మొదటి నుంచి కూడా ప్రియదర్శి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. అలా ఆయన కీలకమైన పాత్రను పోషించిన సినిమానే 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి'. చెన్న నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: ఈ కథ విశాఖలో మొదలవుతుంది. ఓ బ్యాంకులో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసిన ఓ యువకుడు (గోపాల్ శ్యామ్) బుల్లెట్ గాయంతో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అతను గన్ చూపించి బెదిరించడంతో, తన క్యాబ్ లో అతనిని తీసుకువెళ్లడానికి డ్రైవర్ (మణికందన్) అంగీకరిస్తాడు. ఆ యువకుడు గాయపడి ఉండటం వలన, అతని దగ్గర నుంచి డబ్బు బ్యాగ్ ను కాజేయాలని ఆ డ్రైవర్ చూస్తాడు. అయితే చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకుంటాడు.

తాను ఒక అమ్మాయిని ప్రేమించాననీ, ఆ అమ్మాయికి ఏ లోటూ లేకుండా చూసుకోవడం కోసమే తాను ఆ డబ్బు కాజేశానని క్యాబ్ డ్రైవర్ తో ఆ యువకుడు చెబుతాడు. హోటల్లో రెస్టు తీసుకోవడానికి ప్రయత్నించిన ఆ యువకుడి నుంచి, అక్కడి రెసెప్షనిస్టుగా ఉన్న యువతి ఆ డబ్బు బ్యాగును కొట్టేస్తుంది. ఆ ఊరొదిలి పోవడానికి ట్రైచేసి చివరికి వాళ్లకి దొరికిపోతుంది. ప్రేమించిన అబ్బాయి మోసం చేసి పారిపోయాడనీ, తన కాళ్లపై తాను నిలబడటానికి తనకి డబ్బు చాలా అవసరమని ఆమె చెబుతుంది.  

బ్యాంకులో ఆ యువకుడు షూట్ చేసింది తన భార్యనేననీ, అనారోగ్యంతో బాధపడుతున్న తన కొడుకు కోసం తనకి ఆ డబ్బు అవసరమని క్యాబ్ డ్రైవర్ చెబుతాడు. ఇదిలా ఉండగా అక్కడికి సమీప గ్రామంలో ఒక ప్రేమవ్యవహారం నడుస్తూ ఉంటుంది. తాను ప్రేమించిన యువతి (నిరంజన అనురూప్) ఫ్యామిలీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని ఆమె ప్రేమికుడు (ప్రియదర్శి) తెలుసుకుంటాడు. తనతో పెళ్లికి ఆమె హ్యాపీగా అంగీకరించాలంటే 50 లక్షలు అవసరమవుతాయి. ఇలా ఈ కథలోని నాలుగు ప్రధాన పాత్రలకి డబ్బు అవసరమవుతుంది. చివరికి ఆ డబ్బు ఎవరికి దక్కుతుంది? అనేదే కథ. 

విశ్లేషణ: డబ్బు .. ప్రపంచమంతా దాని చుట్టూనే ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. చాలామంది అవసరాలు .. ఆనందాలు ఆ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అందువల్లనే ఆ డబ్బును దక్కించుకోవడానికి ఎంతోమంది ఎన్నో మార్గాలలో పరిగెడుతూ ఉంటారు. అయితే ఆ డబ్బు చివరికి ఎవరి దగ్గరికి చేరుతుందనేది వాళ్ల అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి నిరూపించడానికి అల్లుకున్న కథనే ఇది.

డబ్బు చుట్టూ తిరిగే కథలు .. పరిగెత్తే పాత్రలతో ఇంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల కంటే భిన్నంగా .. అంతకంటే కొత్తగా చెబితేనే ఆడియన్స్ ఇంట్రెస్టింగ్ గా ఫాలో కావడమనేది జరుగుతుంది. కానీ ఆ విషయంలో ఈ కంటెంట్ నిరాశపరుస్తుంది. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో దర్శకుడు ఈ కథను డిజైన్ చేసుకోవడం వరకూ ఓకే. కానీ ఆ పరిధిలో ఈ కథను ఆసక్తికరమైన మలుపులు తిప్పలేకపోయాడు.   
  
ప్రధానమైన పాత్రలకు గల డబ్బు అవసరం .. ఆ డబ్బు కోసం వారు పడే ఆరాటమే ఈ కథలోని ప్రధానమైన అంశం. కానీ వాళ్లు ఒకరి తరువాత ఒకరుగా చెప్పిన ఏ విషయం ఆడియన్స్ కి కనెక్ట్ కాదు. కథాపరంగా వాళ్లు చెప్పింది నిజమైనా.. అబద్ధమైనా అదే పరిస్థితి. ఇక అంతపెద్ద మొత్తం డబ్బు చేతులు మారే సీన్స్ కూడా సిల్లీగా అనిపిస్తాయి. లవ్ .. ఎమోషన్స్ .. సస్పెన్స్ ఇవేవీ మనసుకు పట్టుకోవు.    

  పనితీరు: ప్రియదర్శి .. మణికందన్ వంటి ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. మిగతావారు తమవంతు ప్రయత్నం చేశారు. జాక్సన్ - సతీశ్ కుమార్ ఫొటోగ్రఫీ, వివేక్ - అభిషేక్ సంగీతం, ఆంథోని ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.

కథాకథనాల విషయంలో .. ప్రధానమైన పాత్రల నేపథ్యం విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టవలసింది. ఎప్పటికప్పుడు .. ఎక్కడికక్కడ సన్నివేశాలు తేలిపోతూ ఉండటంతో ఆడియన్స్ ఫాలో కాలేకపోతారు. ఈ కథపై గట్టిగా కసరత్తు చేసి ఉంటే, ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో. ఇక ఈ సినిమాకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారనేది అర్థంకాని ప్రశ్నగానే మిగిలిపోతుంది.