'భీష్మ' మూవీ రివ్యూ

Bheeshma

Movie Name: Bheeshma

Release Date: 2020-02-21
Cast: Nithin, Rashmika mandanna, Anant Nag, Jisshu Sen Gupta, Sampath Raj, Naresh, Vennela Kishore, Brahmaji, Raghu Babu
Director:Venky Kudumula
Producer: Surya Devara Naga vamsi
Music: Mahati Swara Sagar
Banner: Sithara Entertainments
Rating: 3.50 out of 5
ఓ ఆర్గానిక్ సంస్థ చైర్మన్ రసాయనిక ఎరువుల వాడకం ఎంతప్రమాదమో చాటిచెబుతూ ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటాడు. తన స్వార్థం కోసం రసాయనిక ఎరువులనే ప్రోత్సహిస్తూ, ఆర్గానిక్ సంస్థను దెబ్బతీయడానికి రాఘవన్ రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ సంస్థ చైర్మన్ తన సంస్థను కాపాడుకోవడం కోసం, డిగ్రీ కూడా పాస్ కాని 'భీష్మ'ను సీఈఓ గా నియమిస్తాడు. అందుకు గల కారణం ఏమిటి? వేల కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థకి సీఈఓగా భీష్మ ఎలా నెగ్గుకొచ్చాడు? అనేదే కథ. వినోదానికి సందేశాన్ని జోడిస్తూ అల్లుకున్న ఈ కథ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నితిన్ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో దర్శకుడిగా వెంకీ కుడుములకి అవకాశం ఇచ్చాడు. గతంలో 'ఛలో' అనే ప్రేమకథతో విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల, 'భీష్మ' టైటిల్ తో ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగాడు. 'ఛలో'లో చేసిన రష్మికనే కథానాయికగా తీసుకున్నాడు. నితిన్ - రష్మిక జంట బాగుందనే టాక్ విడుదలకి ముందే వచ్చింది. ఈ రోజున థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందో, వెంకీ కుడుముల - రష్మిక కాంబినేషన్లో నితిన్ కి హిట్ పడుతుందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

'భీష్మ'(నితిన్) ఓ మధ్యతరగతి యువకుడు. డిగ్రీ కూడా పూర్తి చేయకుండా అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. 'భీష్మ' అనే పేరు పెట్టుకోవడం వల్లనే తనకి అమ్మాయిలెవరూ పడటం లేదని వాపోతుంటాడు. అలాంటి భీష్మ'కి చైత్ర (రష్మిక) తారసపడుతుంది. తను ఏసీపీని అంటూ ఆమెకి అబద్ధం చెప్పి దొరికిపోతాడు. ఎందుకంటే ఆమె తండ్రినే ఏసీపీ దేవా (సంపత్ రాజ్). ఓ ఆర్గానిక్ సంస్థలో  కీలకమైన పదవిలో వున్న చైత్రను లైన్లో పెట్టడానికి భీష్మ ట్రై చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే సేంద్రియ ఎరువులకు .. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా చేస్తున్న అనంత నాగ్ పై,  రసాయనిక ఉత్పత్తులతో కోట్లు సంపాదిస్తున్న రాఘవన్( జిషు సేన్ గుప్తా) కన్నెర్రజేస్తాడు. ఆర్గానిక్ ఉత్పత్తుల్లో ముందు వరుసలో వున్న ఆ సంస్థను దెబ్బతీయడానికి గ్రామస్థాయి నుంచి పావులు కదుపుతాడు. రైతులను పక్కదోవ పట్టించి వాళ్ల నుంచి వ్యవసాయ భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటాడు. దాంతో అనంత నాగ్ తన సంస్థకి ఒక రక్షకుడు అవసరమని భావించి, సీఈఓగా భీష్మను ప్రకటిస్తాడు. డిగ్రీ కూడా పాస్ కాని భీష్మ చేతికి, వేలకోట్ల టర్నోవర్ కలిగిన సంస్థ బాధ్యతలను ఆయన ఎలా అప్పగించాడు? అందుకు గల కారణాలు ఏమిటి? అనేదే మిగతా కథ.

దర్శకుడు వెంకీ కుడుముల ఒక మంచి పాయింట్ తో 'భీష్మ' సినిమాను తెరకెక్కించాడు. నాయక నాయికల మధ్య సరదాగా ప్రేమకథను నడిపిస్తూనే, సేంద్రియ ఎరువుల వాడకం .. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాధాన్యతను గురించి చెప్పించిన తీరు బాగుంది. ఒక వైపున నాయకా నాయికల మధ్య లవ్ ట్రాక్ నడిపిస్తూనే, ఆర్గానిక్ ట్రాక్ లో వాళ్లను భాగస్వాములుగా చేసిన తీరు కథకి మరింత బలాన్నిచ్చింది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఆమె తండ్రి అయిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ తో ఢీ కొట్టడానికీ, పెద్ద సంస్థ  బాధ్యతను మీద వేసుకుని, ప్రతినాయకుడితో తలపడానికి సిద్ధపడే యువకుడిగా నితిన్ పాత్రను తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక ముందుగా కాస్తంత అపార్థం చేసుకున్నా ఆ తరువాత అర్థం చేసుకుని, తన కోసం .. తను పనిచేస్తున్న సంస్థ కోసం నిలబడిన భీష్మకి తోడుగా వుండేలా  రష్మిక పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకూడదనే ఉద్దేశంతోనే, సేంద్రియ ఎరువులు - ఆర్గానిక్ ఉత్పత్తుల విషయాన్ని దర్శకుడు ఎంతవరకూ చెప్పాలో అంతవరకే చెప్పాడు. వినోదంతో కూడిన ప్రేమకథకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. సింగన్న పాలెం' విలేజ్ కి రష్మికతో కలిసి నితిన్ కార్లో వెళ్లేటప్పటి సీన్ ను .. రష్మిక అనుకుని ఆమె తండ్రితో నితిన్ చాట్ చేస్తూ ఇక తట్టుకోలేక వీడియో కాల్ కి వచ్చే సీన్ ను .. నితిన్ - సంపత్ రాజ్ కలిసి మందుకొట్టే సీన్ ను చిత్రీకరించిన తీరు థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. అలాగే రష్మికను కామెంట్ చేసిన అల్లరిమూక ఆట కట్టించే సీన్, సింగన్న పాలెం విలేజ్ రైతుల పొలాలను వాళ్లకి తిరిగి ఇప్పించే సందర్భంలో యాక్షన్ సీన్ దర్శకుడికి మరిన్ని మార్కులు దక్కేలా  చేస్తాయి. ఎక్కడా బోర్ కొట్టించకుండా పూర్తి వినోదభరితంగా ఫస్టాఫ్ ను నడిపిస్తూ, ఇంట్రెస్టింగ్ పాయింట్ పై ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వడంతో, తరువాత భాగంపై కుతూహలం పెరుగుతుంది. సెకండాఫ్ లోను పట్టుసడలని కథనంతో కథను పరుగులు తీయిస్తూ క్లైమాక్స్ తో మెప్పించాడు.

భీష్మ సినిమాలో నితిన్ లుక్ బాగుంది. ఆయన హెయిర్ స్టైల్ .. కాస్ట్యూమ్స్ బాగా కుదిరాయి. ఇంతకుముందు సినిమాల్లో కంటే ఇందులో మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. కామెడీ .. యాక్షన్ తో పాటు స్టెప్స్ కూడా అదరగొట్టేశాడు. చైత్ర పాత్రలో రష్మిక కూడా బాగా చేసింది. అలగడం .. ఆటపట్టించడం వంటి సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని కష్టతరమైన స్టెప్స్ కూడా బాగానే వేసింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా సంపత్ రాజ్ తన మార్క్ చూపించాడు. నితిన్ కి ఫేస్ బుక్ ఫ్రెండ్ గా వెన్నెల కిషోర్ చేసిన కామెడీ బాగా పండింది. విలన్ గా బెంగాలి నటుడు జిషు సేన్ గుప్తా నటన డీసెంట్ గా వుంది. హేమచంద్ర డబ్బింగ్ ఆయనకి బాగా సెట్ అయింది. సినిమా ప్రారంభంలోను .. చివర్లోను హెబ్బా పటేల్ కనిపిస్తుంది. అంతగా ప్రాధాన్యతలేని పాత్రలో .. అదీ తన క్రేజ్ ను తగ్గించే పాత్రలో ఆమెను చూడటం అభిమానులకు బాధ కలిగిస్తుంది. అనంత నాగ్ .. నరేశ్ .. రఘుబాబు .. నర్రా శ్రీనివాస్ పాత్ర పరిధిలో ఓకే అనిపించారు.

మహతి స్వర సాగర్ అందించిన బాణీలు కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా 'వాటే వాటే బ్యూటీ .. ' పాటను జానపద రీతిలో హుషారెత్తించిన విధానం బాగుంది. మోడ్రన్ డ్రెస్సులతో ఈ సాంగును డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. రీ రికార్డింగ్ బాగుంది .. సందర్భానికి తగినట్టుగా సాగుతూ ప్రేక్షకులను మూడ్ లోకి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది కెమెరా పనితనమేనని చెప్పాలి. హీరో హీరోయిన్లను మరింత అందంగా చూపిస్తూ, ప్రతి ఫ్రేమ్ ను తెరపై అందంగా ఆవిష్కరించాడు. పాటలను .. ఫైట్లను చిత్రీకరించిన తీరు బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా బాగుంది .. ఎక్కడ అనవసరమైన సీన్స్ కనిపించవు. శేఖర్ మాస్టర్ - జానీ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. వెంకట్ ఫైట్స్ ఆకట్టుకునేలా వున్నాయి. 'అదృష్టం ఆవగింజంత .. దురదృష్టం దబ్బకాయంత' .. 'డాడీ పోలీస్ .. డాటర్ దొంగ'.. 'పెద్దవాడైపోవడమంటే నిలువుగా ఎదగడం కాదు .. నిలువెత్తున ఎదగడం' ..'వాడు కొడితే చూడగలంగానీ, కొటేషన్ చెబితేనే వినలేం' వంటి డైలాగ్స్ సందర్భాను సారంగా పేలాయి.

లవ్ .. యాక్షన్ .. కామెడీ .. పాటలు .. మాటలు .. ఇలా అన్నింటినీ సమపాళ్లలో కలుపుకుంటూ వెళ్లిన కథ ఇది. అందమైన ప్రేమకథకు ఆలోచింపజేసే సందేశాన్ని జతజేసి ఆవిష్కరించడం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకూ వినోదం పాళ్లు తగ్గకుండా చూసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ముఖ్యమైన పాత్రలను మలిచిన తీరు .. అవసరమైనంత వరకే వాటిని వాడుకుంటూ వెళ్లడంలో సఫలీకృతుడయ్యాడు. యూత్ కు .. ఫ్యామిలీ ఆడియన్స్ కు .. మాస్ ఆడియన్స్ కి నచ్చే చిత్రంగా 'భీష్మ' నిలుస్తుందని చెప్పొచ్చు.  

More Reviews