ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై థ్రిల్లర్ నేపథ్యంలో కథలు రాజ్యం చేస్తూ ఉంటే, టీనేజ్ లవ్ స్టోర్ ఒకటి ట్రాక్ పైకి వచ్చింది. హిందీలో రూపొందిన ఆ వెబ్ సిరీస్ పేరే 'గుటర్ గు' .. అంటే 'పావురాల చప్పుడు' అని అర్థం. అంటే టీనేజ్ లో ఉన్న రెండు ప్రేమపావురాలు చేసే చప్పుడుగా చెప్పుకొవచ్చు. కొంతకాలం క్రితం అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్, సీజన్ వన్ గా  ప్రస్తుతం తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.  

కథ: ఈ కథ భోపాల్ లో మొదలవుతుంది. అనూజ్ (విశేష్ బన్సాల్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లి .. తండ్రి .. తమ్ముడు వినీత్ ఇదే అతని కుటుంబం. స్కూల్లో ఆది - అమర్ అతని బెస్ట్ ఫ్రెండ్స్. గుర్గావ్ నుంచి కొత్తగా భోపాల్ వచ్చిన రీతూ, అనూజ్ స్కూల్లో కొత్తగా జాయిన్ అవుతుంది. కాస్త ఆధునిక భావాలు ఉన్న తల్లి - తండ్రి .. అదే ఆమె ఫ్యామిలీ. రీతూ టాపర్ అనే విషయం అనూజ్ కి అర్థమైపోతుంది. 

 అనూజ్ ప్రవర్తన రీతూకి నచ్చుతుంది. దాంతో ఆమె అతనిని అభిమానించడం మొదలుపెడుతుంది. రీతూ పట్ల ఆకర్షితుడైన అనూజ్, ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఈ విషయం తెలిసి అది - అమర్ ఇద్దరూ కూడా అతనిని ఆటపట్టించడం మొదలెడతారు.  అనూజ్ కి అమిత్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. కాకపోతే అతను అనూజ్ కంటే చాలా సీనియర్. అతని పేరుతో రీతూ నంబర్ ను ఫోన్లో సేవ్ చేసుకుని, ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా మాట్లాడుతూ ఉంటాడు.

రీతూ ఏ స్కూల్ నుంచి అయితే వచ్చిందో, ఆ స్కూల్ కి చెందిన సామ్రాట్ అనే కుర్రాడు, రీతూపై మనసు పారేసుకుంటాడు. ఇప్పుడు ఆమె అనూజ్ తో ప్రేమలో పడిన విషయం అతనికి తెలుస్తుంది. దాంతో అతను అనూజ్ కి కాల్ చేస్తాడు. రీతూను తాను లవ్ చేస్తున్నాననీ, ఆమె వెంట తిరగడం మానేయమని బెదిరిస్తాడు. తన మా వినకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు.

సామ్రాట్ తనకంటే బలవంతుడనీ, అతనికి బాక్సింగ్ లోను ప్రవేశం ఉందని అనూజ్  తెలుసుకుంటాడు. అతని గురించి రీతూ కి చెప్పకూడదనీ, తానే ఈ విషయాన్ని డీల్ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే అనూజ్ కి ఒక నిజం చెప్పడానికి తగిన సమయం కోసం రీతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. సామ్రాట్ ను అనూజ్ ఎలా ఎదుర్కొంటాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనూజ్ తో రీతూ చెప్పాలనుకుంటున్నదేమిటి? అనేది కథ. 

విశ్లేషణ: సహజంగానే టీనేజ్ లో అమ్మాయిలు - అబ్బాయిల మధ్య ఒక రకమైన ఆకర్షణ మొదలవుతూ ఉంటుంది. ఒకరి అభిరుచులు - అభిప్రాయాలు మరొకరికి గొప్పగా .. ఉన్నతమైనవిగా అనిపిస్తాయి. ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటారో .. వారిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భవిస్తూ ఉంటారు. వాళ్లతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే పిల్లలను పట్టుకోవడానికి పేరెంట్స్ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. 

టీనేజ్ లో పిల్లలు కొన్ని రకాల ఆకర్షణలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అందువలన వాళ్ల కదలికలపై పేరెంట్స్ ఒక కన్నేసి ఉంచుతుంటారు. ఇక టీనేజర్లపై ఫ్రెండ్స్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక వైపున పేరెంట్స్ .. మరో వైపున ఫ్రెండ్స్ .. ఇంకో వైపున చేతిలో అవసరమైనంత డబ్బు లేకపోవడం టీనేజర్లను అసహనానికి గురిచేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆవిష్కరించిన సిరీస్ ఇది.         

దర్శకుడు ఈ కథను చెప్పడానికి సమయం తీసుకున్నాడు. అందువల్లనే తెరపై కథ నిదానంగా కదులుతుంది. సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం వలన, ఎలాంటి హడావిడి లేకుండా సాఫీగా సాగుతుంది. దర్శకుడు ఇటు ఇల్లు .. అటు స్కూలు .. ప్రేమికులు కలుసుకునే ఏకాంత ప్రదేశాలకు సంబంధించిన సన్నివేశాలను డిజైన్ చేసుకున్న తీరు బాగుంది. నందనంగానే అయినా బోర్ అనిపించకుండా ఈ కథ నడుస్తుంది. 

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ఆశ్లేష ఠాకూర్ - విశేష్ బన్సాల్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా ఆ పాత్రలను పండించారు. శ్రీరామ్ గణపతి కెమెరా పనితనం .. గౌరవ్ ఛటర్జీ అందించిన నేపథ్య సంగీతం .. అక్షర ప్రభాకర్ కథకి మరింత హెల్ప్ అయ్యాయి. 

 ఫస్టు సీజన్ లో 6 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ టీనేజ్ లవ్ స్టోరి, యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఆ తరువాత వర్గానికి చెందినవారికి తమ టీనేజ్ లవ్ స్టోరీస్ ను గుర్తుకు తెస్తుంది. ఒక కీలకమైన మలుపు దగ్గర సీజన్ 1కి ముగింపు పలికారు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపు  తీసుకోనుందనేది సీజన్ 2లో తెలుస్తుంది. సీజన్ 2 కూడా త్వరలో తెలుగులో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.