గత కొంతకాలంగా కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ ఈసారి తన రెగ్యులర్ జానర్ యాక్షన్ నుండి రూట్ మార్చి డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అవికా గోర్ నాయికగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బసూర్ సంగీతాన్ని అందించడం విశేషం. ఇక రవి బసూర్ సంగీతం ఈ చిత్రానికి ఎంత వరకు ప్లస్ అయ్యింది. 'షణ్ముఖ'గా ఆది సాయికుమార్ విజయాన్ని అందుకున్నాడా? డివోషనల్ థ్రిల్లర్‌గా 'షణ్ముఖ' ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? తెలుసుకుందాం..
కథ: సంతాన కోసం ఎదురుచూస్తున్న విరాండ (చిరాగ్ జానీ)కు వికృత రూపంలో ఆరు ముఖాలతో పుట్టిన బిడ్డను, ఏక ముఖంతో, తేజస్సుతో నిండిన రూపం కోసం తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం క్షుద్ర శక్తుల్ని ఆశ్రయించడమే కాకుండా, తానే సొంతంగా క్షుద్రశక్తులను, వాటి పద్దతులను నేర్చుకుని.. తన కొడుకును ఏక ముఖంతో మార్చడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం కొన్ని రాశులు, నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలతో పాటు ఆరు రాశుల్ని, నక్షత్రాల్ని తన వైపుకు తిప్పుకునే శక్తులున్న క్లింకారా అలియాస్ సారా (అవికా గోర్)ను కూడా ఆ క్షుద్ర శక్తులు కోరుకుంటాయి.
క్లింకారా రక్తతర్పణంతో తన బిడ్డను సాధారణ మానవ రూపంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు విరాండ. అయితే సారాను ప్రేమించిన ఎస్సై (కార్తీక్)కు సారాను రక్షించాలని ప్రయత్నిస్తుంటాడు. మరి కార్తీక్ క్షుద్ర శక్తులను అధిగమించి సారాను ఎలా రక్షించాడు? సిటీలో వరుసగా జరుగుతున్న కిడ్నాప్‌ల రహస్యాన్ని కార్తీక్ ఎలా ఛేదించాడు? చివరగా విరాండ కొడుకు ఏక ముఖంలోకి వచ్చాడా? అసలేం జరిగింది? సినిమాలోని ట్విస్ట్‌లు ఏమిటి? తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ: డివోషనల్ టచ్‌తో కూడిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. సినిమా ప్రారంభంలో ఆసక్తిగా అనిపించినా.. అదే ఆసక్తిని ఆద్యంతం కొనసాగించలేక పోయాడు దర్శకుడు. ప్రారంభంలో డివోషనల్ టచ్‌తో కూడిన కథతో మొదలుపెట్టి మధ్యలో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా కథను టర్న్ తీసుకున్నాడు. షణ్ముఖ పుట్టుక, మదర్ సెంటిమెంట్ వరకు సినిమాను ఆసక్తికరంగా మొదలుపెట్టి మధ్యలో కొన్ని రొటిన్ క్రైమ్ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని సన్నగిల్లేలా చేశాడు దర్శకుడు. ఒక్కోసారి చాలా పాత్రలతో.. కన్‌ఫ్యూజింగ్ చేసినట్లుగా కంగాళిలా అనిపిస్తుంది. అయితే పస్ట్‌హాఫ్ పూర్తయ్యే సరికి అడవిలో జరిగే క్షుద్ర పూజలకు, కిడ్నాప్‌లకు మధ్య ఉన్న సంబంధం తెలిసిన తరువాత ఓ క్లారిటీ వస్తుంది.
కొన్ని సన్నివేశాలు బాగా ఉన్నాయి అనిపించే సరికి, ఓ నాసిరకమైన సీన్‌తో ఆ ఇంట్రెస్ట్ తేలిపోతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మొదటి అరగంట బోరింగ్ అనిపించినా, పతాక సన్నివేశాలకు ముందు వచ్చే సీన్స్, పతాక సన్నివేశాలు మళ్లీ ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలో తెలిసినప్పటికీ ఎలా చెప్పాలో తెలియక దర్శకుడు అప్పుడప్పుడు తడబడినట్లుగా అనిపిస్తుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో మాత్రం దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. సినిమాలో అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినా రవి బసూర్ తన నేపథ్య సంగీతంతో వాటిని ప్రేక్షకుల మైండ్‌లోకి దరిచేరకుండా చేశాడు.
నటీనటుల పనితీరు: పోలీస్ ఆఫీసర్ కార్తీక్‌గా ఆది మెప్పించాడు. ఆయన నటనలో మెచ్యూరిటీ కనిపించింది. పోలీస్ ఆఫీసర్‌కు కావాలసిన గెటప్‌లో ఆయన మేకోవర్ పాత్రకు తగిన విధంగా ఉంది. అవికా గోర్ క్యూట్‌గా తన హావాభావాలను పలికించింది. ప్రతి నాయకుడిగా చిరాగ్ పాత్ర పరిధి పెద్దదైనా ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దితే బాగుండు అనిపిస్తుంది. ఆదిత్య ఓం, మనోజ్ నందం, కృష్ణుడు తమ పాత్రల్లో రాణించారు. ఈ చిత్రానికి రవి బసూర్ సంగీతం, నేపథ్య సంగీతం ఆయువు పట్టు.
బలహీనమైన సన్నివేశాలను కూడా రవి బసూర్ తన నేపథ్య సంగీతంతో అలరించేలా చేశాడు. విష్ణు కెమెరా పనితనం పర్వాలేదు. దర్శకుడిగా షణ్ముగం కొన్ని కొన్ని సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కథా నేపథ్యం తగిన విధంగా సన్నివేశాలు రూపకల్పన చేసి ఉంటే షణ్ముఖ పూర్తి స్థాయిలో జనరంజకమైన సినిమాగా నిలిచేది. అయితే డివోషనల్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడి, లాజిక్‌ల గురించి ఆలోచించని ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూడొచ్చు... అయితే ఎక్కువ ఆశించి ఈ సినిమాకు వెళితే మాత్రం నిరాశ తప్పదు.
'షణ్ముఖ' సినిమా రివ్యూ
Shanmukha Review
- డివోషనల్ థ్రిల్లర్‌గా 'షణ్ముఖ'
- ఆసక్తికరమైన నేపథ్యం
- ఆకట్టుకునే రవి బసూర్ నేపథ్య సంగీతం
Movie Details
Movie Name: Shanmukha
Release Date: 2025-03-21
Cast: Aadi Sai Kumar, Avika Gor, Chirag, manoj nadam
Director: Shanmugam Sappani
Music: Ravi Basrur
Banner: Sapbro Productions
Review By: Madhu
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer