మలయాళంలో 'లవ్ అండర్ కన్ స్ట్రక్షన్' వెబ్ సిరీస్ రూపొందింది. నీరజ్ మాధవ్ .. గౌరీ కిషన్ .. అజూ వర్గీస్ .. ఆనంద్ మన్మథన్ .. ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా నిర్మించారు. విష్ణు జి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, క్రితం నెల 28వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: వినోద్ (నీరజ్ మాధవ్) దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు కేరళలో నివసిస్తూ ఉంటారు. తన చిన్నతనంలో సొంత ఇంటిని కోల్పోవలసి రావడం .. ఆ సమయంలో తల్లిదండ్రులు పడిన బాధ అతనికి గుర్తు ఉంటుంది. అందువలన సొంత ఇంటిని కట్టించి .. వాళ్ల కళ్లలో సంతోషాన్ని చూడాలనేది అతని ఆశ. వినోద్ డబ్బు పంపిస్తూ ఉంటే అతని కజిన్ పద్మరాజన్ ( అజూ వర్గీస్) ఇంటిపనులు చూస్తుంటాడు. 

పద్మరాజన్ తల్లికి జాతకాల పిచ్చి ఎక్కువ. అందువలన అతని పెళ్లి ఆలస్యమవుతూ ఉంటుంది. పెళ్లి చూపులు చూసి చూసి అతను అలసిపోతాడు. ఒకసారి పద్మరాజన్ కి దుబాయ్ నుంచి కొత్త ఫోన్ పంపించాలని వినోద్ అనుకుంటాడు. తన అపార్టుమెంటు అసోసియేషన్ సెక్రటరీ కూతురు గౌరి దుబాయ్ నుంచి కేరళకి వస్తుందనీ, ఆమెతో ఆ ఫోన్ పంపించమని వాళ్లను పద్మరాజన్ కలుపుతాడు. అప్పటి నుంచి వినోద్ - గౌరీ మధ్య ప్రేమ మొదలవుతుంది. 

ఇంటి నిర్మాణం మధ్యలో ఉండగా వినోద్ జాబ్ పోతుంది. దాంతో పెళ్లి చేసుకుని కెనడా వెళ్లాలని వినోద్ - గౌరీ నిర్ణయించుకుంటారు. ఈ లోగా తమ పెళ్లికి పెద్దలను ఒప్పించాలని భావిస్తారు. ఇద్దరూ కలిసి తమ సొంత ఊరుకు చేరుకుంటారు. అయితే వాళ్ల పెళ్లికి గౌరీ తండ్రి ఎంతమాత్రం ఒప్పుకోడు. వినోద్ ఉద్యోగం .. ఇల్లు .. పెళ్లి .. కెనడా ప్రయాణం ఒకదానికి ఒకటి ముడిపడిపోతాయి. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: జీవితంలో సొంత ఇల్లుకట్టుకోవడం .. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలామంది కనే ఒక కల. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లైఫ్ హ్యాపీగా సాగిపోతున్నప్పుడు చాలామంది చాలా రకాల ప్రణాళికలు వేసుకుంటారు. అయితే ఆ ప్రణాళికలు ఆచరణలో పెట్టినప్పుడు, హఠాత్తుగా పరిస్థితులు ఎదురు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది ఈ సిరీస్ కథ. 

సాధారణంగా పిల్లలు ఎదుగుతూ ఉంటే సంతోషపడే తల్లిదండ్రులు, వాళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం భయపడుతూ ఉంటారు. అబ్బాయి అయితే ఎవరి వలలో పడతాడో అని అతని పేరెంట్స్, అమ్మాయి అయితే తన ఇష్టానుసారం చేస్తోందని ఆమె పేరెంట్స్ చిరాకు పడుతూ ఉంటారు. అలాంటి తల్లిదండ్రుల వలన పిల్లలు ఎంతగా సఫర్ అవుతారనేది పాయింటును ఈ సిరీస్ లో టచ్ చేశారు. 

నువ్వు ఏ పని మొదలుపెట్టనంత వరకూ ప్రపంచం ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా ఒక పనిలోకి దిగితే, అడుగడుగునా అవినీతిపరులు తగులుతారు. వాళ్లను మార్చడానికి ప్రయత్నిస్తే నీకే ఫైన్ పడుతుందనే సత్యాన్ని కామెడీ టచ్ తో చెప్పిన కథ ఇది. కథలో ట్విస్టులు గట్రా ఏమీ ఉండవు. సహజత్వంతో సాగిపోయే సన్నివేశాలే మనసుకు పట్టుకుంటూ ఉంటాయి ..  ఆకట్టుకుంటూ ఉంటాయి.

పనితీరు: అమ్మానాన్నల కోసం సొంత ఇంటిని కట్టాలి .. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునే ఒక యువకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది? అనేది కథ. ఈ కథకు తగిన పాత్రలను ఎంపిక చేసుకోవడం .. సన్నివేశాలను సహజంగా .. వినోదభరితంగా ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ప్రతి పాత్ర నుంచి మంచి అవుట్ పుట్ ను రాబట్టారు. గోపీసుందర్ నేపథ్య సంగీతం ప్రధాన బలమని చెప్పాలి. అజయ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. దుబాయ్ నేపథ్యంలో సన్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అర్జూ బెన్ ఎడిటింగ్ కి వంకబెట్టవలసిన పని లేదు. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూడదగిన కంటెంట్ ఇది.