'ఎగ్జుమా' .. హారర్ జోనర్లో రూపొందిన కొరియన్ సినిమా. క్రితం ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. జాంగ్ జే  హ్యూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చోయ్ మిన్ - సిక్, కిమ్ గో ఇయున్ .. యు హే జిన్ .. లీదో హ్యూన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంటుగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ: పార్క్ జీ యోంగ్ కొరియాకు చెందిన యువకుడు. అతను తన కుటుంబంతో కలిసి అమెరికాలో నివసిస్తూ ఉంటాడు. అతని భార్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. పుట్టిన దగ్గర నుంచి  ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉంటాడు .. అందుకుగల కారణం ఏమిటనేది డాక్టర్లు చెప్పకపోవడంతో, అతీంద్రియ శక్తుల విషయంలో అనుభవం ఉన్న లీ హారీమ్ (కిమ్ జో ఎన్) బోంగిల్ (లీ డ్యూ హ్యాన్)ను  కొరియా నుంచి పిలిపిస్తాడు. 

పార్క్ కొడుకును ఆ ఇద్దరూ పరిశీలనగా చూస్తారు. పార్క్ తాత ప్రేతాత్మ ఆ కుటుంబంపై కోపంతో ఉందనీ, అతని కారణంగానే ఆ పిల్లాడు చికాకు చేస్తున్నాడని వాళ్లు చెబుతారు. పార్క్ తాత శవాన్ని పూడ్చిన చోటు మంచిది కాదనీ, అక్కడి నుంచి దానిని వెలికితీసి మరో ప్రదేశంలో పూడ్చడం వలన ఆ ప్రేతాత్మ శాంతిస్తుందని చెబుతారు. ఈ విషయంలో అనుభవం ఉన్న 'కిమ్' (చోయ్ మిన్ సిక్), తన సహచరుడైన 'కో'తో కలిసి వాళ్లకి సహకరించడానికి ముందుకు వస్తాడు.

నలుగురూ కలిసి అడవిలోని ఒక కొండపై గల పార్క్ తాత సమాధిని తవ్వుతారు. అయితే వర్షం కారణంగా ఆ శవపేటికను మరో చోటుకు తరలించలేకపోతారు. ఆ శవపేటికలో నిధి ఉండొచ్చని ఒక వ్యక్తి దానిని తెరవడానికి ప్రయత్నించగా, అందులోని ప్రేతాత్మ బయటికి వస్తుంది. కొంతమందిపై ప్రతీకారం తీర్చుకునే దిశగా అది ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అదే సమాధిలో నుంచి మరో శవపేటిక బయటపడుతుంది. ఆ శవపేటిక ఎవరిది? దానిని వెలికితీయడం వలన చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేది కథ. 

విశ్లేషణ: ప్రేతాత్మలకు సంబంధించిన కథలు దాదాపుగా ఒకేలా మొదలవుతూ ఉంటాయి. ప్రేతాత్మకు ఎవరో ఒకరి వలన విడుదల లభిస్తుంది. అప్పటికే ప్రతీకారంతో రగిలిపోతున్న ఆ ప్రేతాత్మ వాళ్లపై పగతీర్చుకోవడం మొదలుపెడుతుంది. ఎవరెవరిని ఆ దెయ్యం ఎలా చంపుతుంది? అనేది అందరిలో ఆసకిని రేకేతించే అంశంగా మారుతుంది. ఇది కూడా అలాంటి ఒక రొటీన్ కథనే కదా అని అనుకుంటారు. 

ఆల్రెడీ ఒక ప్రేతాత్మ బయటికి వచ్చి తన పని కానిస్తూ ఉంటుంది. ఇక ఇంతకుమించి కథలో ఏముంటుంది? అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఒక సమాధిలో నుంచి మరో శవపేటిక బయటపడుతుందో, అప్పటి నుంచి కథ మరింత ఉత్కంఠ భరితంగా మారుతుంది. చాలాకాలం క్రితం జరిగిన దేశాల మధ్య యుద్ధంతో పాటు, కొరియన్ ప్రజల విశ్వాసాలతో ముడిపడినదిగా ఈ కథ నడుస్తుంది. అయితే తెరపై ప్రేతాత్మలను భయంకరంగా చూపించకుండానే భయపెట్టిన దర్శకుడు, రక్తపాతంతో మాత్రం హడలెత్తించాడు. 

పనితీరు: సాధారణంగా హారర్ జోనర్లోని సినిమాలలో పెద్దగా కథ కనిపించదు. సింపుల్ లైన్ పట్టుకుని వెళ్లిపోతుంటారు. సౌండ్ ఎఫెక్స్ట్ .. కెమెరా పనితనం పైనే ఎక్కువగా ఆధారపడుతూ  ఉంటారు. కానీ ఈ సినిమా రెండు శవపేటికలను .. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంతో ముడిపెడుతూ కథను అల్లుకున్న తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.

కథ ప్రకారం చీకట్లో చిత్రీకరించే సన్నివేశాలు ఎక్కువ. అలాంటి సన్నివేశాలను ఆవిష్కరించడంలో ఫొటోగ్రఫీ మెప్పిస్తుంది. అలాగే కథకి తగిన మూడ్ లోకి తీసుకుని వెళుతూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా ఓకే.

ముగింపు
: కథాకథనాల పరంగా ఆకట్టుకుంటుంది. భయపడుతూనే ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఇది ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. అయితే రక్తపాతంతో పాటు జుగుప్సాకరమైన కొన్ని దృశ్యాలను అందరూ చూడలేరు. అలాంటివారు ఈ సినిమాను చూడకపోవడమే బెటర్.