'పలాస 1978' మూవీ రివ్యూ

06-03-2020 Fri 16:28
Movie Name: palasa
Release Date: 2020-03-06
Cast: Rakshit, Nakshatra, Raghu Kunche, Thiruveer, Mirchi Madhavi  
Director: Karuna Kumar 
Producer: Dhyan Atluri 
Music: Raghu Kunche 
Banner: Sudhas Media

'పలాస'లో 1970 ప్రాంతంలో జరిగిన ఒక యథార్థ సంఘటనకి కొన్ని కల్పితాలను జోడించి ఆవిష్కరించిన కథ ఇది. జానపద కళను నమ్ముకుని బతికే ఐక్యత కలిగిన ఇద్దరు అన్నదమ్ములు ఒక వైపు, గ్రామంపై పెత్తనం కోసం పోరాడే సఖ్యతలేని మరో ఇద్దరు అన్నదమ్ములు ఇంకోవైపు. ప్రధానంగా ఈ నాలుగు పాత్రల చుట్టూనే సహజత్వానికి దగ్గరగా ఈ కథ తిరుగుతుంది. కుల వివక్ష కారణంగా అణచివేతకుగురై, పెత్తందారులపై తిరుగుబాటు చేసిన అన్నదమ్ముల కథగా సాగే ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.   

ఒకప్పుడు గ్రామీణ వ్యవస్థలో కుల వివక్ష ఎక్కువగా వుండేది. పెత్తందారులు గ్రామాలను తమ గుప్పెట్లో పెట్టుకుని, రాజకీయ పరమైన అండదండలతో చెలరేగిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో కుల వివక్షకు గురైనవారు తిరుగుబాటు శంఖం పూరించడం .. పెద్దల పేరుతో చేస్తున్న అక్రమాలకు స్వస్తి పలకడం తరహా కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలా 'పలాస'లో 1970లలో జరిగిన ఒక సంఘటనను తీసుకుని, దాని చుట్టూ కథ అల్లుకుని దర్శకుడు కరుణ కుమార్ ఈ రోజున దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందన్నది ఇప్పుడు చూద్దాం.

1970 ప్రాంతంలో 'పలాస'లో నడిచే ఈ కథలో .. సుందరయ్య జానపద కళను నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆయన ఇద్దరు కొడుకులైన మోహన్ రావు (రక్షిత్) .. రంగారావు (తిరువీర్)  తండ్రి నుంచి వచ్చిన జానపద కళనే నమ్ముకుని జీవిస్తుంటారు. అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. గౌరీ అనే అమ్మాయిని రంగారావు ప్రేమిస్తుండగా, లక్ష్మి (నక్షత్ర) అనే యువతిపై మోహన్ రావు మనసు పారేసుకుంటాడు. కొన్ని పరిస్థితుల కారణంగా అన్నకంటే ముందుగానే తమ్ముడు పెళ్లి చేసుకుంటాడు.

ఇక ఆ ఊరికి పెద్ద షావుకారుగా లింగమూర్తి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటాడు. ఆయన తమ్ముడు గురుమూర్తి అన్నతో వున్న విభేదాల కారణంగా వేరే ఉంటూ, అన్నను దెబ్బతీయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. లింగమూర్తిని బైరాగి అనే ఒక బలవంతుడు కనిపెట్టుకుని ఉండటం వలన అంతా ఆయనకి భయపడుతుంటారు. అలాంటి బైరాగిని తన అన్నకోసం మోహన్ రావు హత్య చేస్తాడు. అలా జైలు పాలైన అన్నదమ్ములను గురుమూర్తి తన స్వార్థం కోసం బెయిల్ పై విడిపిస్తాడు.

గురుమూర్తి విషయంలోనే రంగారావు - మోహన్ రావు మధ్య మనస్పర్థలు వస్తాయి. దాంతో ఇద్దరూ విడిపోయి లింగమూర్తి వైపు రంగారావు .. గురుమూర్తి వైపు మోహన్ రావు నిలబడతారు. రాజకీయంగా తన కొడుకు తారకేశు ఎదగాలంటే, అవతల పార్టీలో మోహన్ రావు నుంచి గట్టిపోటీ ఉందనీ, అతన్ని హత్య చేస్తే ఎమ్మెల్యేని చేస్తానని రంగారావుకు లింగమూర్తి ఆశ పెడతాడు. దాంతో తన తమ్ముడిని హత్య చేయడానికి రంగారావు సిద్ధపడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దాని పరిణామాలు ఎలా ఉంటాయి? అనేది మిగతా కథ.

దర్శకుడు కరుణ కుమార్ ఈ కథపై చాలా కసరత్తు చేసినట్టు కనిపిస్తుంది. కథను తీర్చిదిద్దిన తీరులో .. పాత్రలను మలిచిన విధానంలో .. కథనాన్ని నడిపించిన పద్ధతిలో ఎక్కడా తడబాటు కనిపించదు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ పరిధి తక్కువే అయినా, ఓ చిన్నపాటి అందమైన ప్రేమకథతో పాటు, ఎత్తులు .. పైఎత్తులు .. వ్యూహాలను పట్టుగా ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. బైరాగి హత్య .. లింగమూర్తి హత్య .. రంగారావు హత్యకి సంబంధించిన పథకాలను ఆచరణలో పెట్టే సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించిన తీరు హైలైట్ గా నిలుస్తాయి. జానపద కళ నేపథ్యంలో సాగే కథ కావడం వలన, సంగీతం పరంగా దర్శకుడు తీసుకున్న శ్రద్ధ కూడా అభినందనీయంగా అనిపిస్తుంది.  

ఈ సినిమాకి ఇద్దరు కథానాయకులు .. ఇద్దరి ప్రతినాయకులు అన్నట్టుగా దర్శకుడు ఈ కథను నడిపించడం విశేషం. కథానాయకులు అన్నదమ్ములే .. ప్రతినాయకులు అన్నదమ్ములే కావడం మరో విశేషం. మనస్పర్థలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఆధిపత్యం కోసం వేరే అన్నదమ్ములను విడదీయడానికి ప్రయత్నించడమనే అంశం ఈ కథలో బలమైనదిగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కథానాయకుల వైపు నుంచి కావలసిన ఎమోషన్స్ ను రాబట్టాడు. ఏ పాత్రను ఎక్కడ ప్రవేశ పెట్టాలో అక్కడే ఆయన ఆ పాత్రను ప్రవేశ పెట్టాడు. చివరి వరకూ ఆ పాత్రల స్వరూప స్వభావాలను కాపాడుతూ వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ సెబాస్టియన్ పాత్ర కూడా అందుకు ఒక ఉదాహరణ.

ప్రధానమైన .. ముఖ్యమైన పాత్రల్లో నటించిన వాళ్లంతా చాలా సహజంగా చేశారు. ప్రతి సన్నివేశంలోనూ పాత్రలే తప్ప, పాత్రధారులు కనిపించరు. ఈ కథ మన మధ్య .. మన కళ్ల ముందర జరుగుతున్నట్టుగా అనిపించేలా చేయడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. ఇక సంగీతం పరంగా చూసుకుంటే, రఘు కుంచె బాణీలు ఆకట్టుకునేలా వున్నాయి. 'పలాస' ప్రత్యేకతను కళ్ల ముందుంచే 'ఏ ఊరు' .. 'బావొచ్చాడో  .. 'ఎంత బాగున్నాడో' అనే స్టేజ్ సాంగ్ .. 'నీ పక్కన పడిందో లేదో' అనే సాంగ్స్ బాగున్నాయి. ఈ పాటలన్నీ కూడా జానపద బాణీలో హుషారుగా సాగుతూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. ఇక రీ రికార్డింగ్ కూడా సన్నివేశాల్లో నుంచి ప్రేక్షకులు జారిపోకుండా చూసుకుంది. కథలో అనేక మలుపులు వున్నాయి .. అయినా ప్రేక్షకులు ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా కోటగిరి వెంకటేశ్వరరావు చేసిన ఎడిటింగ్ బాగుంది. ఇక అరుళ్ విన్సెట్ ఫొటో గ్రఫీ ఈ సినిమాకి హైలైట్. ఆయన లైటింగ్ చేసిన తీరు సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. జానపద బాణీలో జోరుగా సాగే పాటలకి కొరియోగ్రఫీ కూడా బాగుంది. ప్రతినాయకుడిగా లింగమూర్తికి రాసిన కొన్ని డైలాగ్స్ పేలాయి.

బలమైన కంటెంట్ ఉన్నప్పటికీ ఈ తరహా సినిమాలు ఒక తరగతి ప్రేక్షకులకు మాత్రమే పరిమితమవుతాయి. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ కంటెంట్ కాస్త దూరంగా వెళుతుంది. అక్కడక్కడా రక్తపాతం కనిపిస్తుంది .. పిల్లలు వినకూడని డైలాగ్స్ వినిపిస్తాయి .. చూడకూడని దృశ్యాలు మెరుస్తాయి. చివర్లో జాతి .. కులం .. మతం అనే మాటలు కాస్త ఘాటుగా అనిపిస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే, సహజత్వానికి కాస్త దగ్గరగా వుండే సినిమాను చూడాలనుకునేవారికీ .. సింగిల్ గా థియేటర్ కి వెళ్లినవారికి ఈ సినిమా నచ్చుతుంది.      More Articles
Advertisement 1
Telugu News
DDL gets rare honour
'డీడీఎల్'కి అరుదైన గౌరవం.. లండన్ లో షారుఖ్, కాజోల్ కాంస్య విగ్రహం!
11 hours ago
Vijay Sethupathi out of Muralitharan biopic 800
మురళీధరన్ ప్రకటన తర్వాత.. బయోపిక్ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి!
14 hours ago
Aamir Khan wounded in shooting
అమీర్ ఖాన్ పక్కటెముకకు గాయం?
15 hours ago
Mohan Babu to be cast in Malayalam remake
మరో మలయాళం రీమేక్ లో మోహన్ బాబు!
16 hours ago
Anu Emmanuel plays another female lead role in Mahasamudram
'మహాసముద్రం'లో మరో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్
17 hours ago
Varalakshmi turned director
దర్శకురాలిగా మారిన కథానాయిక వరలక్ష్మి!
19 hours ago
akhil new movie teaser releases
‘కెరీర్‌ను సెట్ చేశాను.. కానీ ఈ వివాహ జీవితమే..’ అంటున్న అఖిల్.. కొత్త సినిమా ప్రీ టీజర్! ప్రీ టీజర్ విడుదల
21 hours ago
Samanta to be part of Trivikram flick
త్రివిక్రమ్ సినిమాలో మరోసారి సమంత?
23 hours ago
Big Bomb on Master by Kumar Sai
మాస్టర్ పై పగ తీర్చుకుంటూ... బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి!
23 hours ago
Actress Anitha Turned Mom
తల్లి కాబోతున్న నటి అనిత... సీమంతం చిత్రాలు వైరల్!
1 day ago