HIT మూవీ రివ్యూ

28-02-2020 Fri 16:25
Movie Name: HIT Movie
Release Date: 2020-02-28
Cast: Vishwak Sen, Ruhani Sharma, Bhanu Chander, Murali Sharma, Brahmaji, Hari Teja, Sahithi  
Director: Sailesh Kolanu
Producer: Prashanthi
Music: Vivek Sagar
Banner: Wall Poster Cinema

ప్రీతి అనే ఒక టీనేజ్ అమ్మాయి మర్డర్ మిస్టరీ చుట్టూ .. నేహా అనే ఒక యువతి మిస్సింగ్ చుట్టూ తిరిగే క్రైమ్ స్టోరీ ఇది. ప్రీతిని ఎవరు మర్డర్ చేశారు? నేహా ఎలా కనిపించకుండాపోయింది? ఈ రెండు నేరాల వెనక వున్నది ఎవరు? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. వినోదానికి ఎంతమాత్రం అవకాశం లేని ఈ కథ, క్రైమ్ స్టోరీస్ ను ఎక్కువగా  ఇష్టపడేవారికి నచ్చొచ్చు.

తెరపై ఒక హత్యనో .. కిడ్నాపో జరుగుతుంది. అందుకు కారకులైనవారిని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ టీమ్ రంగంలోకి దిగుతుంది. కథలో అనేక పాత్రలపైకి అనుమానాన్ని తీసుకెళుతూ, చివరికి ప్రేక్షకుల ఊహకి అందని వారిని నేరస్థులుగా నిరూపిస్తూ ట్విస్ట్ ఇస్తారు. సినిమా సక్సెస్ లో సగభాగం ఈ ట్విస్ట్ పైనే ఆధారపడి ఉంటుంది. అదే తరహాలో HIT (హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) మూవీ ఈ రోజున థియేటర్లకు వచ్చింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందన్నది ఇప్పుడు చూద్దాం.

క్రైమ్ డిపార్టుమెంట్ లో ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా విక్రమ్ (విష్వక్సేన్) పనిచేస్తుంటాడు. సుస్మిత అనే అమ్మాయితో కూడిన గతం అతణ్ణి మానసికంగా కుంగదీస్తూ వుంటుంది. అయినా తట్టుకుంటూ తన వృత్తికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. విక్రమ్ కి బాస్ గా విశ్వనాథ్ (భానుచందర్) వ్యవహరిస్తూ, కేసులను అప్పగిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ప్రీతి అనే ఒక టీనేజ్ అమ్మాయి అదృశ్యమవుతుంది. ఆ కేసును పరిష్కరించే బాధ్యతను విక్రమ్ తీసుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమిస్తున్న నేహా (రుహాని శర్మ) కూడా అదృశ్యమవుతుంది. ఈ రెండు కేసులకు ఏదో సంబంధం ఉందని భావించిన విక్రమ్, ఆ దిశగా మిస్టరీని ఛేదించే పనిలో పడతాడు.

ప్రీతి అనాథ అనీ .. చిన్నతనంలో ఆమెను దత్తత చేసుకున్న శ్రీమంతులు ఓ ప్రమాదంలో చనిపోయారని విక్రమ్  తెలుసుకుంటాడు. ప్రీతి పేరుపై ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయనీ, ప్రస్తుతం ప్రీతి వున్నది తనని దత్తత చేసుకున్నవారి బంధువుల దగ్గర అనే విషయాన్ని రాబడతాడు. కాలేజ్ లో అజయ్ అనే కుర్రాడితో ప్రీతి చనువుగా వుండేదనీ, తన కాలనీలో భర్తకి దూరమైన షీలా ఆంటీతోను ఆమె సన్నిహితంగా ఉండేదని తెలుసుకుంటాడు. ప్రీతి మిస్సింగ్ గురించిన ఒక కీలకమైన సమాచారం తెలుసుకున్న దగ్గర నుంచే నేహా కనిపించకుండా పోయిందని గ్రహిస్తాడు. అలా విక్రమ్ ఒక్కో విషయాన్ని ఆరాతీస్తూ ఉండగానే, ఒక నిర్జన ప్రదేశంలో ప్రీతి డెడ్ బాడీ బయటపడుతుంది. దాంతో నేహాను కూడా చంపేసే ఉంటారని విక్రమ్ భావిస్తాడు.

ప్రీతి కేసులో ఆమె బంధువులు .. ఆమె బాయ్ ఫ్రెండ్ అజయ్ .. అదే కాలనీలో వుండే షీలా .. అనాథ శరణాలయ నిర్వాకురాలు సరస్వతి అనుమానితులుగా విక్రమ్ ముందు నిలబడతారు. అయితే వీళ్లందరూ కూడా ప్రీతిని తాము హత్య చేయలేదని అంటారు. నేహా ఎవరో కూడా తమకి తెలియదని బలంగా చెబుతారు. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఒక 'క్లూ' దొరుకుతుంది. అదేమిటి? అసలు నేరస్థులు ఎవరు? అనే మలుపులతో మిగతా కథ నడుస్తుంది.

దర్శకుడు శైలేశ్ కొలను ఎంచుకున్న కథ బాగుంది. కథా కథనాలను ఆయన పట్టుగా నడిపించిన విధానం బాగుంది. ఓ మర్డర్ .. ఓ మిస్సింగ్ .. ఓ విష్వక్సేన్ అన్నట్టుగా, ఈ మూడు అంశాలపైనే ఆయన దృష్టిపెట్టాడు. విష్వక్సేన్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు బాగుంది. అలాగే అనుమానితులను ఒకొక్కరినీ ఒక్కో విధంగా విచారణ చేయించిన తీరు ఆసక్తికరంగా వుంది. విచారణలో భాగంగా కథను ఒక చోటు నుంచి మరో చోటుకి తీసుకెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది.

ఇక సుస్మిత అనే అమ్మాయితో కూడిన గతం విక్రమ్ ను బాగా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా చూపించారు. అయితే ఆ గతం ఏమిటనే విషయాన్ని మాత్రం చూపించకుండా, సీక్వెల్ కి వదిలేశారు. దాంతో ఫ్లాష్ బ్యాక్ కి సంబంధించిన బిట్స్ .. ఫ్లాష్ కట్స్ ఈ భాగంలోని కథ ఫ్లోకి అడ్డుపడ్డాయి. షీలాగా హరితేజ పాత్ర తాలూకు సీన్స్ డోస్ కాస్త పెరిగినట్టు .. హడావిడి ఎక్కువైనట్టు అనిపించింది. రుహానీ శర్మ ఈ సినిమాలో చేసిందేమీలేదు .. ఆమె ఆకర్షణీయంగా లేకపోవడం ఈ సినిమాకి ఓ మైనస్. ఓ వైపున విష్వక్సేన్ .. మరో వైపున భానుచందర్ .. ఇంకో వైపున మురళీ శర్మ వున్నప్పుడు, ముఖ్యమైన ప్రీతి తల్లిదండ్రుల పాత్రలకి కాస్త ఇమేజ్ వున్న ఆర్టిస్టులను పెడితే బ్యాలెన్స్ అయ్యుండేది.

విష్వక్సేన్ అన్నీ తానై నడిపించిన సినిమా ఇది. విక్రమ్ అనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన చాలా నేచురల్ గా   నటించాడు. రుహాని శర్మ తెరపై కనిపించింది చాలా తక్కువ సేపు. హీరోతో ఆమె మాట్లాడింది తక్కువ .. పాటలు పాడుకునే అవకాశమే లేదు. పోలీస్ బాస్ గా భానుచందర్ చాలా నీట్ గా చేశారు. మంచికిపోయి సస్పెండ్ కావడమే కాకుండా, ప్రాణాలు కూడా కోల్పోయిన పోలీస్ ఆఫీసర్ గా మురళీ శర్మ నటన ఆకట్టుకుంటుంది. హరితేజ .. శ్రీనాథ్ మాగంటి .. చైతన్య సగిరాజు .. బ్రహ్మాజీ పాత్ర పరిధిలో మెప్పించారు.

వివేక్ సాగర్ సమకూర్చిన బాణీగా 'వెంటాడే గాయం .. ' నేపథ్యగీతం బాగుంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టింది. ప్రేక్షకులు సన్నివేశాల్లో భాగమయ్యేలా చేసిన ఘనత నేపథ్య సంగీతానికి దక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించినంత వరకూ ఈయనకే ఎక్కువ మార్కులు దక్కుతాయి. ఇక రెండవ స్థానంలో మణి కందన్ కెమెరా పనితనం కనిపిస్తుంది. చేజింగ్స్ .. నైట్ ఎఫెక్ట్ సీన్స్ .. వర్షంలోని సీన్స్ ను ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ కూడా బాగుంది. కాకపోతే ఈ భాగంలో ముగింపు ఇవ్వకపోవడం వలన, విక్రమ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కథ ఫ్లోకి అడ్డు తగిలినట్టుగా అనిపిస్తాయి.

కామెడీ లేకపోయినా కష్టంగా అనిపించనంత ఆసక్తిగా కథ నడుస్తుంది. సీఐడీ సీరియల్ తరహా కంటెంటే అయినప్పటికీ, నేపథ్య సంగీతం .. కెమెరా పనితనం .. ఈ సినిమాను మరో మెట్టుపైన నిలబెట్టాయి. కాకపోతే కొన్ని ముఖ్యమైన పాత్రలకి అంతగా క్రేజ్ లేని ఆర్టిస్టులను పెట్టడం వలన, ట్విస్టులను తట్టుకుని నిలబడేవిగా అవి అనిపించవు. కీలకమైన పరిస్థితుల్లో మరింత పవర్ఫుల్ గా నిలబడవలసిన సమయాల్లో గతంలో జరిగిన సంఘటనలేవో తలచుకుని హీరో డీలాపడిపోతుంటాడు. ఈ సినిమాకి మరో లోపంగా ఇది కనిపిస్తోంది. గతం తాలూకు ఎపిసోడ్ ను చూపించినా ఆ లోపం కవర్ అయ్యేది. లేదంటే గతానికి సంబంధించిన గాయమే లేకుండా హీరోను పవర్ ఫుల్ గానే చూపించవలసింది. మలుపులు బాగానే ఉన్నప్పటికీ, ట్విస్టులనిచ్చే పాత్రలు బలమైనవి కాకపోవడం వలన, క్లైమాక్స్ బలహీనపడినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ పెద్దగా పట్టించుకోకపోతే, క్రైమ్ స్టోరీస్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చొచ్చు.      


More Articles