గతంలో హిందీలో రూపొందిన 'బండిష్ బాండిట్స్ ' వెబ్ సిరీస్ 10 ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను పలకరించింది. సీజన్ 2ను 8 ఎపిసోడ్స్ గా ఈ నెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. తెలుగు .. తమిళ భాషల్లోను ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఆనంద్ తివారి దర్శకత్వం వహించిన ఈ సిరీస్, రొమాన్స్ ను టచ్ చేస్తూ సాగే ఎమోషనల్ డ్రామా. అలాంటి ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: జోధ్ పూర్ లో రాధే మోహన్ రాథోడ్ (నసీరుద్దీన్ షా) అనే సంగీత విద్వాంసుడు తన కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఆయన పెద్ద కొడుకు రాజేంద్ర - కోడలు మోహిని ఇద్దరూ సంగీతంలో మంచి ప్రవేశం ఉన్నవారే. ఇక రాధే మోహన్ రాథోడ్ ను తండ్రిగా చెప్పుకునే దిగ్విజయ్ రాథోడ్ కూడా సంగీతంలో మంచి అనుభవాన్ని సంపాదిస్తాడు. రాజేంద్రకి .. దిగ్విజయ్ రాథోడ్ కి మధ్య వారసత్వ పోరు నడుస్తూ ఉంటుంది. 

వయసు పై బడటం వలన రాధే మోహన్ రాథోడ్ చనిపోతాడు. ఆయనను ఆదర్శంగా తీసుకుని సంగీతం నేర్చుకున్న రాధే ( రిత్విక్ భౌమిక్) ఎంతో ఆవేదన చెందుతాడు. తన తాతయ్య పేరును .. సంగీతానికి సంబంధించి ఆయన తయారు చేసిన సంకలనానికి .. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి పేరు తీసుకు రావాలని అతను నిర్ణయించుకుంటాడు. అయితే రాధే మోహన్ రాథోడ్ చనిపోయిన తరువాత, ఆయన గురించిన చెడు ప్రచారమవుతుంది. దాంతో ఆయన వారసులు కచేరీలలో పాల్గొనకుండా వెలి వస్తున్నట్టు జోధ్ పూర్ రాజు ప్రకటిస్తాడు. 

సంగీతంపై ఆధారపడి జీవిస్తున్న రాధే మోహన్ రాథోడ్ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. రాధే .. తమన్నా (శ్రియ చౌదరి) ప్రేమించుకుంటారు. పాప్ సింగర్ గా ఎదగాలనేది ఆమె ఆశయం. అందువలన ఆమె ఆ మార్గంలో ముందుకు వెళుతూ ఉంటుంది. తన ఆశయ సాధన కోసం ఆమెకి కూడా దూరమైన రాధే, ముంబై వెళతాడు. అక్కడ ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని ఎలా అధిగమిస్తాడు? ఆయన ఆశయం నెరవేరుతుందా? అనేది కథ. 

విశ్లేషణ: ఇది సంగీత ప్రధానమైన నేపథ్యంలో సాగే కథ. శాస్త్రీయ సంగీతాన్ని ప్రాణంగా భావించే ఒక యువకుడు .. పాప్ మ్యూజిక్ ను ఇష్టపడే ఒక యువతి ప్రేమించుకుంటారు. తమ ఆశయ సాధనలో భాగంగా విడిపోయిన ఆ ఇద్దరూ చాలా కాలం తరువాత కలుసుకుంటారు. అయితే ఆ ఇద్దరూ కూడా ఒకే వేదికపై తలపడవలసి వస్తుంది. ఆ వేదిక ఎవరికి విజయాన్ని ఇస్తుంది? ఎవరి ఆశయాన్ని నెరవేర్చుతుంది? అనే కథాంశంతో ఈ కంటెంట్ నడుస్తుంది. 

దర్శకుడు ఎంచుకున్న ఈ కథ విస్తృతమైన పరిధిలో కనిపిస్తుంది. అయితే కథాంశాన్ని కుదించి అందించే ప్రయత్నం మాత్రం చేయలేదు. నిదానంగా కథను చెబుతూ వెళ్లడం వలన కాస్త అసహనంగానే అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న కథ గానీ .. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ గాని అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించవు. పైగా సంగీత నేపథ్యం కలిగిన సిరీస్ ను ఇతర భాషల్లోకి అనువదించడమనేది కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే. కచేరి ట్రాక్ వరకూ హిందీలో వదిలేయడమే మంచిదైంది కూడా.

సీజన్ 2లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్స్ నిడివి కూడా ఎక్కువే. నిజానికి కాస్త సంక్షిప్తంగా చెప్పచ్చు కూడా. అనూహ్యమైన మలుపులు .. ఆశ్చర్యచకితులను చేసే సన్నివేశాలేం లేకపోయినా, అలా సాగదీస్తూ వెళ్లారు. ముఖ్యంగా శ్రియా చౌదరి సంగీతం నేపథ్యంలో సాగే ట్రాక్ ను చాలా నిదానంగా లాగినట్టుగా అనిపిస్తుంది. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరును చూస్తే, ఎవరిని ప్రేమిస్తోందనే విషయం అర్థం కాదు. 

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా సీనియర్స్. అందువలన వాళ్ల నటనను వంక బెట్టవలసిన అవసరం కనిపించదు. కానీ ఆ పాత్రలను నిదానంగా ఎక్కువ దూరం నడిపించడమే ఇబ్బంది పెడుతుంది. స్క్రీన్ ప్లేను వేగంగా పరిగెత్తించి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే కుతూహలం ఆడియన్స్ కి కలగకుండా డిజైన్ చేయడం లోపంగా అనిపిస్తుంది.

సంగీతంపై ఆధారపడిన వంశం .. పరువు ప్రతిష్ఠలు ప్రాణంగా భావించే కుటుంబం .. అవమానాలను .. అపనిందలను ఎలా ఎదిరించి నిలిచింది అనేది దర్శకుడు చెప్పడానికి ప్రయత్నించాడు. కాకపోతే అందుకు సంబంధించిన పెయిన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు.  అనుభవ్ బన్సాల్ ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. సంగీతం నేపథ్యం కలిగిన కథలను ఇష్టపడేవారికి నచ్చవచ్చునేమో!