సత్యరాజ్ చాలా కాలం నుంచే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అలాంటి ఆయన 'కట్టప్ప' పాత్రతో మరింతగా ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు. అలాగే సీనియర్ హీరోయిన్ సీత కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. అలాంటి ఈ ఇద్దరూ ప్రధానమైన పాత్రలను పోషించిన వెబ్ సిరీస్ 'మై పెర్ఫెక్ట్ హస్బెండ్'. తమిర దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ఈ నెల 16వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
భారతి (సత్యరాజ్) సరస్వతి (సీత) భార్యాభర్తలు. వారికి ముగ్గురు మగపిల్లలు .. ఒక ఆడపిల్ల. భారతి చెన్నైలోని ఒక ప్రైవేట్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన పనేమిటో తాను చూసుకునిపోయే ప్రొఫెసర్ గా ఆయనకి మంచి పేరు ఉంటుంది. ఆయన పెద్ద కొడుకు వశీకరణ్ కి కేరళ నుంచి ఒక సంబంధం వస్తుంది. కొన్ని కారణాల వలన, తాను వెళ్లడం కుదరక కుటుంబ సభ్యులను పంపిస్తాడు భారతి.
కేరళకి చెందిన ఆ అమ్మాయి పేరు దీపిక (వర్ష బొల్లమ్మ). ఆ అమ్మాయి చలాకీతనం సరస్వతికి బాగా నచ్చుతుంది. పెళ్లి చూపులలోనే ఆమె సరస్వతి ఫ్యామిలీతో చనువైపోతుంది. సరస్వతి కూతురుతోను సాన్నిహిత్యం పెంచుకుంటుంది. అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత దీపిక గురించి భారతి దగ్గర సరస్వతి ప్రస్తావిస్తుంది. పెళ్లి కూతురు తల్లి పేరు కూడా భారతియేననీ .. ఆమె భర్త పేరు సుబ్రమణ్యమని చెబుతుంది. ఆ మాటలకు భారతి ఆలోచనలో పడతాడు.
ఒక్కసారిగా అతను జూనియర్ కాలేజ్ రోజులకు వెళ్లిపోతాడు. భారతి చదువుకునే రోజులలో ఆ ఊరికి బదిలీ కావడం వలన ఒక ఇంజనీర్ వస్తాడు. అతని కూతురు పేరు కూడా భారతినే. ఆ అమ్మాయిని చూడగానే భారతి మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఆ అమ్మాయి తండ్రికి తెలుస్తుంది. దాంతో అతను ఆ ఊరు నుంచి వేరే చోటుకి బదిలీ చేయించుకుని వెళ్లిపోతాడు. ఆ తరువాత ఆమె ఏమైపోయింది భారతికి తెలియదు.
అలాంటి ఆమె కూతురుతో తన కొడుకు పెళ్లి జరిపించవలసి రావడం అతనికి కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ పెళ్లి జరగకుండా చూడాలని భావిస్తాడు. అంతకుముందుగా తన లవ్ స్టోరీ గురించి భార్యకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. భార్యకి ఎలా చెప్పాలా అనే విషయంలో రిహార్సల్ చేస్తాడు. అప్పుడే ఆమె వినేసి నానా గందరగోళం చేస్తుంది. తన జీవితంలోకి ఆమె రావడానికి ముందు జరిగిన కథను గురించి అంతగా పట్టించుకోవద్దని చెబుతూనే, గతమంతా భార్య ముందు పెడతాడు.
కేరళ సంబంధం కేన్సిల్ చేసుకోవడమే అన్ని విధాలా మంచిదని భారతి చెబుతాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకుంటుంది. అయితే అప్పటికే దీపిక తమ పిల్లల పట్ల చనువు పెంచుకోవడం గురించిన ఆలోచన చేస్తారు. ఏదో ఒక కారణం చెప్పి కేన్సిల్ చేసుకోవడమే మంచిదని భావిస్తారు. సరిగ్గా అదే సమయంలో తమ గుమ్మంలోకి అడుగుపెట్టిన దీపికను చూసి వారు షాక్ అవుతారు. కేరళ నుంచి దీపిక చెన్నై ఎందుకు వస్తుంది? వశీకరణ్ ఎవరనేది తెలిసి దీపిక తల్లి ఎలా స్పందిస్తుంది? దీపిక - వశీకరణ్ పెళ్లి జరుగుతుందా .. ఆగుతుందా? అనేది మిగతా కథ.
ఈ కథలో మూడు దశలు కనిపిస్తాయి. పెద్దవాళ్ల గతానికి సంబంధించిన ప్రేమకథ .. ఇప్పుడు వారి పిల్లలలకి సంబంధించిన లవ్ స్టోరీ .. ఈ రెండు కుటుంబాల ప్రస్తుత పరిస్థితి. గతంలోని వారి ప్రేమ .. ఇప్పుడు వారి పిల్లల పెళ్లికి అడ్డుగా మారుతుందా అనేది సస్పెన్స్. ఈ మూడు దశాలను కలుపుకుంటూ .. అల్లుకుంటూ ఈ కథ కొనసాగుతుంది. ప్రధానంగా కనిపించే 10 పాత్రల చుట్టూనే ఈ కథ నడుస్తుంది.
ఫ్లాష్ బ్యాక్ గా వచ్చే గ్రామీణ నేపథ్యంలోని ప్రేమకథ . ఇప్పుడు ఆ జంట మధ్య జరుగుతున్న సంఘర్షణను దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగానే ఉంది. అయితే ఈ జనరేషన్ లవ్ స్టోరీలో ఆశించిన స్థాయి స్పీడ్ కనిపించదు. కథ మొదలైన దగ్గర నుంచి నిదానంగా నడుస్తూ ఉంటుంది. ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేవు. సత్యరాజ్ - సీత పాత్రల ట్రాకు మాత్రం అక్కడక్కడా కాస్త నవ్వుముఖం పెట్టుకునేలా చేస్తాయి.
ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకున్నారుగానీ .. దానిని ఆశించిన స్థాయిలో ఆవిష్కరించలేకపోయారనిపిస్తుంది. నిజానికి ఇలాంటి కంటెంట్ కి మంచి సీన్స్ .. డైలాగ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. హాయిగా నవ్వుకునేలా కామెడీ టచ్ ఇచ్చుకోవచ్చు. కానీ అవేమీ లేకుండా నిదానంగా నడిపించిన విధానం ప్రేక్షకుల సహనానికి చిన్నపాటి పరీక్షనే పెడుతుంది. 8 ఎపిసోడ్స్ లోని కంటెంట్ ను 6 ఎపిసోడ్స్ కి సర్దేస్తే కొంతవరకూ సెట్ అయ్యేదేమో అనిపిస్తుంది.
ఈ కథను సాధ్యమైనంత వరకూ నాలుగు గోడల మధ్యలోనే నడిపించారు. కేరళ లొకేషన్స్ కూడా కథలో ఇన్వాల్వ్ చేస్తే బాగుండేదేమో. అసలే కథ డల్ గా నడుస్తుంటే .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో కదులుతూ ఉంటుంది. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఓ మాదిరిగానే అనిపిస్తాయి. నిజానికి సత్యరాజ్ .. సీత వంటి ఆర్టిస్టులు కనిపించగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తారు. కానీ వాళ్ల అంచనాలకు కాస్త దూరంగానే ఆగిపోయిన సిరీస్ ఇది. ఎలాంటి అసభ్యతకు తావులేని ఈ కంటెంట్ ను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు.
'మై పర్ఫెక్ట్ హస్బెండ్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!
My Perfevtt Husband Review
- సత్యరాజ్ ప్రధాన పాత్రధారిగా 'మై పెర్ఫెక్ట్ హస్బెండ్'
- కీలకమైన పాత్రలో సీనియర్ నటి సీత
- నిదానంగా సాగే కథాకథనాలు
- ఆశించిన స్థాయిలో ఆకట్టుకోని కంటెంట్
- ఫ్యామిలీ ఆడియన్స్ నిస్సందేహంగా చూడొచ్చు
Movie Details
Movie Name: My Perfevtt Husband
Release Date: 2024-08-16
Cast: Sathyaraj, Seetha, Livingston, Varsha Bollamma, Rakshan
Director: Thamira
Music: Vidyasagar
Banner: Hotstar
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer