మలయాళంలో బాసిల్ జోసెఫ్ కి ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. ఓటీటీ సినిమాల ద్వారా ఆయన ఇతర భాషా ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ఆయన నటించిన 'పొన్మన్' సినిమా జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. 10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నిన్నటి నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జోతిష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం.  

కథ: అజేశ్ (బాసిల్ జోసెఫ్) ఓ జ్యుయలరీ షాపులో సేల్స్ ఏజెంటుగా పనిచేస్తూ ఉంటాడు. ఆ షాపుకి సంబంధించిన వ్యవహారాలను ఓనర్ కొడుకు ఆంబ్రోస్ చూసుకుంటూ ఉంటాడు. ఆ షాపువాళ్లు అమ్మకాలలో ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తుంటారు. పెళ్లి కూతురుకి బంగారు ఆభరణాలను ఏర్పాటు చేస్తారు. పెళ్లిరోజున చదివింపుల డబ్బుల లెక్కచూస్తారు. అందుకు తగిన బంగారం వరకూ పెళ్లికూతురుకు వదిలేసి, మిగతాది తీసుకుని వెళ్లిపోతుంటారు. 

అలా స్టెఫీ (లీజుమోల్ జోస్) పెళ్లికి 25 సవర్ల బంగారాన్ని ఏర్పాటు చేయడానికి అజేష్ ఒప్పుకుంటాడు. ఆమె అన్న బ్రూనో (ఆనంద్ మన్మథన్) మాట మేరకు ఆ నగలను అందజేస్తాడు. అయితే అనుకున్నదానికంటే చదివింపులు తక్కువగా వస్తాయి. 13 సవర్లకు డబ్బు తీసుకున్న అజేష్, మిగతా 12 సవర్ల బంగారం ఇచ్చేయమని బ్రూనోను అడుగుతాడు. పెళ్లి కాగానే ఆభరణాలు తీస్తే గొడవలైపోతాయని వాళ్లు అతనిని ఆపుతారు 

అజేష్ ఆ బంగారు ఆభరణాల కోసం పెళ్లికూతురు అత్తవారింటికి కూడా వెళతాడు. అతను ఎక్కడ స్టెఫీ భర్తకు నిజం చెబుతాడోనని అందరూ కంగారు పడుతూ ఉంటారు. తన మెడలోని నగల బరువు తగ్గితే భర్త ఊర్కోడనే విషయం స్టెఫీకి తెలుసు. ఆమె నుంచి ఆ నగలను బలవంతంగా తీసుకుందామా అంటే, ఆమె భర్త మరియం మహా దుర్మార్గుడు. అది గ్రహించిన అజేష్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? చివరికి నగలతో అక్కడి నుంచి బయట పడతాడా లేదా? అనేది మిగతా కథ.        

విశ్లేషణ: ఏం లేకపోయినా పెళ్లిళ్లు జరిగిపోతాయేమో గానీ, బంగారం లేకుండా మాత్రం పెళ్లిళ్లు జరగవు. కేవలం బంగారం విషయంలో తేడా రావడం వల్లనే చెడిపోయే సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. బంగారం అవతలివారి చేతికి వెళ్లినంత తేలికగా తిరిగి మన చేతికి రాదు. దానికి గల ఆకర్షణ .. రాజసం అలాంటిది మరి. అలాంటి బంగారం వలన ఒక యువతి .. ఒక యువకుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది? అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది.

జ్యుయలరీ షాపులో పనిచేసే ఒక యువకుడికీ .. అతను నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకున్న యువతికీ .. బంగారానికి ఆశపడి ఆమెను పెళ్లి చేసుకున్న ఆమె భర్తకి మధ్య నడిచే కథ ఇది. ఈ మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ కథను ఆసక్తికరంగా నడిపించడంలో .. కామెడీ టచ్ ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథకి తగిన లొకేషన్స్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయని చెప్పచ్చు. 

 ఆ నగలు అజేష్ కి దక్కితే అతని జాబ్ పోకుండా ఉంటుంది. స్టెఫీ దగ్గరే ఆ బంగారం ఉంటే ఆమె కాపురం నిలబడుతుంది. ఆమె భర్త ఆధీనంలోనే ఆ బంగారం ఉంటే అతని ఆశ నెరవేరుతుంది. మరి ఈ ముగ్గురితో ఆ బంగారం ఎలా దోబూచులాడుతోందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు వినోదభరితంగా ఉంటుంది. 

పనితీరు: ఇది ఒక చిన్న కథ .. తక్కువ బడ్జెట్ ను మాత్రమే అడిగే కథ. గ్రామీణ ప్రాంతంలో నడిచే కథ. అలాంటి ఈ కథను ఎంతమాత్రం బోర్ లేకుండా నడిపించగలిగారు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో పాటు, క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. కథలోని కొత్తపాయింట్ ఆడియన్స్ ను చివరివరకూ తనతో తీసుకుని వెళుతుంది. 

బాసిల్ జోసెఫ్ కి కామెడీపై ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాగే కొత్తపెళ్లి కూతురుగా లిజో మోల్ జోస్ నటన .. ఆమె రౌడీ భర్తగా సాజిన్ గోపు నటన ఆకట్టుకుంటుంది. సాను జాన్ వర్గీస్ ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి తగినట్టుగా సెట్టయ్యాయి.

ముగింపు: కొన్ని పనులు కావాలంటే నేర్పుతో పాటు ఓర్పు కూడా కావాలి. కండబలంతో తలపడలేని చోటున బుద్ధిబలంతో కార్యాన్ని సాధించాలి. అవసరానికి ముఖం చాటేసే రాజకీయనాయకులను నమ్ముకోవడం కన్నా, కష్టాన్ని నమ్ముకోవడమే మంచిది అనే సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే కంటెంట్ ఇది.