ప్రదీప్ రంగనాథన్ కి 'లవ్ టుడే' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. రీసెంటుగా ఆయన చేసిన 'డ్రాగన్' సినిమాకి కూడా థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. 37 కోట్లతో  నిర్మితమైన ఈ సినిమా, 150 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ రోజు నుంచి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.   

కథ: ఈ కథ 2014కి .. 2025 మధ్య కాలంలో జరుగుతుంది. రాఘవన్ ( ప్రదీప్ రంగనాథన్) ఒక మిడిల్ క్లాస్ యువకుడు. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న అతనిపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే రాఘవన్ మాత్రం చదువును పెద్దగా పట్టించుకోడు .. భవిష్యత్తుపై అతనికి పెద్దగా  ఆశలు కూడా ఏమీ ఉండవు. ఈ కారణంగానే తనని ఇష్టపడిన కీర్తి ( అనుపమ పరమేశ్వరన్) కి కూడా దూరమైపోతుంది. 

కీర్తి భర్త పెద్ద జాబ్ చేస్తున్నాడనీ, అందువల్లనే తనని ఆమె పక్కన పెట్టిందని భావించిన రాఘవన్, కీర్తి భర్తకంటే ఒక్క రూపాయి ఎక్కువ జీతం అందుకున్నా చాలని అనుకుంటాడు. కానీ అతను 48 సప్లీలు పూర్తి చేయవలసి ఉంటుంది. అది ఇప్పట్లో జరిగే పనికాదని భావించి, కాలేజ్ నుంచి వెళ్లిపోతాడు. తాను డిగ్రీ పూర్తి చేసినట్టుగా నకిలీ సర్టిఫికెట్లు సంపాదిస్తాడు. అందుకు అవసరమైన 10 లక్షల కోసం తండ్రి దగ్గర అబద్ధం ఆడతాడు. పొలం కాగితాలు తాకట్టు పెట్టిస్తాడు. 

నకిలీ సర్టిఫికెట్లతో మంచి జాబ్ సంపాదిస్తాడు. అక్కడ నుంచి తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు. పెద్ద బంగ్లా .. కారు .. విలాసవంతమైన జీవితం అతనికి దక్కుతుంది. కోటీశ్వరుడైన పరశురామ్, తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ముందుకు వస్తాడు. అంతా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నా సమయంలో ఒక అనూహ్యమైన సంఘట జరుగుతుంది. అదేమిటి? దాంతో రాఘవన్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ
: జీవితంలో ఎదగాలనే కోరిక అందరికి ఉంటుంది. నలుగురూ తమ గురించి చెప్పుకుంటుంటే చూడాలని ఉంటుంది. అయితే అందుకోసం కష్టపడేవారు కొందరైతే .. అడ్డదారులు తొక్కేవారు మరికొందరు. ఏదైనా గానీ శ్రమపడకుండా దొరికితే దానికి విలువ ఉండదు. దాని విలువ తెలుసుకోవాలంటే శ్రమ పడవలసిందే అనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. 

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు .. గురువు .. భార్య చాలా ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు. విజయాన్ని సాధించినప్పుడు సంతోషపడేవారిలో ఆ ముగ్గురూ ముందుంటారు. తన సంతోషం కోసం ఆ ముగ్గురినీ మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక యువకుడికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ప్రధానమైన సమస్యతో ఈ కథ పరిగెడుతుంది.

ప్రేమించిన అమ్మాయి నీ నుంచి ఏం కురుకుంటుందో తెలుసుకుని,  అది ఇవ్వడానికి ప్రయత్నించు. నీకు సాధ్యం కానిది అడుగుతుందని భావించి దూరం జరగకు .. మరొకరికి దగ్గరైందని పగబట్టకు అనే సందేశాన్ని ఇస్తుంది. ఇటు యూత్ కీ .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యే ఫీల్ ఉన్న కంటెంట్ ఇది. 

పనితీరు: ఇటు వినోదం .. అటు సందేశం కలిగిన ఈ కథను దర్శకుడు డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే .. సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కేఎస్ రవికుమార్ .. గౌతమ్ మీనన్ .. మిస్కిన్ వంటి దర్శకులకు ఇచ్చిన పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 

ప్రదీప్ రంగనాథ్ .. అనుపమ పరమేశ్వరన్ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మిస్కిన్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. నికేత్ బొమ్మిరెడ్డి ఫొటోగ్రఫీ .. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం .. ప్రదీప్ ఎడిటింగ్ ఈ కథకి చాలా బాగా సపోర్ట్ చేశాయి. కథతో పాటు ఆడియన్స్ ట్రావెల్ చేసేలా చేయగలిగాయి.

ముగింపు: జీవితంలో ఏదైనా కష్టపడి సాధిస్తేనే సమాజంలో విలువ .. గౌరవం దక్కుతాయి. అలా కాకుండా మోసం చేసి సాధించడానికి ట్రై చేస్తే, అదే విలువ .. గౌరవం అందరిముందు పోతాయి. అందుకే సక్సెస్ కి దగ్గరి దారులు వెతకొద్దు అంటూ ఇచ్చిన సందేశం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టిందని చెప్పచ్చు.