ఓటీటీ ప్రభావం వలన చిన్న సినిమాల థియేటర్స్‌కు ప్రేక్షకులు ఎక్కువగా వెళ్లడం లేదు. చిన్న సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే ఆ కంటెంట్‌ ఎంతో స్ట్రాంగ్‌గా వుండాలి. ప్రతివారం కొన్ని సినిమాలు వస్తుంటాయి.. కనీసం అవి వచ్చిన సంగతి ప్రేక్షకులకు తెలియకుండానే థియేటర్స్‌ నుండి వెళ్లిపోతున్నాయి. ఆ కోవలో నూతన తారలు నటించిన సినిమాలు చేరిపోకుండా వుండాలంటే, చిన్న సినిమా అయిన అంతో ఇంతో సందడి చేయాలి. ఈ విషయంలో 'లవ్ రెడ్డి' కాస్త బెటరే అని చెప్పాలి. అంజన్‌ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా నటించిన ఈ 'లవ్‌ రెడ్డి'కి  స్మరణ్ రెడ్డి దర్శకుడు. అక్టోబర్‌ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా వుందో ఈ చిత్ర సమీక్షలో తెలుసుకుందాం. 

ఆంధ్ర .. కర్ణాటక బోర్డర్ లోని ఓ గ్రామంలో జరిగే కథ ఇది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర) వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తుంటాడు. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి జరగదు. ఇంట్లో వాళ్ళు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నారాయణ రెడ్డికి నచ్చవు. అతని తమ్ముడు(గణేష్) అన్నకి వివాహాం జరిగితే కానీ తన ప్రేమ పెళ్లికి లైన్ క్లియర్‌ అవ్వదని అన్న మీద కోపంతో వుంటాడు. అనుకోకుండా ఒకరోజు నారాయణరెడ్డి బస్సులో దివ్య(శ్రావణి)ని చూసి లవ్‌లో పడతాడు. ఎవరిని చూసినా ఆమెలా కనిపించేంత ప్రేమలో మునిగిపోయి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఓ పెళ్లిచూపులు తీసుకెళ్తే అక్కడ స్వీటీ(జ్యోతి) అనే అమ్మాయిలో దివ్యని చూసుకుని ఓకే చెప్తాడు. కానీ ఆ తర్వాత ఆమె దివ్య ఫ్రెండ్ అని తెలుస్తుంది. ఆమెని దూరం పెడుతూ దివ్యకు తన ప్రేమ గురించి చెప్పకుండా దగ్గరవుదామని ప్రయత్నిస్తుంటాడు నారాయణరెడ్డి.

 ఓ రోజు దివ్య తండ్రి గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఎవరికో చెప్తుంటే విని ఇంట్లో తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం 15 లక్షలు లంచం ఇస్తాడు. కానీ ఆ లంచం తీసుకున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది? నారాయణరెడ్డికి గవర్నమెంట్‌ ఉద్యోగం వస్తుందా?  అసలు నారాయణరెడ్డి దివ్యకు తన ప్రేమను గురించి చెబుతాడా? ఆమె ఒప్పుకుంటుందా? ఇవన్నీ తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. 

ఇప్పటి వరకూ ఎన్ని ప్రేమకథలు వచ్చినా.. ప్రేమ అనే అంశాన్ని సరైన ఎమోషన్స్‌తో చూపించగలిగితే ఖచ్చితంగా ప్రేక్షకలు ఆదరిస్తారు. ఈ కోవలోనే ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాలో కొంత మేరకు కనిపిస్తుంది. మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ ఒక్కటే’. సినిమా ముగింపులో రాసిన కొటేషన్‌ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే చిత్ర కథనమంతా సాగుతుంది. 

కథకు తగిన బలమైన సన్నివేశాలు రాసుకుని ఉం టే కచ్చితంగా ఈ చిత్రం అందరి మెప్పు పొందేది. కొన్ని సన్నివేశాలు రొటిన్‌గా అనిపించినా.. ఆ సీన్స్‌లో వున్న ఎమోషన్స్‌ వల్ల కథను ముందుకు నడిపించాయి. హీరో ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాలు కాస్త సాగతీతగా అనిపించాయి. స్వీటీ సీన్లు కొంతవరకు నవ్వులు పంచుతాయి. నారాయణరెడ్డిని దివ్య లవ్‌ చేస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్‌ వరకు రివీల్‌ చేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచిన సందర్భాలు ఆసక్తిగా ఉన్నాయి.

 సున్నితమైన ప్రేమకథను సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. సినిమా ఫస్ట్‌ హాఫ్‌ సరదాగా.. కాస్త బోరింగ్‌గా వున్నా.. సెకండాఫ్‌లో  మాత్రం లవ్‌ఎమోషన్స్‌ను పండించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఎప్పుడైనా ఓ సినిమాకు సెకండాఫ్‌ అనేది కీలకం. ఇంటర్వెల్‌ తరువాత సినిమాను ఆస్తకిగా నడిపించడంలో దర్శకుడు కొంత మేరకు సక్సెస్‌ అయ్యాడు. అయితే కొన్ని బలమైన ప్రేమ సన్నివేశాలు రాసుకుని వుంటే 'లవ్‌ రెడ్డి' అందరి మనసులు దోచుకునేవాడు. 

నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర న్యాయం చేశాడు. పాత్రలో జీవించకపోయినా ఎక్కడా కూడా తడబాటు కనిపించలేదు.  ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి పర్‌ఫెక్ట్‌గా అనిపించింది. ఇక ఈ చిత్రంలో దివ్య తండ్రిగా నటించిన ఎన్‌టీ రామస్వామి నటన సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది.  చివరి 20 నిమిషాలు కథలోని ఎమోషన్స్‌ని,  ఇంటెన్సిటీని ఆయన పాత్ర ద్వారా వెలికితీశాడు దర్శకుడు.

 ఇక ఈ సినిమాలో నటించిన మరికొంత మంది కొత్తవారైనా ఎక్కడా ఆ ఛాయలు కనిపించలేదు. ప్రిన్స్‌ నేపథ్య సంగీతం, పాటలు కథ మూడ్‌ను క్యారీ చేశాయి. ఫోటోగ్రఫీ ద్వారా నేటివిటిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేశాడు కెమెరామెన్‌. కథ .. నటీనటుల ఎంపిక చూస్తే నిర్మాతలకు సినిమాపై ఉన్న అభిరుచి కనిపిస్తుంది. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా బాగున్నాయి.

ఫైనల్‌గా గ్రామీణ నేపథ్య ప్రేమకథలను, నిజాయితీ ప్రేమకథలను ఇష్టపడేవారికి 'లవ్‌ రెడ్డి' కొంత మేరకు నచ్చుతుంది. లవ్‌స్టోరీలను చూసేవారిని మాత్రం నిరాశపరచదు.