత అతనికి ఆ ధ్యాస ఉండదు. అసలు సంగతి మరిచిపోయిన దర్శకుడు హీరోతో పాటు మనలను కూడా ఎక్కడెక్కడో తిప్పేసి తిరిగి ముంబై స్లమ్ ఏరియాకి తీసుకుని వచ్చి వదులుతాడు. 'ఇలాంటి జర్నీ ఇంకెప్పుడూ చేయకూడదు బాబోయ్' అని అనుకోని ఆడియన్స్ ఉండరంటే ఒట్టు!
'ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' (ఆహా) మూవీ రివ్యూ!
The Extraordinary Journey Of The Fakir Review
- ధనుశ్ చేసిన హాలీవుడ్ మూవీ
- ఈ రోజు నుంచే అందుబాటులోకి
- బలహీనమైన కథాకథనాలు
- అల్లరిచిల్లరగా సాగే సన్నివేశాలు
- కనెక్ట్ కానీ కామెడీ .. ఎమోషన్స్
Movie Details
Movie Name: The Extraordinary Journey Of The Fakir
Release Date: 2025-03-26
Cast: Dhanush, Berenice Bejo, Erin Moriarty, Barkhad Abdi, Gerard Jugnot
Director: Ken Scott
Music: Nicolas Errera
Banner: Brio Films- Vamonos Films
Review By: Peddinti
Trailer