తమిళంలో 'కాదలిక్క నేరమిల్లై' సినిమా రూపొందింది. రవి మోహన్ (జయం రవి) నిత్యామీనన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 14వ తేదీన థియేర్లకు వచ్చింది. ఈ రోజు నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం. 

కథ: శ్రియ (నిత్యామీనన్) ఆర్కిటెక్ట్ గా చెన్నైలోని ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. తల్లిదండ్రులతో కలిసి ఆమె నివసిస్తూ ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆమెకి స్వతంత్ర భావాలు ఎక్కువ. కరణ్ (జాన్ కొక్కెన్)తో ఆమె ప్రేమలో ఉంటుంది. నిశ్చితార్థం తరువాత అతని నిజస్వరూపం తెలియడంతో దూరం పెడుతుంది. ఇక సిద్ధార్థ్ ( రవి మోహన్) బెంగుళూర్ లో నివసిస్తూ ఉంటాడు. అతను కూడా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. 

సిద్ధార్థ్ కి గౌడ (యోగిబాబు) సేతు (వినయ్ రాయ్) స్నేహితులుగా ఉంటారు. ఒకసారి సేతుతో పాటు వెళ్లడం వలన, సిద్ధార్థ్ కూడా 'స్పెర్మ్' డొనేట్ చేయవలసి వస్తుంది. అయితే అతను తన పేరు జేమ్స్ అని చెప్పి, తప్పుడు అడ్రెస్ ఇస్తాడు. కరణ్ కి దూరమైన శ్రియ, టెస్టు ట్యూబ్ బేబీని కనాలని అనుకుంటుంది. ఆ రూట్లో ముందుకు వెళుతుంది. ఆ తరువాత ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. 

సిద్ధార్థ్ .. నిరుపమ (భాను)తో ప్రేమలో ఉంటాడు.పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. కానీ సిద్ధార్థ్ కి పిల్లలు కనడం ఇష్టం లేకపోవడం వలన, అతనికి నిరుపమ దూరమవుతుంది. శ్రియ ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఎనిమిదేళ్ల తరువాత కంపెనీ పనిపై సిద్ధార్థ్ చెన్నై కి వెళతాడు. అక్కడ అతనికి శ్రియతో పరిచయం పెరుగుతుంది. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. అదే సమయంలో సిద్ధార్థ్ జీవితంలోకి నిరుపమ రీ ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమవుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: జీవితంలో కొంతమందికి కొన్ని విలువలు .. అభిప్రాయాలు ..నిర్ణయాలు ఉంటాయి. వాటిని మార్చుకోవడానికి వాళ్లు ఎంతమాత్రం ఇష్టపడరు. మరికొంతమంది అవసరం .. అవకాశం బట్టి మారిపోతూ ఉంటారు. అందువలన ఈ రెండు వర్గాల వారికి పొంతన కుదరదు. దాంతో విలువలకు .. వ్యక్తిత్వాలకు ప్రాధాన్యతను ఇచ్చేవారు, తమకి తగినవారిని ఎంచుకునే అన్వేషణ కొనసాగిస్తూనే ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలించేవరకూ ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా చేసిన ప్రయాణమే ఈ కథ. 

ప్రేమ అంటే ఒకరి తప్పుల గురించి ఒకరికి తెలిసినా సర్దుకుపోవడం కాదు, ఒకరి నిజాయితీని మరొకరు గుర్తిస్తూ .. గౌరవిస్తూ ముందుకు సాగడం అనే అంశాన్ని స్పష్టం చేస్తూ ఈ కథ పరిగెడుతుంది. దర్శకుడు ప్రధానమైన కథను హీరో హీరోయిన్ల మధ్యనే నడిపించాడు. మిగతా పాత్రలను అవసరమైన సందర్భాల్లో మాత్రమే తెరపైకి తీసుకుని వచ్చాడు. కామెడీ శాతం తక్కువే .. సాధ్యమైనంత వరకూ సహజత్వానికి దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు.             

ఈ కథలో ఎక్కువగా ట్విస్టులు ఉండవు. టెస్టు ట్యూబ్ బేబీకి జన్మనిచ్చిన హీరోయిన్, తన బిడ్డకి తండ్రి ఎవరనేది ఎలా తెలుసుకుంటుంది? ఎప్పుడు తెలుసుకుంటుంది? అనే కుతూహలమే ఈ కథను ఆడియన్స్ ఫాలో అయ్యేలా చేస్తుంది. సిద్ధార్థ్ కి మరో లవర్ ఉన్నప్పటికీ, ఆ వైపు నుంచి కూడా రొమాన్స్ ను వర్కవుట్ చేసే ప్రయత్నాలు జరగలేదు. సున్నితమైన భావోద్వేగాలకు అవకాశం ఇస్తూ, పెద్దగా మలుపులేవీ లేకుండానే ఈ కథ నడిపించారు. 

పనితీరు: ఈ కథలో హీరో - హీరోయిన్ ఇద్దరూ ఉంటారు. అయితే నిత్యామీనన్ పాత్ర మాత్రమే కాస్త ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. రవి మోహన్ పాత్ర కూడా చాలా నీట్ గా .. పూర్తి క్లారిటీతో కనిపిస్తుంది. మిగతా పాత్రలు నామమాత్రంగానే అనిపిస్తాయి. 

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. కథకి తగినట్టుగానే వాటిలోని కదలిక కనిపిస్తుంది. టెస్టుట్యూబ్ బేబీ కాన్సెప్ట్ తో .. కాస్త అటు ఇటుగా సినిమాలు మొదలు సీరియల్స్ వరకూ వచ్చాయి. దర్శకుడు మంచి ఫీల్ ను వర్కౌట్ చేయడం వలన, ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది అంతే.