యథార్థంగా జరిగిన కొన్ని దారుణమైన సంఘటనలు చరిత్ర పేజీలలో చేదు జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అలాంటివాటిలో 'గోద్రా'లో జరిగిన 'సబర్మతి' ట్రైన్ ఘటన ఒకటి. 2002లో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో రూపొందించిన సినిమా ఇది. ధీరజ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 15 .. 2024లో థియేటర్లకు వచ్చింది. జనవరి 10వ తేదీ నుంచి 'జీ 5'లో   స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, రీసెంటుగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

కథ: 2002లో జరిగిన సంఘటన ఇది. అయోధ్య నుంచి కొంతమంది కరసేవకులు 'సబర్మతి ఎక్స్ ప్రెస్'లో బయల్దేరతారు. అహ్మాదాబాద్ వెళ్లే ఆ ట్రైన్ 'గోద్రా' దగ్గరికి రాగానే మంటల్లో చిక్కుకుంటుంది. ఎస్ - 6, ఎస్ -7 బోగీలు రెండూ ప్రమాదానికి గురవుతాయి. ఆ మంటల్లో 59 మంది సజీవ దహనమైపోతారు. ఊహించని ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపిసేస్తుంది. ఆ సమయంలో సమర్ కుమార్ ( విక్రాంత్ మస్సే) ఒక టీవీ ఛానల్లో వీడియో రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. 

అప్పటివరకూ సినిమా న్యూస్ ను కవర్ చేసే సమర్ కుమార్, మణిక రాజ్ పురోహిత్ ( రిద్ధి డోగ్రా)తో కలిసి 'గోద్రా' ఘటనను కవర్ చేస్తాడు. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదనీ, కావాలని చేసిన కుట్ర అనే విషయం అతనికి అర్థమవుతుంది. అందుకు సంబంధించిన ఆధారాలను అతను సేకరించి ఛానల్ వారికి అందజేస్తాడు. అయితే అది ప్రయాణీకుల అజాగ్రత్త వలన జరిగిన ప్రమాదమే అనే విషయాన్ని మణికతో పాటు ఛానల్ నిర్వాహకులు హైలైట్ చేస్తారు. ఈ విషయంపై వారితో గొడవపడటంతో సమర్ కుమార్ ను బయటికి గెంటేస్తారు.            

'గోద్రా' ఘటనలో బాధ్యులకు జరిగిన అన్యాయాన్ని గురించి సమర్ కుమార్ ఆలోచన చేయకుండా అతని చుట్టూ అనేక సమస్యలు సృష్టిస్తారు. ఆర్ధికంగా అతను చితికిపోయేలా చేస్తారు. తన నిస్సయతను నిందించుకుంటూ అతను మద్యానికి బానిసై ఆ మత్తులోనే కాలం గడుపుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే గతంలో అతను సంపాదించిన ఆధారాలు జర్నలిస్ట్ అమృత గిల్ (రాశీ ఖన్నా) చేతికి చేరతాయి. అక్కడి నుంచి చోటుచేసుకునే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 

విశ్లేషణ: 2002లో 'గోద్రా'లో జరిగిన యథార్థ సంఘటనకి దృశ్య రూపం ఇది. ఆ సంఘటన వెనక గల స్వార్థ రాజకీయాలు .. కొంతమంది మీడియా పెద్దల అవినీతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిజాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించిన నిజాయితీ పరుడైన ఒక జర్నలిస్ట్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది అనేది ఫస్టు పార్టుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిజాన్ని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు అనే కోణంలో సెకండాఫ్ సాగుతుంది.
  
దర్శకుడు సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలను కూడా ఆయన చాలా సింపుల్ గా తెరపైకి తీసుకుని వచ్చేశాడు. సమర్ - అమృత గిల్ ఇద్దరూ కలిసి ఆధారాలు సేకరించే విధానం కూడా ఎలాంటి కుతూహలాన్ని రేకెత్తించలేకపోయింది. ఆధారాలు బయటపడటం కూడా చాలా తేలికగా జరిగిపోతుంది. అందువలన ఆడియన్స్ కి పెద్దగా ఏమీ అనిపించదు. ఏం జరుగనుందా? అనే ఒక ఆసక్తి కలగదు. 

ఈ సంఘటన ఎందుకు జరిగింది? కారకులు ఎవరు? అనేది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న. ఆ విషయాన్ని లోతుగా .. బలంగా .. నేరుగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించలేదు. సాధ్యమైనంత వరకూ  లైట్ గా ఆ విషయాన్ని టచ్ చేయడానికి ట్రై చేయడమే కనిపిస్తుంది. అందువలన 'కేరళ స్టోరీ' .. 'కశ్మీర్ ఫైల్స్' తరహాలో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించలేకపోయింది.

పనితీరు: ఈ కథలో ప్రధానమైన పాత్రలు మూడే. విక్రాంత్ మస్సే .. రిద్ధి డోగ్రా .. రాశి ఖన్నా ఆ పాత్రలను పోషించారు. ముగ్గురూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రలు ఇలా తెరపైకి వచ్చి అలా వెళ్లిపోతూ ఉంటాయి. అమలెందు చౌదరి ఫొటోగ్రఫీ .. కార్తిక్ ఖుష్ .. అఖిల్ సచ్ దేవా నేపథ్య సంగీతం .. మనన్ సాగర్ ఎడిటింగ్ ఫరవాలేదు. 

యథార్థ సంఘటనను సాధ్యమైనంత దగ్గరగా చూపించడానికి ప్రయత్నించారు. ఆయా సన్నివేశాలను సహజత్వంతో ఆవిష్కరించడం అవసరమే. అయితే అవి ఆడియన్స్ కి కనెక్ట్ కావాలంటే, ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుని తెరపైకి తీసుకుని రావలసిందే. అలా జరగకపోవడం వలన, ఎమోషన్స్ వైపు నుంచి ఈ సినిమా ఆడియన్స్ ను పట్టుకోలేకపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.