సన్నీలియోన్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'మందిర'. యువన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా, నెల తిరక్కముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. సన్నీలియోన్ టైటిల్ రోల్ పోషించిన కంటెంట్ అనగానే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ: భారతి (సతీశ్)కి రచయితగా .. సినిమా దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకోవాలని ఉంటుంది. అందువలన ఒక మంచి ఛాన్స్ కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న ఇంట్లో తన స్నేహితుడు (రమేశ్ తిలక్)తో కలిసి అద్దెకి ఉంటూ, సరైన నిర్మాత కోసం గాలిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతను సౌమ్య ( దర్శ గుప్తా)తో ప్రేమలో పడతాడు. భారతి తన స్నేహితుడితో కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే భారతి .. అతని స్నేహితుడు బాగా తాగేసి, ఆ మత్తులో ఒక ప్రదేశానికి వెళతారు. అక్కడ జరుగుతున్న క్షుద్రపూజకు అంతరాయాన్ని కలిగిస్తారు. అక్కడి నుంచి పారిపోయి తమ ఇంటికి చేరుకుంటారు. ఆ ఇంట్లోని ఒక రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వస్తుండటం గమనించి భయపడుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సౌమ్య, ఆ గదిలో ఏముందో తెలుసుకోవడానికి వెళుతుంది.
అలా లోపలికి వెళ్లిన సౌమ్యను 'మందిర' ప్రేతాత్మ ఆవహిస్తుంది. తనని 'అనకొండపురం' తీసుకెళ్లామనీ, అక్కడ తాను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని ఆ దెయ్యం వాళ్లతో చెబుతుంది. వాళ్లిద్దరూ కలిసి ఆమెను ఆ ఊరుకు తీసుకుని వెళతారు. అక్కడ ఒక పాడుబడిన కోట దగ్గరికి రాగానే దెయ్యం ఆవహించబడిన సౌమ్య మాయమవుతుంది. ఆమెను వెతుక్కుంటూ ఆ ఇద్దరూ లోపలికి వెళతారు. మందిర ఎవరు? ఆ కోటతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? భారతి లవర్ ను మందిర ఆవహించడానికి గల కారణం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఒక పాడుబడిన బంగ్లాలో ఒక ప్రేతాత్మ నిద్రాణ స్థితిలో ఉంటుంది. ఆ ప్రేతాత్మను ఎవరో ఒకరు మేల్కొల్పుతారు. అప్పటి నుంచి ఆ దెయ్యం తాను పగబట్టినవారిని వెంటాడటం మొదలుపెడుతుంది. సాధారణంగా దెయ్యం కథల్లో చాలా వరకూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అందుకు భిన్నంగా ఈ కథ విషయంలోను ఏమీ జరగలేదు.
'మందిర' అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పైగా ఆ పాత్రను పోషించినది సన్నీలియోన్ కావడం వలన రొమాంటిక్ టచ్ గట్టిగానే ఉండొచ్చని ప్రేక్షకులు అనుకుంటారు. అలాగే సతీశ్ .. యోగిబాబు .. రమేశ్ తిలక్ వంటి ఆర్టిస్టులు పోస్టర్ పై కనబడగానే ఇది హారర్ కామెడీ అనే నిర్ధారణకు వచ్చేస్తారు. మరి ఇంతకీ ఈ సినిమా భయపెడుతుందా? నవ్విస్తుందా? అంటే, ఆ రెండూ చేయలేకపోయిందనే చెప్పాలి.
'మందిర' ఒక అందమైన యువరాణి .. ఆమె దెయ్యంగా ఎందుకు మారుతుంది? అంతకుముందు ఆ కోటలో ఏం జరుగుతుంది? ఆ పేరు వినగానే చుట్టుపక్కల గ్రామాలవారు ఎందుకు అంతలా భయపడుతున్నారు? అనే ఆసక్తి, కథ ముందుకు వెళుతున్నా కొద్దీ మనలో మాయమవుతూ పోతుంది. భయానికి .. భయానికి మధ్య కామెడీ ఉంటే బాగుంటుంది. కానీ భయాన్ని కూడా కామెడీతో కలిపేస్తే ఆ కథ తేలిపోతుంది .. సిల్లీ కామెడీని జోడిస్తే అది 'మందిర' అవుతుంది.
పనితీరు: దర్శకుడు యువన్ రూపొందించిన ఈ సినిమాలో, కథాపరంగా ఎలాంటి కొత్తదనం లేదు. రెండు గంటల నిడివి కలిగిన ఈ కథలో గంటసేపటి వరకూ తెరపై సన్నిలియోన్ కనిపించదు. ఆ గంటసేపటి కథను సిల్లీ కామెడీ సీన్లతో అల్లేసుకుంటూ వెళ్లాడు. సన్నీలియోన్ ఎంటరైన దగ్గర నుంచి అయినా కథ కాస్త సీరియస్ గా సాగుతుందా అంటే అదీ లేదు. కథ .. స్క్రీన్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, కామెడీ పరంగా ఇటు సతీశ్ .. యోగిబాబు .. రాజేంద్రన్ లకు, గ్లామర పరంగా సన్నీలియోన్ కి క్రేజ్ ఉంది. కానీ కంటెంట్ లో బలం లేకపోవడం వలన, పాత్రలు .. సన్నివేశాలు తేలిపోవడం జరిగింది. రాజగురుగా యోగిబాబు .. మాంత్రికుడిగా రాజేంద్రన్ పాత్రలు పేలవంగా మిగిలిపోతాయి. అటు దెయ్యంగా .. ఇటు యువరాణిగా కూడా సన్నీలియోన్ పాత్రను సరిగ్గా డిజైన్ చేయలేకపోయారు.
దీపక్ డి మెనోన్ ఫొటోగ్రఫీ .. జావేద్ రియాజ్ నేపథ్య సంగీతం .. అరుళ్ సిద్ధార్థ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. తక్కువ బడ్జెట్ లో చేసినప్పటికీ, కంటెంట్ విషయంలో కసరత్తు చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఎక్కడికక్కడ సిల్లీ కామెడీనే నమ్ముకుని ముందుకు వెళ్లారు. అందువలన ఈ సినిమా ఎంతమాత్రం భయపెట్టలేకపోయింది .. ఏ మాత్రం నవ్వించలేకపోయింది.
'మందిర' (ఆహా) మూవీ రివ్యూ!
Mandira Review
- 'మందిర'గా సన్నీలియోన్
- నవంబర్ 22న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 5 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- బలహీనమైన కథాకథనాలు
- సిల్లీ కామెడీతో చిరాకుపెట్టే కంటెంట్
Movie Details
Movie Name: Mandira
Release Date: 2024-12-05
Cast: Sunny Leone, Sathish, Yogibabu, Ramesh Thilak, Rajendran
Director: Yuvan
Music: Javed Riyaz
Banner: Viision Movie Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer