'అర్జున్ సురవరం' మూవీ రివ్యూ

29-11-2019 Fri 15:58
Movie Name: Arjun Suravaram
Release Date: 2019-11-29
Cast: Nikhil Siddharth, Lavanya Tripathi,Tarun Arora, Posani, Vennela Kishore, Nagineedu, Pragathi, Raja Ravindra, Sathya
Director: T.N. Santhosh
Producer: RajKumar Akella
Music: Sam CS
Banner: Movie Dynamix 

నకిలీ సర్టిఫికెట్లకి సంబంధించిన వ్యాపారం కోట్ల రూపాయల్లో కొనసాగుతూ ఉంటుంది. ఆ మాఫియా దెబ్బకి 'అర్జున్ సురవరం' అనే రిపోర్టర్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దాంతో ఆ మాఫియాకి అడ్డుకట్టవేయడానికి అతను రంగంలోకి దిగుతాడు. పర్యవసానంగా అతనికి ఎదురయ్యే పరిస్థితులతో ఈ కథ సాగుతుంది. బలమైన కథాకథనాలతో .. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

మొదటి నుంచి కూడా విభిన్నమైన కథాంశాలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ నిఖిల్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'అర్జున్ సురవరం' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంతకాలం క్రితం తమిళంలో సక్సెస్ ను సాధించిన 'కనితన్'కి ఇది రీమేక్. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన టీఎన్ సంతోష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్కడ హీరో అధర్వ' కెరియర్ కి హెల్ప్ అయిన 'కనితన్' .. రీమేక్ గా ఇక్కడి ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

అర్జున్ సురవరం (నిఖిల్) ఒక న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా పనిచేస్తుంటాడు. తను మీడియాలో పనిచేయడం తండ్రి చంద్రశేఖర్ (నాగినీడు)కి ఇష్టంలేకపోవడం వలన, ఆయన దగ్గర ఈ విషయాన్ని దాస్తాడు. బీబీసీలో రిపోర్టర్ గా చేయాలనేది అర్జున్ ఆశయం. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే, 'కావ్య'(లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడుతుంది. కావ్య కూడా రిపోర్టర్ కావడంతో వాళ్ల మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అర్జున్ ని పోలీసులు అరెస్టు చేస్తారు. నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని బ్యాంకును మోసం చేశాడని అతనిపై కేసు ఫైల్ చేస్తారు. అతనితో పాటే ఆయా ప్రాంతాల్లోని కొంతమంది విద్యార్థులు అరెస్టు అవుతారు. దాంతో ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తెలుసుకోవడం కోసం అర్జున్ రంగంలోకి దిగుతాడు. పర్యవసానంగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అవి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి? అనేది మిగతా కథ.

దర్శకుడు సంతోష్ కథను పకడ్బందీగా తయారు చేసుకున్న తీరు .. కథనాన్ని నడిపించిన విధానం ఆసక్తికరంగా వున్నాయి. ఇటు హీరో పాత్రను .. అటు విలన్ పాత్రను ఆయన డిజైన్ చేసుకున్న పద్ధతి బాగుంది. ఏ పాత్రను ఎక్కడ పరిచయం చేయాలో .. ఏ పాత్రను ఎక్కడ ముగించాలో అక్కడ ఆయన ఆ పని చేశాడు. అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ గా రాజారవీంద్రను చూపించిన ఆయన, ప్రాణాలను సైతం త్యాగం చేసిన నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ గా పోసానిని చూపించి బ్యాలెన్స్ చేశాడు. లవ్ ..యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని తగిన పాళ్లలో కలుపుతూ ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టేయడంలో ఆయన సక్సెస్ అయ్యాడు.
 
విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విలన్ ఎవరనేది తెలుసుకోవడానికి ఇక్కడ హీరో రంగంలోకి దిగిన సమయంలోనే, తన బిజినెస్ కి ఎసరుపెట్టిన హీరో ఎవరనేది ఆరా తీయడానికి అక్కడ విలన్ రంగంలోకి దిగుతాడు. ఎవరికివారు తమదైన స్టైల్లో అన్వేషణ చేస్తూ ఒకరి ఇలాకాలోకి ఒకరు ఒకే సమయంలో అడుగుపెడతారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఒక ప్లాన్ ప్రకారం తలపడతారు. ఇలా ఉత్కంఠను రేకెత్తించే స్క్రీన్ ప్లేతో దర్శకుడు ఆద్యంతం మెప్పించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో సహా, సగటు ప్రేక్షకుడికి సంతృప్తినిచ్చే క్లైమాక్స్ ను ఇచ్చాడు. పోసాని ఎపిసోడ్ .. 'ఛత్రపతి' శేఖర్ ఎపిసోడ్ ..
పోలీస్ వ్యాన్లో నుంచి దూకేసి ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకునే ఎపిసోడ్స్ తో ఎమోషన్ పాళ్లు పెంచడంలోను, నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్లు .. ఇంజనీర్లు అయితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయనేది కళ్లకు కట్టడంలోను దర్శకుడు సఫలీకృతుడయ్యాడు.

అర్జున్ పాత్రలో నిఖిల్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఎక్కడ కూడా ఆయన తన పాత్రలో నుంచి బయటికి రాలేదు. తనపై మోపబడిన నేరం నిజం కాదని నిరూపించడం కోసం .. తనలాగే మిగతా విద్యార్థులు మోసపోకూడదనే ఉద్దేశంతో మాఫియాతో తలపడే రిపోర్టర్ పాత్రకి ఆయన న్యాయం చేశాడు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లో మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. ఇక కావ్యగా లావణ్య త్రిపాఠి పాత్ర పరిధిలో నటించింది. ప్రతినాయకుడి పాత్రలో తరుణ్ అరోరా గొప్పగా చేశాడు. నిబ్బరంగా కనిపిస్తూ .. నిర్భయంగా తను అనుకున్నది చేస్తూ వెళ్లే మాఫియా డాన్ గా ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. హీరోకి తండ్రి పాత్రలో నాగినీడు ఎమోషనల్ సీన్స్ బలాన్ని పెంచాడు. పోలీస్ ఆఫీసర్ గా పోసాని .. లాయర్ గా వెన్నెల కిషోర్ తండ్రీకొడుకులుగా తమ పాత్రలకు జీవం పోశారు. ఇక రాజారవీంద్ర .. ప్రగతి .. సత్య .. విద్యుల్లేఖ ఓకే అనిపించారు.

సామ్ సీఎస్ సంగీతం .. రీ రికార్డింగ్ ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యంగా రీ రికార్డింగ్ ఏ సన్నివేశం నుంచి కూడా ప్రేక్షకుడు జారిపోకుండా చేసింది. సూర్య కెమెరా పనితనానికి నూటికి నూరు మార్కులు ఇచ్చేయవచ్చు. యాక్షన్ .. ఎమోషన్ .. ఛేజింగ్ దృశ్యాలను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఫస్టాఫ్ లోని రెండవ సాంగులో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ ను చూపించిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్కడ అనవసరమైన సీన్స్ గానీ .. సాగతీత సీన్స్ గాని కనిపించవు. 'ఈ కోపం నువ్వు నిజం చెప్పనందుకు కాదు .. నువ్వే నిజం కానందుకు' అనే లావణ్య త్రిపాఠి డైలాగ్ .. 'ఇంగ్లిష్ లాగ్వేజ్ మాత్రమే సార్ .. నాలెడ్జ్ కాదు' అనే డైలాగ్స్ సందర్భోచితంగా పేలాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ .. వెంకట్ ఫైట్స్ బాగున్నాయి.

దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేసుకుని, యాక్షన్ - ఎమోషన్ పాళ్లను కరెక్టుగా కలుపుకుని పెర్ఫెక్ట్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుంచాడు. ఈ నేపథ్యంలో రొమాన్స్ పాళ్లు తగ్గినా, ఆ వెలితి ఎంతమాత్రం తెలియదు. విలన్ మనిషి అయిన పోలీస్ ఆఫీసర్, నకిలీ సర్టిఫికెట్ల విషయాన్ని కప్పిపుచ్చకుండా ఎందుకు హైలైట్ చేస్తాడు? అనే లాజిక్ ను పక్కన పెడితే, ఇటు యూత్ కి .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.    


More Articles