బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటుడిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమానే 'బ్రేక్ అవుట్'. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, రెండేళ్ల తరువాత ఓటీటీలోకి వచ్చింది. మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఓ సాధారణమైన కుటుంబానికి చెందిన మణి (రాజా గౌతమ్) కి సినిమా దర్శకుడు కావాలనే ఆశయముంటుంది. అందుకోసం కథలు రాసుకుని అవకాశాల కోసం హైదరాబాద్ వెళతాడు. అక్కడ అర్జున్ (కిరీటీ) అనే స్నేహితుడితో కలిసి ఒక రూమ్ లో ఉంటూ ఉంటాడు. ఒక రోజున రూమ్ 'కీ' ఫ్రెండ్ దగ్గర ఉండిపోవడంతో, అతనికి ఏం చేయాలనేది అర్థం కాదు. అదే సమయంలో అతనికి మెకానిక్ రాజు (చిత్రం శ్రీను) తారసపడతాడు. 

 ఆ రాత్రికి తన రూమ్ లో ఉండి .. ఉదయాన్నే అర్జున్ రూమ్ కి వెళ్లిపొమ్మని రాజు అంటాడు. అందుకు 'మణి' అంగీకరించి, రాజుతో కలిసి బయలుదేరతాడు. ఊరికి దూరంగా ఉన్న ఒక పాత షట్టర్ కి అతణ్ణి తీసుకొస్తాడు రాజు. చుట్టూ జనసంచారం లేకపోవడం .. ఇల్లు అనేది కనిపించకపోవడంతో మణి కంగారు పడిపోతాడు. ఎందుకంటే అతనికి 'మోనో ఫోబియా' ఉంది. ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు విపరీతంగా భయపడిపోయే ఒక చిత్రమైన సమస్యతో అతను బాధపడుతూ ఉంటాడు.         
ఆ షట్టర్ లో మణిని ఉండమని చెప్పి, ఒక ముఖ్యమైన పని చూసుకుని వస్తానని రాజు బయలుదేరుతాడు. అతను వెళ్లిన కాసేపటికి వర్షం మొదలవుతుంది.అదేసమయంలో పొరపాటున షట్టర్ పడిపోయి స్ట్రక్ అయిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ఏరియా కావడంతో, అందులో నుంచి ఎలా బయటపడేలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ కనిపించిన కొన్ని వస్తువుల కారణంగా రాజుపై అనుమానం కలుగుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? అనేది కథ. 

విశ్లేషణ: ఇది ఒక చిన్న బడ్జెట్ తో రూపొందిన సినిమా. 'మోనో ఫోబియా' సమస్యతో బాధపడిపోయే హీరో, ఒంటరిగా ఒక చోట చిక్కుకుపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడు? అనే ఒక కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ కథను రెడీ చేసుకున్నాడు. హీరోకి గల సమస్యను కథ మొదట్లోనే చెప్పిన దర్శకుడు, ఆలస్యం చేయకుండా అసలు కథలోకి తీసుకుని వెళతాడు. 


ఈ మధ్య కాలంలో తమిళ .. మలయాళ సినిమాలు సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ ను ఎక్కువగా టచ్ చేస్తున్నాయి. తక్కువ పాత్రలు .. తక్కువ బడ్జెట్ ప్రధానంగా ఇలాంటి కథలు తెరకెక్కుతూ ఉంటాయి. లైన్ బాగుండాలేగానీ, బడ్జెట్ కి అనేక రెట్లు వసూళ్లు సాధిస్తాయి. అలాంటి జోనర్లో రూపొందిన సినిమానే ఇది. ఈ సినిమా మొత్తం మీద నాలుగైదు పాత్రలు  కనిపించినప్పటికీ, 90 శాతం వరకూ హీరో ఒక్కడే తెరపై కనిపిస్తూ ఉంటాడు.


హీరోకి గల 'మోనో ఫోబియా'.. అతను ఒంటరిగా చిక్కుకుపోవడం .. బయటపడటానికి చేసే ప్రయత్నాలపైనే దర్శకుడు పూర్తి దృష్టి పెట్టాడు. అతని పాత్రకి మద్దతుగా నిలిచే పాత్రలుగానీ, అతనికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాత్రలుగాని ఏమీ కనిపించవు. అందువలన ఇది బడ్జెట్ ను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని అల్లుకున్న కథలా అనిపిస్తుంది. చివరికి ఏం జరుగుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశనే మిగులుతుంది. 

పనితనం: బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే, దర్శకుడు ఈ జోనర్ ను ఎంపిక చేసుకోవడం కరెక్టే. అయితే ఒకే ఒక పాత్రను చూపిస్తూ ఉత్కంఠభరితంగా నడిపించలేకపోయాడు. ఇలాంటి కథలు చివర్లో ఒక ట్విస్ట్ తో షాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి ఒక మెరుపు ఇందులో కనిపించదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలాన్ని కలిగించలేకపోతే, ఈ జోనర్ ను టచ్ చేయకూడదు. 

ఈ కథ మొత్తం రాజా గౌతమ్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. నటన పరంగా అతను మెప్పించగలిగాడు. మోహన్ చారి కెమెరా పనితనం .. జోన్స్ రూపర్ట్ నేపథ్య సంగీతం .. అర్జున్ - బసవ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు: 'మోనో ఫోబియా'తో బాధపడే హీరో పాత్ర చుట్టూనే కథను నడిపించడం వలన, ఒక సినిమాను కాకుండా ఒక ఎపిసోడ్ ను చూసిన భావన కలుగుతుంది. అలా కాకుండా ఆ హీరో పాత్ర చుట్టూ ఒక బలమైన డ్రామాను .. సున్నితమైన ఎమోషన్స్ ను అల్లుకుని చెప్పి ఉంటే ఇంతకంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో.