బ్రహ్మాజీ .. ఆమని ప్రధానమైన  పాత్రలను పోషించిన 'బాపు' సినిమా, ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాజు - భానుప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి 'దయ' దర్శకత్వం వహించాడు. ఈ రోజు నుంచే ఈ సినిమా 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: మల్లన్న (బ్రహ్మాజీ) ఆయన భార్య సరోజ (ఆమని) ఒక మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉంటారు. మల్లన్నకి ఒక కొడుకు .. ఒక కూతురు. కొడుకు రాజు(మణి) ఆటో నడుపుతూ ఉంటాడు. కూతురు వరలక్ష్మి (ధన్య బాలకృష్ణ) ఒక కాలేజ్ లో చదువుతూ .. గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలనే పట్టుదలతో ఉంటుంది. అదే స్కూల్లో పనిచేసే రవి (అవసరాల) ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. 

మల్లన్న తండ్రి రాజయ్య (సుధాకర్ రెడ్డి) ఆ కుటుంబానికి పెద్ద తలకాయ. ఆయన ఇచ్చిన ఒక ఎకరం పొలమే మల్లన్నకు ఆధారం. ఊళ్లో అప్పుల కారణంగా మల్లన్న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతని తండ్రి రాజయ్యను చంపేసి సహజ మరణంగా చూపించగలిగితే, సర్కారు వారి నుంచి 5 లక్షలు వస్తాయని మల్లన్నతో సరోజ చెబుతుంది. దాంతో అతను ఆలోచనలో పడతాడు. 

 అదే ఊళ్లో లచ్చవ్వ (గంగవ్వ) కొడుకు చంటి (రచ్చరవి) జేసీబీ ఆపరేటర్ గా ఉంటాడు. అతను ఒకరోజున జేసీబీతో పనిచేస్తూ ఉండగా, పురాతన కాలం నాటి ఒక బంగారు విగ్రహం బయటపడుతుంది. చంటి మూడో కంటికి తెలియకుండా దానిని తీసుకొచ్చి పెట్టెలో భద్రపరుస్తాడు. అయితే అలాంటి వాటి వలన కలిసిరాదని నమ్మిన లచ్చవ్వ, ఆ విగ్రహాన్ని ఒక బావిలో పడేస్తుంది. ఆ బావిని పూడిక తీసినప్పుడు ఆ విగ్రహం రాజయ్యకి దొరుకుతుంది. అయితే మతిమరుపుతో బాధపడుతున్న రాజయ్య ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచింది మరిచిపోతాడు.  

ఈ విషయం తెలియని మల్లన్న దంపతులు రాజయ్యను చంపాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఆ బంగారు విగ్రహం ఎవరి సొంతమవుతుంది? వరలక్ష్మి వివాహం రవితో జరుగుతుందా?  అనేది కథ.

విశ్లేషణ: డబ్బుకి చాలా పవర్ ఉంది .. ఎవరిని ఎలాగైనా మార్చే శక్తి దానికి ఉంది. అవసరాలు .. ఆపదలు ఎదురైనప్పుడు, తమ పరువు ప్రతిష్ఠలు పోతాయనుకున్నప్పుడు చాలామంది ఎంతకి తెగించడానికైనా సిద్దపడుతూ ఉంటారు. ప్రేమానురాగాలను పక్కన పెట్టేసి ప్రవర్తిస్తూ ఉంటారు. అలా కన్నతండ్రిని చంపడానికి ఒక కొడుకు చేసే ప్రయత్నాల చుట్టూ, తమ అవసరాల కోసం అందుకు సహకరించే మిగతా కుటుంబ సభ్యుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

దర్శకుడు ఒక ఐదుగురు కుటుంబ సభ్యులు కలిగిన కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఒక్కో పాత్రకి ఒక్కో ట్రాక్ సెట్ చేసుకున్నాడు. ఈ ఐదు పాత్రలు ఆ గ్రామంలోనివారితో కనెక్ట్ అయ్యుంటాయి. తమ అవసరాలు తీరడం కోసం ఏం చేయాలనే విషయంలో వాళ్లంతా ఒక క్లారిటీకి వచ్చే అంశాలను దర్శకుడు చెబుతూ వెళ్లిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 

సాధారణంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి బ్రతకాలనుకుంటారు. కానీ ఆ కుటుంబం కోసం చనిపోవాల్సి వస్తే ఎవరు చనిపోవాలి? అనే ప్రశ్న వేసుకుంటే, ఎవరికి వారు కంగారు పడిపోతారు. కానీ ఆ ఇంటి పెద్దాయన వయసైపోయిన తాను చనిపోవడమే కరెక్ట్ అనుకుంటాడు. కానీ మతిమరుపు కారణంగా అతను ఆ విషయాన్ని మరిచిపోతే ఏం జరుగుతుందనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. 
 
పనితీరు: దర్శకుడు ఒక వైపున బంగారు విగ్రహం .. మరో వైపున పెద్దాయన ప్రాణాల చుట్టూ ఈ కథను తిప్పుతాడు. కొంత కథ నడిచిన తరువాత బంగారు విగ్రహం ట్రాక్ బలహీనపడుతుంది.  పెద్దాయన ప్రాణాలకి సంబంధించిన ట్రాక్ హైలైట్ అవుతుంది. అలా కాకుండా ఈ రెండు ట్రాకులను సమాంతరంగా నడిపిస్తే బాగుండేదనిపిస్తుంది. 

 దర్శకుడు ఈ కథను చెప్పడానికి ఎంచుకున్న విలేజ్ బాగుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన బ్రహ్మాజీ .. ఆమని .. సుధాకర్ రెడ్డి .. రచ్చ రవి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. వాసు పెండెం ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆహ్లాదకరమైన పల్లె అందాలను ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. అనిల్ ఆలయం ఎడిటింగ్ ఓకే.

ముగింపు: తమ సుఖాలకు .. సంతోషాలకు .. అవసరాలకు అడ్డురానంత వరకు మాత్రమే అవతల వారిని ప్రేమగా చూసే రోజులివి. ఒకవేళ అడ్డొస్తే .. అడ్డుతప్పించి వెళ్లిపోవడమే అనుకునే ఒక కుటుంబం కథ ఇది. మారుతున్న కాలానికీ .. డబ్బు చుట్టూ తిరిగే సమాజానికి అద్దం పడుతూ సాగే ఈ కథ, కొందరినైనా ఆలోచింపజేస్తుంది.