అజిత్‌ కుమార్‌ - త్రిష జంటగా మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'విడా మయూర్చి'. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'పట్టుదల' పేరుతో అనువదించారు. అయితే తెలుగులో మినిమమ్‌ పబ్లిసిటి కూడా లేకపోవడంతో ఈ సినిమా విడుదలను ఎవరూ పట్టించుకోలేదు. ఒక సినిమా విడుదలకు కావాల్సిన కనీసస్థాయి పబ్లిసిటి కూడా లేకుండా రిలీజైన సినిమా ఇదే కావొచ్చు. ఇక ఈ సినిమా గురించి తెలుగులో పెద్దగా తెలియకపోవడంతో అంచనాలు కూడా ఏమీ లేవు. ఈ రోజు ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. 

కథ: అజర్‌ బైజాన్‌లో జరిగే కథ ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అర్జున్‌ (అజిత్), కయల్‌ (త్రిష) 12 ఏళ్లు కలిసి కాపురం చేసిన తరువాత విడిపోదామనుకుంటారు. ఇక కయల్‌ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోవాలనుకుంటుంది. ఇద్దరూ విడాకులకు ముందు తమ చివరి రోడ్‌ ట్రిప్‌గా భావించి బయలుదేరుతారు. తొమ్మిది గంటల ఈ జర్నీలో సెల్‌ఫోన్స్‌ కూడా పనిచేయవు. అయితే అనుకోకుండా వీళ్ల కారు బ్రేడ్‌డౌన్‌ అవుతుంది. 

ఈ ప్రయాణంలో పరిచయమైన రక్షిత్‌ (అర్జున్ సర్జా) దీపిక (రెజీనా కసాండ్ర)లతో కయల్‌ వెళ్లిపోతుంది. అసలు కయల్‌ వీళ్లతో వెళ్లిపోవాల్సిన అవసరమేమిటి? రక్షిత్‌, దీపిక వల్ల అర్జున్‌, కయల్‌ జీవితంలో చోటు చేసుకున్న మార్పులేమిటి? ఈ ఇద్దరి వల్ల వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వారితో వెళ్లిన కయల్‌ ఏమైపోతుంది? అనేవి కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

విశ్లేషణ: రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా చూస్తుంటే గతంలో ఇదే లైన్‌తో వచ్చిన అనేక కథలు గుర్తుకువస్తాయి. భార్య కిడ్నాప్‌కు గురైతే భర్తను ఆమెను అన్వేషిస్తూ ఉండే ప్రయాణమే ఈ కథ. కథలో కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయి. అయితే అంతగా ఆకట్టుకోవు. ఏ మాత్రం ఉత్కంఠభరితంగా లేని సన్నివేశాలతో, ఏ పాత్ర ఎందుకు వస్తుందో.. తెలియని అయోమయంలో ఉంటాడు ప్రేక్షకుడు. ప్రథమార్థం స్లోగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష అని చెప్పాలి.

అజిత్‌, త్రిషల మధ్య వచ్చే ప్రేమకథ కూడా రొటిన్‌గా ఉంటుంది. ఏ మాత్రం ఆకట్టుకోదు. అజిత్‌ లాంటి మాస్‌ హీరోని, విలన్‌లు హింసిస్తూ ఉంటే ఆయన మౌనంగా భరించడం  అభిమానులకు ఏ మాత్రం నచ్చదు. ముందుగా ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ - నేపథ్యం ఆసక్తికరంగా లేకపోవడంతో మిగతా సన్నివేశాలు కూడా ఆడియన్స్‌కు రుచించవు. అజిత్‌- త్రిష మధ్య ప్రేమ .. భార్యాభర్తల అనుబంధంలో ఉండే ఎమోషన్స్‌ను పండించడంలో దర్శకుడు ఫెయిలయ్యాడు.

నటీనటుల పనితీరు: అజిత్‌, త్రిష జోడి తెరమీద చూడటానికి బాగుంది. అయితే అజిత్‌ కెరీర్‌లో ఇదొక ప్రయోగం అని చెప్పొచ్చు. తన పాత్రలో భిన్న కోణాల్ని చూపించారు. కయల్‌గా త్రిష కేవలం ప్రథమార్థానికే పరిమితం అయ్యింది. సెకండాఫ్‌లో రెజీనా పాత్ర నిడివి ఎక్కువ. ప్రతి నాయకుడి పాత్రలో అర్జున్‌ సర్జా మెప్పించాడు. సాంకేతిక విభాగాల్లో ఓం ప్రకాష్ కెమెరా పనితనం బాగుంది. అజర్‌ బైజాన్‌ పరిసర ప్రాంతాలను, కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన ప్రతిభ కనిపిస్తుంది. అనిరుధ్‌ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపించింది. 

ముగింపు: ఎటువంటి ఆసక్తికరమైన అంశాలు, సన్నివేశాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'పట్టుదల', నీరసంగా కొనసాగుతూ నిరాశను కలిగిస్తుంది.