ప్రేమకథా చిత్రాలు ఎన్ని వచ్చినా.. వాటిని తెరకెక్కించే విధానంలో కాస్త కొత్తదనం చూపిస్తే అవి  ప్రేక్షకులకు బోర్‌కొట్టవు. ఇక ఇలాంటి సినిమాలకు ఎంటర్‌టైన్‌మెంట్‌, రొమాన్స్‌ యాడ్‌ చేశారంటే ఆ సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేస్తాయి. ఈ కోవలోనే యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం 'రోటి కపడా రొమాన్స్‌'. భిన్నమైన టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్‌తో మంచి బజ్‌ తెచ్చుకుంది. 'రోటి కపడా రొమాన్స్‌' చిత్రంలో ఉన్నదేమిటి? ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ ఎంత? ఎమోషన్స్‌ ఎలా వున్నాయి? నేటి యూత్‌కు కనెక్ట్‌ అవుతుందా లేదా? అనేది చూద్దాం.  

కథ: రేడియో స్టేషన్‌లో ఆర్జేగా పనిచేసే సూర్య ( తరుణ్‌), సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (తరుణ్‌), వీరితో సరదాగా తిరిగే మరో ఫ్రెండ్ విక్కీ (సుప్రజ్‌ రంగ) ఈ నలుగురు ఒకే స్కూల్‌లో చదువుకుని.. చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. ఒకే రూమ్‌లో ఉంటూ జాబ్‌లు చేస్తూ ఉంటారు .. లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితాల్లోకి నలుగురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. 

ఆర్‌ జే సూర్య, ఆయన అభిమాని దివ్య (నువ్వేక్ష) ప్రేమలో పడతారు. హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్‌ వల్ల చదువుపై ఆసక్తి కలగడం లేదని, తనకు హెల్ప్  చేయమని హర్షను కోరుతుంది సోనియా (కుష్బూ చౌదరి). శ్వేతను (మేఘలేఖ) చూసి ఇష్టపడిన విక్కీ ఆమెకు జాబ్‌ ఇప్పించి ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఇక రాహుల్‌, తన కోలీగ్‌ ప్రియ (సోనూ ఠాకూర్‌)ను చూసి ఇష్టపడతాడు. కానీ లైఫ్‌లో సెటిల్‌ అయిన తరువాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటాడు..? ఇలా ఈ నలుగురు స్నేహితుల్లోకి వీళ్లు ప్రవేశించిన తరువాత జరిగిందేమిటి? వీళ్ల లవ్‌ సక్సెస్‌ అవుతుందా? బ్రేకప్‌ అవుతుందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

 విశ్లేషణ: నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిల మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఇలాంటి ప్రేమకథలు ఇంతకు ముందు వచ్చినా ఈ సినిమా కథనంలో ఫ్రెష్‌నెస్‌ ఉంది. ప్రేమ, కెరీర్‌, బ్రేకప్‌ వీటి మధ్య అల్లుకున్న కథను దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాలోని పాత్రలు కూడా అర్థవంతంగానే డిజైన్‌ చేసుకున్నాడు. అయితే ఈ నాలుగు ప్రేమకథలను ఎక్కడ కూడా తడబడకుండా దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంది.

 ఈ సినిమా తొలిభాగంలో వినోదంతో పాటు వీరి ప్రేమ ప్రయాణం చూపించాడు. సెకండాఫ్‌లో లవ్‌లోని ఎమోషన్‌తో పాటు రియలైజేషన్‌ చెప్పిన విధానం ఆకట్టుకుంది. సినిమాలోని ప్రతి సన్నివేశం, డైలాగ్‌ కూడా ఎంతో సహజంగా అనిపించింది. నేటి యువతరంలో ప్రేమ పట్ల ఉన్న కన్‌ఫ్యూజన్స్‌కు ఈ చిత్రంలో క్లారిటి ఇచ్చే ప్రయత్నం ఇచ్చాడు. ట్రెండీ కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎక్కడా కూడా బోర్‌ కొట్టదు. 

ఈ సినిమాలో రెండు జంటల మధ్య ఉన్న రొమాంటిక్‌ సన్నివేశాలు కుర్రకారుని అలరిస్తాయి. అయితే ఎక్కడా కూడా రొమాన్స్‌ సన్నివేశాలు శృతిమించకుండా తెరకెక్కించడం ఈ సినిమాకు ప్లస్‌ అయ్యింది. సినిమా ప్రారంభించడం గోవాలో స్నేహితులు ఫ్లాష్‌బ్యాక్‌ను చెబుతూ.. తమ ప్రేమకథను ఒక్కొక్కటి రివీల్‌ చేస్తూ ఆడియన్స్‌ కు వాటిని చెబుతుండటం అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా విక్కి, శ్వేతల ప్రేమకథ వినోదాన్ని పంచుతుంది. 

నటీనటుల పనితీరు
: ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించిన వాళ్లు కొత్తవారైనా ఎక్కడా కూడా ఆ ఫీలింగ్‌ కనిపించదు. వీళ్ల నటన ఆకట్టుకుంటుంది. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగ తమ పాత్రల్లో రాణించారు. ముఖ్యంగా విక్కీ పాత్రలో సుప్రజ్‌ రంగ పంచిన వినోదం అందరికి గుర్తుండిపోతుంది. ఈ హీరోలకు నటులుగా మంచి భవిష్యత్‌ ఉంటుంది. హీరోయిన్స్‌ గా నటించిన నువ్వేక్ష,మేఘ లేఖ, సోనూ ఠాకూర్‌, కుష్బూ చౌదరి తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు కూడా వాళ్ల వాళ్ల పాత్రలో రాణించారు. 

సాంకేతిక వర్గం పనితీరు: విక్రమ్‌ రెడ్డి తొలిచిత్ర దర్శకుడైనా ఎక్కడా కూడా అతను తడబడినట్లుగా కనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా.. పూర్తి క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కథతో పాటు ఎమోషన్‌ కూడా క్యారీ చేయడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. నూతన నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. సంగీతం ఎంతో యూత్‌ఫుల్‌గా అనిపించింది. హర్షవర్థన్‌ రామేశ్వేర్‌, ఆర్‌ఆర్‌ ధ్రృవన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యే విధంగా ఉంది. కథ మూడ్‌ను క్యారీ చేయడంలో సినిమాటోగ్రఫీ తోడ్పడింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. 

ఫైనల్‌గా : 'రోటి కపడా రొమాన్స్‌'  రిఫ్రెషింగ్‌ అనిపించే ప్రేమకథగా అందరిని అలరిస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రం యూత్‌కు మంచి కిక్‌ ఇస్తుంది.