ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి అయిన 'జార్జి రెడ్డి' సినిమా అనే సరికి ఇది బయోపిక్ అని అంతా భావించారు. ఈ సినిమా ద్వారా ఎలాంటి వివాదాస్పదమైన అంశాలు తెరపైకి రానున్నాయోనని అనుకున్నారు. అలాంటివాటికి ఎంత మాత్రం అవకాశం ఇవ్వకుండా, ఇది ప్రేరణ మాత్రమేననీ .. కల్పితమని దర్శకుడు ముందుమాటగా చెప్పేశాడు. సందీప్ మాధవ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిందన్నది ఇప్పుడు చూద్దాం.
'జార్జి రెడ్డి' జీవితచరిత్రను డాక్యుమెంటరీగా రూపొందించాలని భావించిన ఓ యువతి, ఆయనకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించడం కోసం న్యూయార్క్ నుంచి ఇండియాకి బయల్దేరడంతో ఈ కథ మొదలవుతుంది. 'జార్జి రెడ్డి' (సందీప్ మాధవ్) బాల్యంతో కేరళలో మొదలైన ఈ కథ, హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరుకుంటుంది. తెలివైనవాడు .. ధైర్యవంతుడు అయిన జార్జిరెడ్డి, క్యాంపస్ లో వున్న అసమానతలపై గళం విప్పుతాడు. ఆ తరువాత అక్కడి సమస్యల పరిష్కారానికై నడుం బిగించి, విద్యార్థి నాయకుడవుతాడు. తమ రాజకీయాలకు .. రౌడీయిజానికి విద్యార్థులను పావులుగా వాడుకుందామని భావించినవారికి జార్జి రెడ్డి అడ్డంకిగా మారతాడు. ఆయనను అడ్డు తప్పించడానికి వాళ్లు పన్నిన వ్యూహాలతో మిగతా కథ నడుస్తుంది.
దర్శకుడు జీవన్ రెడ్డి .. జార్జి రెడ్డి స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను చాలా గొప్పగా డిజైన్ చేశాడు .. తెరపై చాలా సహజంగా ఆవిష్కరించాడు. కాలేజ్ క్యాంపస్ అల్లర్లు .. బయటి నుంచి రౌడీ రాజకీయాల ప్రభావం వంటి అంశాలను చాలా బాగా తెరకెక్కించాడు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూనే, కామెడీ కోసం ఒక స్టూడెంట్ గా యాదమ్మరాజు పాత్రను నడిపిన తీరు బాగుంది.
అయితే 'జార్జి రెడ్డి' ఆవేశంతో అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను చూపించాడుగానీ, అసలు ఆయన సిద్ధాంతమేమిటి? ఆశయం ఏమిటి? అనే విషయాల్లో క్లారిటీ ఇవ్వలేకపోయాడు. తోటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం తన భవిష్యత్తును పణంగా పెట్టాడంటే బలమైన ఆశయమేదో వుండకపోదు. శత్రువులంతా చుట్టుముట్టి కర్రలతో .. కత్తులతో దాడికి దిగుతున్నపుడు 'జార్జి రెడ్డి' తన దగ్గరున్న 'తుపాకి'ని ఎందుకు ఉపయోగించలేదనే సందేహానికి దర్శకుడు సమాధానం చెప్పిస్తే బాగుండేది. ఇక 'జార్జి రెడ్డి' డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ముస్కాన్ ఎవరు? ఆమె ఇండియాకి వచ్చి ఎవరిని కలిసింది? అనే విషయం కూడా సగటు ప్రేక్షకుడికి అర్థం కాదు. ఆ సన్నివేశాలు కాస్త రిజిస్టర్ అయ్యేలా చిత్రీకరించి ఉండాల్సింది.
ఈ కథలో కీలక పాత్రధారులైన సత్యదేవ్ .. మనోజ్ నందం ఇద్దరూ క్యాంపస్ తో సంబంధం వున్నవారే. 'జార్జి రెడ్డి' పట్ల వాళ్ల అభిప్రాయమేమిటన్నది చూపించరు .. ఈ మూడు పాత్రలు అసలు ఎదురుపడవు .. కారణం తెలియదు. కొన్ని పాత్రలను హఠాత్తుగా ప్రవేశపెట్టేయడం .. మరికొన్ని పాత్రలను అర్థాంతరంగా ముగించడం వంటివి చేశాడు. వినయ్ వర్మ పాత్ర .. తిరువీర్ పాత్ర ఆ కేటగిరిలోకే వస్తాయి. ఈ కథ 1960 -70 మధ్య కాలంనాటిది కావడంతో, అప్పటి కాస్ట్యూమ్స్ తోనే స్టూడెంట్స్ అందరినీ చూపించాలి. ఇక్కడే దర్శకుడు చాలా ఇబ్బందిపడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
'జార్జి రెడ్డి' పాత్రలో సందీప్ మాధవ్ జీవించాడనే చెప్పాలి. తెరపై ఆయన పాత్ర తప్ప ఆయన కనిపించడు. అంత సహజంగా ఆయన నటించాడు. విద్యార్థుల సమస్యలపై మాత్రమే దృష్టిపెట్టిన ఒక విద్యార్థి నాయకుడిగా ఆ పాత్రకి ఆయన పూర్తి న్యాయం చేశాడు. సింపుల్ గా కనిపిస్తూ నీట్ గా ఆ పాత్రను ఓన్ చేసుకున్న తీరుతో ఎక్కువ మార్కులు కొట్టేశాడు. ఇక కథానాయికగా ముస్కాన్ గ్లామర్ పరంగాను .. నటన పరంగాను పాత్ర పరిథిలో మెప్పించింది. ప్రతినాయకుడి పాత్రలో 'శత్రు' బాగా చేశాడు. సత్యదేవ్ .. వినయ్ వర్మ .. మనోజ్ నందం మంచి ఆర్టిస్టులు. కానీ వాళ్ల పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన తేలిపోయాయి. ఇక యాదమ్మరాజు పాత్ర పరిధిలో నవ్వించాడు.
ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. సందర్భానుసారంగా వచ్చే పాటలు బాగానే అనిపిస్తాయి. రీ రికార్డింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ లోకి ప్రేక్షకుడిని పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తూ ఈ రీ రికార్డింగ్ సాగింది. సుధాకర్ ఫొటోగ్రఫీ ఈ సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టేసింది. క్యాంపస్ సీన్స్ తో పాటు .. కేరళలోని సీన్స్ ను .. వర్షంలో యాక్షన్ సీన్ ను ఆయన చిత్రీకరించిన తీరు గొప్పగా వుంది. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా 'గాంధీ' పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని 'ఆర్ట్స్ కాలేజ్' సెట్ ను ఆయన తీర్చిదిద్దిన తీరు చూస్తే అభినందించకుండా ఉండలేం. ఇక ఎడిటింగ్ పరంగా చూసుకుంటే కొన్ని లూజ్ సీన్స్ కనిపిస్తాయి. తిరువీర్ .. మనోజ్ నందం .. వినయ్ వర్మ సీన్స్ అనవసరమనిపిస్తాయి.
దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన 'జార్జి రెడ్డి' చూస్తుంటే, ప్రేక్షకులకి థియేటర్లో కాకుండా క్యాంపస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అంత సహజంగా ఆయన ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే 'జార్జి రెడ్డి' కాలేజ్ లైఫ్ కి సంబంధించిన కంటెంట్ పై .. ఆయనని అంతమొందించాలనుకునే టీమ్ లోని పాత్రలపై మరింత శ్రద్ధ పెట్టి వుంటే ఈ సినిమా మరో మెట్టుపైన ఉండేది. కొన్ని చోట్ల క్లారిటీ మిస్ అయినప్పటికీ, ఓవరాల్ గా చూస్తే ఈ సినిమా ఫరవాలేదనిపిస్తుంది.
'జార్జి రెడ్డి' మూవీ రివ్యూ
George Reddy Review
ఉస్మానియా యూనివర్సిటీలో 'జార్జి రెడ్డి' చదువుకునేటప్పుడు వున్న సమస్యలు, వాటి పరిష్కారానికై విద్యార్థులను చైతన్యవంతులను చేస్తూ ఆయన పోరాట శంఖం పూరించిన తీరుతో ఈ కథ నడుస్తుంది. ఆ కాలంనాటి కాస్ట్యూమ్స్ విషయంలో కొంత ఇబ్బంది పడినట్టుగా అనిపించినా, సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన సన్నివేశాలతో ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
Movie Details
Movie Name: George Reddy
Release Date: 2019-11-22
Cast: Sandeep Madhav, Muskaan, Devika, Sathya Dev, Shatru, Manoj Nandam, Yadamma Raju
Director: Jeevan Reddy
Music: Suresh Bobbili
Banner: Mic Movies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.