మలయాళంలో టోవినో థామస్ కి మంచి క్రేజ్ ఉంది. ఓటీటీ సినిమాల కారణంగా ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఆయన చేసిన 'ARM' మూవీ, సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను నమోదు చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా, ఈ రోజు నుంచి 'హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: అది అడవికి సమీపంలోని ఓ గ్రామం .. దానిపేరు 'హరిపురం'. ఆ ప్రాంతాన్ని ఎడక్కల్ రాజవంశీకులు పరిపాలిస్తూ ఉంటారు. ఒక రోజున ఆకాశంలో నుంచి ఒక కాంతిపుంజం ఆ గ్రామంవైపు దూసుకు వస్తుంది. ఆ కాంతిపుంజం నేలను తాకిన చోటున ఒక చిత్రమైన పదార్ధం ఏర్పడుతుంది. ఎడక్కల్ సంస్థానాధీశుడు దానిని కరిగించి, దీపాలతో కూడిన ఒక విగ్రహాన్ని తయారు చేయిస్తాడు. దానికి 'విభూతి దీపం' అని పేరు. 

ఆ విగ్రహం అత్యంత విలువైనది .. మహిమాన్వితమైనదని అక్కడి ప్రజలు భావిస్తారు. దానిని ఒక ఆలయంలో ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. ఏడాదికి ఒక రోజు మాత్రమే ఆ ఆలయం తలుపులు తెరుస్తారు. ఆ రోజున జరిగే ఉత్సవానికి ఊళ్లో వాళ్లంతా హాజరవుతూ ఉంటారు. కానీ అజయ్ ( టోవినో థామస్) వర్గానికి మాత్రం ప్రవేశం ఉండదు. అందుకు కారణం అతని తాత కుంజికేలు .. తండ్రి మణియన్ ఇద్దరూ దొంగలుగా మిగిలిపోవడమే.           

 తాత .. తండ్రి కారణంగా అజయ్ ను కూడా ఆ ఊళ్లో వాళ్లంతా దొంగగా చూస్తూ ఉంటారు. అతనిని అర్థం చేసుకుని ప్రేమించే ఒకే ఒక అమ్మాయి లక్ష్మి. ఆమె ఆ గ్రామానికి పెద్దగా ఉన్న నంబియార్ కూతురు. తరచూ ఆమెను అజయ్ రహస్యంగా కలుస్తూ ఉంటాడు. ఆ గ్రామంలో ఆ విగ్రహానికి ఉత్సవాలు జరిపే రోజు దగ్గరపడుతూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే నంబియార్ ఇంటికి సుధీర్ అనే దూరపు బంధువు వస్తాడు. కోట్ల విలువచేసే ఆ విగ్రహాన్ని లండన్ కి తరలించాలనేది అతని ప్లాన్.   

 ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా, ఆలయంలోని విగ్రహం మాయమవుతుంది. దాంతో అంతా అజయ్ నే అనుమానిస్తారు. ఆ విగ్రహాన్ని తాను దొంగిలించలేదని నిరూపించుకోవాలి. తన వర్గం వారికి ఆలయ ప్రవేశం కల్పించాలి. లక్ష్మిని తన భార్యగా చేసుకోవాలి. అనేది అజయ్ ఉద్దేశం. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది ఈ కథలోని ఆసక్తికరమైన అంశాలు.

విశ్లేషణ: ఇది యాక్షన్ తో కూడిన అడ్వెంచర్. సుజిత్ నంబియార్ రాసిన కథ. ఈ కథ మూడు కాలాలలో .. మూడు తరాలలో జరుగుతుంది. ఈ సినిమాలో కథానాయకుడైన టోవినో థామస్, తాతగా .. తండ్రిగా .. మనవడిగా మూడు పాత్రలలో కనిపిస్తాడు. ఈ మూడు పాత్రలను సుజిత్ నంబియార్ డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూడు పాత్రల లుక్స్ డిఫరెంట్ గా ఉంటూ వెంటనే రిజిస్టర్ అవుతాయి. 

ఇక ఎప్పటికప్పుడు ఈ మూడు పాత్రలను టచ్ చేస్తూ, దీపు ప్రదీప్ వేసిన స్క్రీన్ ప్లే  ఆసక్తిని రేకెత్తిస్తూ వెళుతుంది. మూడు కాలాలలో విగ్రహానికి సంబంధించిన అన్వేషణ సాగుతుంది. అలాంటి సమయంలో ఆడియన్స్ అయోమయానికి లోనయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ స్క్రీన్ ప్లే లో చేసిన మేజిక్ కారణంగా కాస్త దృష్టిపెడితే సగటు ప్రేక్షకుడికి విషయం అర్థమైపోతుంది. 

ఒకానొక సమయం వచ్చేసరికి తన తాతకి లభించిన విగ్రహం .. ఆ తరువాత తన తండ్రి కాజేసిన విగ్రహం .. ఇంతకాలంగా గ్రామస్తులంతా కొలుస్తున్న విగ్రహం నకిలీ విగ్రహమని అజయ్ కి తెలుస్తుంది. మరి అసలైన విగ్రహం ఎక్కడుంది? దానిని సాధించడానికి అజయ్ ఏం చేస్తాడు? అనేది కథలో కీలకమైన అంశం. ఇక్కడి నుంచి కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. దర్శకుడు ప్రధాన పాత్రలతో పాటు, గ్రామస్తులందరినీ కథలో భాగం చేయడం హైలైట్ గా అనిపిస్తుంది.

పనితీరు: టోవినో థామస్ ఈ కథలో మూడు పాత్రలను పోషించాడు. ఈ మూడు పాత్రలలో మంచి వేరియేషన్స్ ను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తాడు. మూడు పాత్రలు ఒకదాని తరువాత ఒకటిగా తెరపైకి వస్తుండటం వలన, సినిమా మొదలైన దగ్గర నుంచి చివరివరకూ తెరపై ఆయన కనిపిస్తూనే ఉంటాడు. ఇక రొమాన్స్ .. డ్యూయెట్లు లేకపోయినా, ఉన్నంతలో కృతి శెట్టి అందంగా మెరిసింది. యంగ్ విలన్ గా హరీశ్ ఉత్తమన్ .. గ్రామపెద్దగా సంతోష్ విలనిజం మెప్పిస్తుంది. 

జోమన్ జాన్ ఫొటోగ్రఫీ బాగుంది. అడవులు .. గుహలు .. జలపాతాలు వంటి దృశ్యాలను గొప్పగా ఆవిష్కరించాడు. దిబూ నినన్ థామస్ అందించిన నేపథ్య సంగీతం ఈ కథకి ప్రధానమైన బలమని చెప్పచ్చు. షమీర్ మహ్మద్ ఎడిటింగ్ ఓకే. కథకి అవసరం లేని సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించేలా డిజైన్ చేయడం వల్లనే ఈ కంటెంట్ కి మంచి మార్కులు పడ్డాయని చెప్పచ్చు.