'ఎంత మంచివాడవురా' మూవీ రివ్యూ

Entha Manchivadavuraa

Movie Name: Entha Manchivadavuraa

Release Date: 2020-01-15
Cast: Kalyan Ram, Mehreen Pirzada, Sarath Babu, Suhasini, Tanikella Bharani, Naresh, Pavitra Lokesh, Vennela Kishore, Rajeev Kanakala
Director:Satish Vegeshna 
Producer: Subhash Gupta, Umesh Gupta 
Music: Gopi Sundar 
Banner: Aditya Music  
Rating: 3.00 out of 5
బాల్యంలోనే బాలు ఓ ప్రమాదంలో తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. తనకి ఆశ్రయం కల్పించవలసి వస్తుందేమో అన్న ఉద్దేశంతో బంధువులంతా ముఖం చాటేయడం అతనికి బాధ కలిగిస్తుంది. తనలా అయినవారి ప్రేమకి దూరమైనవారికి ఆ లోటు తెలియకుండా ప్రేమను అందించాలనే ఆలోచనతో బాలు రంగంలోకి దిగుతాడు. పర్యవసానంగా అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనేదే కథ. భవిష్యత్తు తరాలవారికి అందించవలసింది ఆస్తిపాస్తులు కాదు, బంధాలు .. అనుబంధాలు అనే సందేశంతో రూపొందిన ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవచ్చు.

'శతమానం భవతి' ..'శ్రీనివాస కల్యాణం' వంటి కుటుంబ కథా చిత్రాల ద్వారా దర్శకుడిగా సతీశ్ వేగేశ్న మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే తరహాలో ఆయన తన తదుపరి చిత్రంగా 'ఎంత మంచివాడవురా' రూపొందించాడు. కల్యాణ్ రామ్ .. మెహ్రీన్ జంటగా ఈ సినిమాను తెరకెక్కించాడు. గ్రామీణ నేపథ్యంలో నిర్మితమై, సంక్రాంతి కానుకగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందన్నది ఇప్పుడు చూద్దాం.

బాలు (కల్యాణ్ రామ్)కి చిన్నప్పటి నుంచి బంధువులు .. బంధుత్వాలు అంటే ఎంతో ఇష్టం. ఓ ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు చనిపోతారు. బంధువులు ముఖం చాటేయడంతో, ఆయన హాస్టల్లో ఉంటూ చదువుకుని పెద్దవాడవుతాడు. తనలా ఒంటరిగా ఎవరూ బాధపడకూడదనేది ఆయన ఉద్దేశం. అంతా తమ వాడిగా తనని చెప్పుకోవాలనేది ఆయన ఆశయం.
 
ఆ ఆశయ సాధనలో భాగంగానే ఆయన తన స్నేహితులతో కలిసి, 'ఎమోషన్స్ సప్లయర్స్' అనే పేరుతో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాడు. తమ ఎమోషన్స్ ను పంచుకునేవారులేక బాధపడేవారు సంప్రదిస్తే, వాళ్లు ఆశించే రిలేషన్ తో కనెక్ట్ అవుతూ ఓదార్పుగా నిలవడం ఈ సంస్థ చేస్తుంది. ఈ విషయంలో చిన్నప్పటి నుంచి పరిచయమున్న నందిని (మెహ్రీన్) ఆయనకి సహకరిస్తుంది. ఓ దంపతులకి కొడుకు లేని లోటు తీర్చడానికి వెళ్లిన బాలుకి, అక్కడ ఇసుక దందా చేస్తున్న గంగరాజు(రాజీవ్ కనకాల)తో శత్రుత్వం ఏర్పడుతుంది. ఫలితంగా ఏం జరుగుతుంది? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.

'వనం విడిచిన పక్షి .. జనం విడిచిన మనిషి' అంటారు. వనాన్ని విడిచిన పక్షికి గమ్యం తెలియదు. తన అనుకునేవారు లేని మనిషి ప్రయాణం కూడా అగమ్యగోచరంగానే కనిపిస్తుంది. అలాంటివారికి అండగా నిలుస్తూ ఆప్యాయతను పంచడంలోనే అసలైన ఆనందం ఉంటుంది అనే కాన్సెప్ట్ తో సతీశ్ వేగేశ్న చేయించిన ఎమోషనల్ జర్నీనే 'ఎంత మంచివాడవురా'. ఈ సినిమాలో ఆయన ఒక కొత్త పాయింట్ ను చెప్పడానికి ప్రయత్నించాడు. భవిష్యత్తులో ఇలాంటి రోజులు వచ్చే అవకాశం లేకపోలేదనే ఆలోచన రేకెత్తించాడు.
 
కొత్త పాయింట్ వున్న కథను .. సాధారణ ప్రేక్షకులకు సైతం అర్ధమయ్యే కథనాన్ని సతీశ్ వేగేశ్న ఆవిష్కరించిన తీరు బాగుంది. హీరో హీరోయిన్ పాత్రలను .. అలాగే సీనియర్ నరేశ్ .. రాజీవ్ కనకాల .. వెన్నెల కిషోర్ పాత్రలను మలిచిన విధానం బాగుంది. ఈ కథ మొత్తాన్ని ఆయన నాలుగు ఎపిసోడ్స్ గా చేసుకుని, మెహ్రీన్ వైపు నుంచి లవ్ ను .. రాజీవ్ కనకాల వైపు నుంచి యాక్షన్ ను .. తనికెళ్ల భరణి వైపు నుంచి ఎమోషన్ ను .. వెన్నెల కిషోర్ వైపు నుంచి కామెడీని ఆవిష్కరించాడు. చివరికి అన్ని పాత్రలను ఒక చోటుకు చేరుస్తూ, ఆస్తిపాస్తులకంటే అనుబంధాలు గొప్పవనే సందేశాన్ని ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు.

అయితే అసలు కథను ట్రాక్ ఎక్కించడానికి సతీశ్ వేగేశ్న కొంత సమయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తేలికపాటి సన్నివేశాలు పడ్డాయి. ఎప్పుడైతే పవిత్ర లోకేశ్ ఎంటరవుతుందో .. తనికెళ్ల భరణి ఎమోషనల్ ఎపిసోడ్ మొదలవుతుందో అప్పుడే ప్రేక్షకుడు సీట్లో కుదురుకుంటాడు. ఆ తరువాత నుంచి దర్శకుడు ఒక్కో ట్రాక్ ను టచ్ చేస్తూ వెళ్లాడు. ఇక హీరో షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం .. హీరోయిన్ ఆ షార్ట్ ఫిలిమ్స్ కి ప్రొడ్యూసర్ గా ఉండటమనే నేపథ్యం కాకుండా మరేదైనా ఎంచుకుంటే బాగుండేదనిపిస్తుంది. మొత్తానికి ప్రథమార్థంలో నెల్లూరు సుదర్శన్ .. ద్వితీయార్థంలో వెన్నెల కిశోర్ పై నవ్వించే భారం వేసిన దర్శకుడు, కథను కంచి వరకూ నడిపించాడు.

బాలు పాత్రలో కల్యాణ్ రామ్ యాక్షన్ .. ఎమోషన్స్ ను బాగానే పండించాడు. ఇక మెహ్రీన్ గత చిత్రాల్లో కంటే ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపించింది. ఎమోషనల్ సీన్స్ చేయడంలో పరిణతిని సాధించింది. మనసులో అనుకుంటున్నానని అనుకుని ఆ మాటలను పైకి అనేసే పాత్రలో సీనియర్ నరేశ్ నటన ఆకట్టుకుంటుంది. ఇసుక దందా చేసే గంగరాజు పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెల రోజుల్లో మరణిస్తానని తెలిసి, 20యేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు కోసం ఎదురుచూసే తండ్రి పాత్రలో తనికెళ్ల భరణి నటన ఉద్వేగానికి గురిచేస్తుంది. శరత్ బాబు .. సుహాసిని .. పవిత్ర లోకేశ్ పాత్రల నిడివి తక్కువే అయినా, తెరకి నిండుదనాన్ని తీసుకొచ్చారు.
 
గోపీ సుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన అందించిన బాణీల్లో 'అవునో తెలియదు .. కాదో తెలియదు' .. 'ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ వుందో ఓ కొంచెం పాలు పంచుకుందాం' పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా 'ఏమో ఏమో ..' అనే పాటను బాలు పాడటంతో, ఆ పాట మనసును తాకుతూ తీపి బాధను కలిగిస్తుంది. ఈ సినిమా హైలైట్స్ లో ఈ పాటను కచ్చితంగా చేర్చేయవచ్చు .. సాహిత్య పరంగా కూడా. రీ రికార్డింగ్ కూడా సన్నివేశాలకి .. సందర్భానికి తగినట్టుగా సాగింది.

ఇక ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ కెమెరా పనితనమని చెప్పాలి. ఇటు పల్లె అందాలను .. అటు కేరళలోని 'మున్నార్' లొకేషన్స్ ను తెరపై గొప్పగా ఆవిష్కరించాడు. 'అవునో తెలియదు .. కాదో తెలియదు' పాటలో కెమెరా పనితనం ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజు సుందరం కొరియోగ్రఫీ .. వెంకట్ ఫైట్స్ కూడా బాగున్నాయి. 'తప్పిపోయాడు గనుక నీ కొడుకు తిరిగొచ్చాడు .. నేను తప్పించానంటే ఎప్పటికీ తిరిగిరాడు' .. 'భయమనేది ఒకడు చెప్పడం వలన రాదు .. ధైర్యమనేది ఒకడు భయపెట్టడం వలన పోదు'.. 'కొన్ని ఇష్టాలు మాటల దగ్గర ఆగిపోతాయి .. మరికొన్ని ఇష్టాలు మనసుల దగ్గర ఆగిపోతాయి' ..'లైఫ్ పార్ట్నర్ ఇంట్లో నుంచి రావాలిగానీ .. ఇల్లొదిలి రాకూడదు' .. వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి.

సంక్రాంతి అంటేనే బంధాలు .. అనుబంధాల వేడుక జరిగే వేదిక. అందువలన అందుకు సంబంధించిన కంటెంట్ తో రావడం వలన ఈ సినిమా కొంతవరకూ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే దర్శకుడు కథాకథనాలపై మరికాస్త కసరత్తు చేసి ఉంటే, ఈ సినిమా మరోమెట్టు పైన ఉండేది. సంగీతం .. సాహిత్యం .. ఫొటోగ్రఫీ .. సంభాషణలు ఈ కథకు బలంగానే సపోర్ట్ చేశాయి. లవ్ .. కామెడీ .. యాక్షన్ పాళ్లు ఉన్నప్పటికీ, ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వలన, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్పొచ్చు.                

More Reviews