కిచ్చా సుదీప్ కి కన్నడలో స్టార్ హీరోగా మంచి క్రేజ్ ఉంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే, ఇతర భాషలలో నటించడానికి కూడా సుదీప్ ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటాడు. అందువలన ఇతర భాషలలోను ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అలాంటి సుదీప్ నుంచి క్రితం ఏడాది డిసెంబర్ 25న థియేటర్లకు 'మ్యాక్స్' మూవీ వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్న రాత్రి నుంచి 'జీ 5'లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. 

కథ: మినిస్టర్ పరశురామ్ (శరత్ లోహితస్య) మినిస్టర్ డేనియల్ (ఆడుకాలం నరేన్) రాజకీయంగా చక్రం తిప్పడం తెలిసినవారు. బలమైన అనుచరులను పెంచి పోషిస్తూ, తమకి అందరూ భయపడేలా చేయగలుగుతారు. వాళ్లకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేవారు గానీ .. ఒకవేళ చెప్పినా కేస్ ఫైల్ చేసే పోలీస్ ఆఫీసర్ గాని ఆ ప్రాంతంలో లేరు. అందువలన ఆ ప్రాంతానికి కొత్తగా రావడానికి మిగతా పోలీస్ ఆఫీసర్స్ భయపడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ గా ఆ ఊరికి 'మ్యాక్స్' వస్తాడు. 

పరశురామ్ - డేనియల్ కొడుకులైన మైఖేల్ - వీరా ఇద్దరూ మంచి స్నేహితులు. తండ్రుల అధికారం చూసుకుని, ఇద్దరూ తమ ఇష్టానుసారంగా నడచుకుంటూ ఉంటారు. ఒకసారి వాళ్లు పోలీసులపై చేయిచేసుకోవడంతో, మ్యాక్స్ వాళ్లను అరెస్టు చేసి సెల్లో వేస్తాడు. అయితే అనుమానస్పద స్థితిలో వాళ్లిద్దరూ చనిపోతారు. అది ఎలా జరిగిందనేది ఎవరికీ తెలియక అయోమయానికి లోనవుతారు. ఈ విషయం పరశురామ్ - డేనియల్ కి తెలిస్తే తమని చంపేస్తారని పోలీసులు భయపడుతూ ఉంటారు. 

మైఖేల్ - వీరా ఇద్దరి శవాలను అక్కడి నుంచి రహస్యంగా తరలించేద్దామనీ, తాము వాళ్లని వదిలేసినట్టుగా పరశురామ్ గ్యాంగ్ తో చెబుదామని మ్యాక్స్ అంటాడు. అందుకు అందరూ ఒప్పుకుంటారు. ఆ ఇద్దరి శవాలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుండగానే, పరశురామ్ - డేనియల్ అనుచరులు పోలీస్ స్టేషన్ ను చుట్టుముడతారు. అప్పుడు మ్యాక్స్ ఏం చేస్తాడు? ఆ రాజకీయనాయకుల వలన పోలీసులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మైఖేల్ - వీరా మరణానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అధికారంలో ఉన్న కొంతమంది రాజకీయనాయకులకు అహంకారం ఉంటుంది. అలాంటివారి వారసులలో ఎక్కువమంది కాస్త దూకుడుగానే ఉంటారు. ఇలాంటివారికి ఫ్యామిలీ ఉన్న పోలీసులు సహజంగానే భయపడుతూ ఉంటారు. అయితే అలా భయపడే పోలీసులకు ధైర్యం చెబుతూ, రాజకీయ నాయకుల బారి నుంచి వారిని కాపాడే ఆఫీసర్లు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ కథనే 'మ్యాక్స్'.

ఆంగ్లేయుల కాలంనాటి ఒక పాత పోలీస్ స్టేషన్ .. ఛార్జ్ తీసుకోవడానికి హీరో అక్కడ అడుగుపెట్టడంతో ఈ కథ మొదలవుతుంది. మ్యాక్స్ ముక్కుసూటి మనిషి .. ఎవరికీ భయపడడు. కానీ స్టేషన్లో జరిగిన హత్యల బారి నుంచి పోలీసులను కాపాడే బాధ్యతను తీసుకుంటాడు. అలా ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఆ పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అదే సమయంలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ 'రూప'గా వరలక్ష్మి శరత్ కుమార్ ను రంగంలోకి దింపడంతో కథ మరింత వేడెక్కుతుంది.      

పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకుల వారసుల శవాలు .. బయట రాజకీయనాయకుల అనుచరులు .. వాళ్లకి అనుకూలంగా నడుచుకునే ఆఫీసర్ 'రూప' .. ఇలా మూడు వైపుల నుంచి ముంచుకొస్తున్న ముప్పును హీరో ఎలా డీల్ చేశాడనే అంశమే ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతుంది. అయితే కథా నేపథ్యం .. కొన్ని అంశాలు .. స్క్రీన్ ప్లే .. మనకి కార్తి 'ఖైదీ' సినిమాను గుర్తుకు తెస్తాయి. మొత్తంగా చూసుకుంటే యావరేజ్ మూవీ అనిపిస్తుంది. 

పనితీరు: సుదీప్ - వరలక్ష్మి శరత్ కుమార్ నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. శరత్ లోహితస్య - ఆడుకాలం నరేన్ .. సునీల్ కీలకమైన పాత్రలను పోషించారు అనడం కన్నా, కీలకమైన పాత్రలలో కనిపించారు అనడమే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆ పాత్రలకు తగిన పవర్ లోపించడమే అందుకు కారణంగా మనకి కనిపిస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ ఇంట్రెస్టింగ్ గానే అనిపించినప్పటికీ, ఆ పాత్రను అదే గ్రాఫ్ లో ముందుకు తీసుకుని వెళ్లలేకపోయారు. 

శేఖర్ చంద్ర ఫొటోగ్రఫీ బాగుంది. అజనీశ్ లోక్ నాథ్ నేపథ్య సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది. గణేశ్ బాబు ఎడిటింగ్ విషయానికి వస్తే, అక్కడక్కడ కొన్ని సీన్స్ ట్రిమ్ చేయవచ్చని అనిపిస్తుంది.

ముగింపు: శరత్ లోహితస్య - ఆడుకాలం నరేన్ - వరలక్ష్మి శరత్ కుమార్ .. సునీల్ పాత్రల పవర్ పెంచితే, స్క్రీన్ ప్లే పరంగా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే .. కార్తి 'ఖైదీ' సినిమా ఛాయలు లేకుండా చూసుకుంటే .. ఈ సినిమా తప్పకుండా నెక్స్ట్ లెవెల్ ను రీచ్ అయ్యుండేది. అలా చేయకపోవడం వలన ఇది ఒక యావరేజ్ మూవీగా మిగిలిపోయిందేమో అనిపిస్తుంది.