హిందీ వైపు నుంచి వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో 'పాతాళ్ లోక్' ఒకటి. జైదీప్ అహ్లావత్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఫస్టు సీజన్, మే 15వ తేదీ 2020లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 9 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా అందుబాటులోకి వచ్చిన సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఢిల్లీలోని 'జమున పార్ పోలీస్ స్టేషన్' లో హథీరామ్ చౌదరి ( జైదీప్ అహ్లావత్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేయడమే అతనికి అలవాటు. ఆ ప్రయత్నంలో అతను ఒక్కోసారి రూల్స్ కూడా బ్రేక్ చేస్తూ ఉంటాడు. అందువలన పై అధికారులు అతని విషయంలో కాస్త అసహనంతో ఉంటారు. ఒక రోజున 'గీతా పాశ్వాన్' అనే ఒక యువతి స్టేషన్ కి వస్తుంది. కొన్ని రోజులుగా తన భర్త 'రఘు పాశ్వాన్' జాడ తెలియడం లేదని ఫిర్యాదు చేస్తుంది.
అదే సమయంలో 'నాగాల్యాండ్' కి చెందిన జొనాథన్ థామ్ అనే ఒక రాజకీయ నాయకుడు ఢిల్లీ వస్తాడు. స్టార్ హోటల్లో బస చేసిన అతనిని అత్యంత దారుణంగా ఎవరో హత్య చేస్తారు. దాంతో ఈ రెండు కేసులను ఛేదించవలసిన బాధ్యత హథీరామ్ పై పడుతుంది. 'థామ్' హత్యకేసుకి సంబంధించిన విషయంలో వారికి 'రోజ్ లిజో' పై అనుమానం వస్తుంది. థామ్ తో పాటు ఆమె మూలాలు కూడా నాగాల్యాండ్ లో ఉన్నట్టుగా వారు గుర్తిస్తారు. 'రోజ్ లిజో'తో రఘు పాశ్వాన్ కి సంబంధం ఉందనే నిర్ధారణకు వస్తారు.
థామ్ మర్డర్ కేసు విషయంలో హథీరామ్ కి పై అధికారిగా ఇమ్రాన్ అన్సారీ ( ఇష్వాక్ సింగ్) ఉంటాడు. ఈ కేసు విషయంలో తనతో కలిసి పనిచేయడానికి ఆయన హథీరామ్ ను ఎంచుకుంటాడు. రోజ్ లిజో కోసం ఇద్దరూ కలిసి నాగాల్యాండ్ బయలుదేరుతారు. థామ్ హత్య పట్ల అతని కొడుకు 'రూబెన్' చాలా ఆవేశంతో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో హథీరామ్ - అన్సారీ ఆ నేలపై అడుగుపెడతారు. వాళ్లకి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? రోజ్ లిజో ఎవరు? థామ్ ను ఆమె హత్య చేయడానికి కారణం ఏమిటి? ఆమెతో రఘు పాశ్వాన్ కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ.
విశ్లేషణ: 'పాతాళ్ లోక్ 2' ఒక కొత్త కథతో మొదలవుతుంది. ఒక రాజకీయనాయకుడి మర్డర్ కేసు .. ఒక సాధారణ వ్యక్తి కనిపించకుండా పోయిన కేసుతో ఈ సీజన్ మొదలవుతుంది. ఈ రెండూ కూడా ఒకదానితో ఒకటి పొంతన లేనట్టుగా కనిపించే కేసులు. అలాంటి ఈ కేసులను పోలీస్ ఆఫీసర్ హథీరామ్ ఎలా ఛేదించాడు? ఆ రెండు కేసుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే దిశగా దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు.
సీజన్ 1లో కథ అంతా కూడా 'ఢిల్లీ' నేపథ్యంలో కొనసాగుతుంది. సీజన్ 2కి వచ్చేసరికి, కథ ఎక్కువగా 'నాగాల్యాండ్' లో జరుగుతుంది. నిజానికి దర్శకుడు ఎంచుకున్న ఈ ట్రాక్ చాలా కష్టమైందనే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అనేక పాత్రలు తెరపైకి వచ్చి వెళుతూ ఉంటాయి. అయినా ఆ పాత్రలను రిజిస్టర్ చేస్తూ ముందుకు వెళ్లారు. ఒక వైపున హత్యకి గురైనవారి కుటుంబ సభ్యులు .. మరో వైపున నేరస్థుల మద్దతుదారులు .. మరో వైపున అక్కడి పోలీస్ ఆఫీసర్స్ 'ఇగో'ను ఫేస్ చేస్తూ వెళ్లే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
కథా పరంగా చూసుకున్నా .. బడ్జెట్ పరంగా చూసుకున్నా ఇది భారీ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. కథలో యాక్షన్ ఉంది .. ఎమోషన్స్ ఉన్నాయి .. ఈ రెండింటి మధ్య సాగే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. రోజ్ లిజోపై కోపంతో ఆమె ఉన్న హాస్పిటల్ పై స్థానికులు దాడి చేస్తారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తప్పించే సీన్ .. ఈ సిరీస్ మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తే, మరికొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. అలా అని చెప్పి ఫార్వార్డ్ చేసి చూస్తే, ఇన్వెస్టిగేషన్ మిస్సవుతాము.
పనితీరు: దర్శకుడు తాను చెప్పదలచుకున్న కథను చాలా వివరంగా చెప్పడానికి ప్రయత్నించాడు. అదే విషయాన్ని కాస్త తక్కువ నిడివిలోను చూపించవచ్చు. ఒక్కో ఎపిసోడ్ నిడివి ఎక్కువగా ఉండటం వలన, కథలోని పట్టుసడలిపోయి .. పలచబడినట్టుగా అనిపిస్తుంది. సన్నివేశాల నిడివి తగ్గించి ఉంటే, స్క్రీన్ ప్లే మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించేది.
నిర్మాణం పరంగా ఈ సిరీస్ కి వంక బెట్టవలసిన పనిలేదు .. బాగానే ఖర్చు పెట్టారు. సుదీప్ శర్మ అందించిన ఈ కథ, ఒక వైపున ఇన్వెస్టిగేషన్ పరంగా పరిగెడుతూనే, మరో వైపున ఒక పోలీస్ ఆఫీసర్ లోని మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా, ఈ సిరీస్ కి సహజత్వాన్ని తీసుకొచ్చారు.
అవినాశ్ అరుణ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ దృశ్యాలు .. ఛేజింగ్ దృశ్యాలతో పాటు, నాగాల్యాండ్ లొకేషన్స్ ను చూపించిన విధానం బాగుంది. నేపథ్య సంగీతం సందర్భానికి తగినట్టుగా అనిపిస్తుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎక్కడా అసభ్యకరమైన దృశ్యాలు గానీ .. డైలాగ్స్ గాని లేవు. యాక్షన్ థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.
'పాతాళ్ లోక్ 2' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!
Paatal Lok 2 Review
- 2020లో వచ్చిన ఫస్టు సీజన్
- నిన్నటి నుంచి మొదలైన సెకండ్ సీజన్
- 8 ఎపిసోడ్స్ గా జరుగుతున్న స్ట్రీమింగ్
- నిదానంగా సాగే కథాకథనాలు
- భారీతనమే ప్రధానమైన ఆకర్షణ
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చే కంటెంట్
Movie Details
Movie Name: Paatal Lok 2
Release Date: 2025-01-17
Cast: Jaideep Ahkawath, Ishwak Singh, Tilotthama Shome, Gul Panag
Director: Avinash Arun Dhaware
Music: -
Banner: A Clean Slate Film
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer