జైలు నేపథ్యంలో యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక జోనర్లో తమిళంలో రూపొందిన సినిమానే 'సొర్గవాసల్'. సిద్ధార్థ్ రావు - పల్లవి సింగ్ నిర్మించిన ఈ సినిమాకి, సిద్ధార్థ్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. క్రిస్టో సేవియర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, నవంబర్ 29న థియేటర్లకు వచ్చింది. ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: 1999లో చెన్నై పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సంఘటనతో ఈ కథ మొదలవుతుంది. అక్కడ పార్తీబన్ (ఆర్జే బాలాజీ) తోపుడు బండిపై టిఫిన్స్  అమ్ముతూ తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇక తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న రేవతితో అతను ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మాదిరి హోటల్ పెట్టాలనేది చాలా  కాలంగా అతనికి ఉన్న కోరిక. 

అలాంటి పరిస్థితుల్లోనే అతనికి షణ్ముగం అనే ఒక పెద్ద ఆఫీసర్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఏరియాలోనే ఉంటున్న  అతని ద్వారా లోన్ సంపాదించడానికి పార్తీబన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ ఆఫీసర్ హత్య చేయబడతాడు. హత్యకి ముందు అతని  ఇంటికి వెళ్లివచ్చిన కారణంగా పార్తీబన్ ను పోలీసులు అనుమానిస్తారు. తనకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా, రిమాండు నిమిత్తం అతణ్ణి సెంట్రల్ జైలుకు తరలిస్తారు.


జైల్లో గ్యాంగ్ స్టర్ గా ఉన్న 'సిగా' (సెల్వ రాఘవన్)కి అక్కడి ఖైదీలతో పాటు పోలీసులు కూడా భయపడుతూ ఉంటారు. 'సిగా' అనుచరులుగా టైగర్ మణి - శీలన్ ఉంటారు. ఆ ఇద్దరినీ దాటి సిగాను కలవడం అంత తేలికైన విషయం కాదు. పార్తీబన్ వచ్చి వాళ్ల మధ్యలో పడతాడు. సిగా గురించి అప్పుడే అతను వింటాడు. సాధ్యమైనంత త్వరగా జైలు నుంచి బయటపడాలనుకుంటాడు. 'సిగా'ను లేపేస్తే, విడుదల చేస్తానని పార్తీబన్ కి ఎస్పీ సునీల్ కుమార్  ఆశపెడతాడు. అప్పుడు పార్తీబన్ ఏం చేస్తాడు? షణ్ముగాన్ని ఎవరు చంపారు? జైలు నుంచి పార్తీబన్ బయటపడతాడా? రేవతితో అతని పెళ్లి అవుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: ఈ సినిమాకి కృష్ణకుమార్ కథను అందించాడు. నేరం చేసి జైలుకు వచ్చిన ఒక గ్యాంగ్ స్టర్ .. నేరం చేయకుండా జైలుకు వచ్చిన ఒక యువకుడు .. ఖైదీలను తన ఎదుగుదలకు పావులుగా వాడుకునే ఒక రాజకీయనాయకుడు .. ఇగో ఫీలింగ్ తో ఇష్టానుసారం వ్యవహరించే ఒక పోలీస్ ఆఫీసర్ .. ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగించే మరో పోలీస్ ఆఫీసర్ .. చేయని తప్పుకు జైలుకెళ్లిన కొడుకు కోసం తపించే ఒక తల్లిచుట్టూ కృష్ణకుమార్ ఈ కథను అల్లుకొచ్చాడు. 

లవ్ ను సున్నితంగా టచ్ చేస్తూ, యాక్షన్ కీ .. ఎమోషన్స్ కి దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. సెంట్రల్ జైల్లో ఉండే కరడుగట్టిన నేరస్థుల ప్రవర్తన ఎలా ఉంటుంది? తమ చుట్టూ ఉన్న ఇతర ఖైదీల పట్ల వాళ్లు ఎలా వ్యవహరిస్తారు? ఖైదీల మధ్య గొడవలు ఎలా మొదలవుతాయి? అనేది దర్శకుడు చూపించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అలాగే పోలీసుల ఇగో, ఏ నేరం చేయని వాళ్లను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెడుతుందనేది కూడా కళ్లకి కట్టినతీరు బాగుంది.

దర్శకుడు కథని నేరుగా .. ఫ్లాట్ గా చెప్పకుండా, ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి ఓపెన్ చేయడం వలన ఆసక్తి పెరుగుతుంది. ప్రధానమైన పాత్రలను మలచిన తీరు .. వాటిని నడిపించిన విధానం మెప్పిస్తుంది. నేరం చేసినవారు జైల్లో ఉండగలుగుతారు. చేయనివారు అక్కడి నుంచి బయటపడటానికి ఎంతగా ఆరాటపడతారనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. 


పనితీరు
: ఈ కథ అంతా ఎక్కువగా ఆర్జే బాలాజీ - సెల్వరాఘవన్ చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలను మలచిన తీరుతో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఆర్జే బాలాజీ .. సెల్వ రాఘవన్ ఇద్దరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతావారు కూడా పాత్రలలో నుంచి బయటికి రాకుండా చేశారు. 

ప్రిన్స్ ఫొటోగ్రఫీ .. క్రిస్టో సేవియర్ నేపథ్య సంగీతం .. సెల్వ ఎడిటింగ్ ఈ సినిమాకి మరింత హెల్ప్ అయ్యాయి. బలమైన కథాకథనాలతో .. సహజంగా అనిపించే ఎమోషన్స్ తో ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఒకటి రెండు చోట్ల కాస్త హింసాత్మకంగా అనిపించే దృశ్యాలైతే ఉన్నాయి. అభ్యంతరకరమైన సన్నివేశాలు గానీ .. డైలాగ్స్ గాని లేవు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.