మానవ్ కౌల్ .. తిలోత్తమా షోమ్ .. శ్వేతాబసూ ప్రసాద్ .. ప్రధానమైన పాత్రలను పోషించిన 'త్రిభువన్ మిశ్రా CA టాపర్' ఈ నెల 18వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 9 ఎపిసోడ్స్ తో .. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట నిడివిని కలిగిన ఈ సిరీస్, తెలుగులోను అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 'నోయిడా' నేపథ్యంలో జరుగుతుంది. త్రిభువన్ మిశ్రా CA టాపర్. అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన విషయాలను అప్రూవల్ చేసే విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అతను చాలా నిజాయితీ పరుడు. తన జీతంతో మాత్రమే తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించే ఒక మధ్యతరగతి మనిషి. అతను తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడో .. తన భార్య పిల్లలను అంతే బాగా చూసుకుంటూ ఉంటాడు.

త్రిభువన్ కి భార్య అశోక్ లత ( నైనా సరీన్) అంటే ఎంతో ఇష్టం. ఆమె తమ్ముడు శంభు .. మరదలు శోభ (శ్వేతా బసు ప్రసాద్) అక్కడికి దగ్గరలోనే నివాసం ఉంటారు. త్రిభువన్ కి అత్తగారు 'మండోదరి' అంటే కొంచెం భయమే. త్రిభువన్ నిజాయితీ కారణంగా అతని పై అధికారులు సైతం భయపడుతూ ఉంటారు. అవకాశం ఉన్నా లంచాలు తీసుకోని కారణంగా, అందరూ అతని గురించి 'బ్రతకడం చేతకాని సన్నాసి' అనే చెప్పుకుంటూ ఉంటారు. 

జీవితం అందంగా .. హాయిగా సాగిపోతుందని అతను అనుకుంటున్న సమయంలో, త్రిభువన్ తన డబ్బు దాచుకున్న బ్యాంకును ఫ్రీజ్ చేస్తారు. దాంతో అతను తన డబ్బు వాడుకోకుండా అవుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే, అతను మనసు చంపుకుని కొన్ని ఫైల్స్ పై సైన్ చేస్తే సరిపోతుంది. కానీ అతను ఆ పని చేయలేకపోతాడు. అప్పుడే అతను 'మగ వేశ్య'ల సర్వీస్ ను గురించి మొదటిసారిగా వింటాడు. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని అర్థమవుతుంది. తాను రొమాంటిక్ హీరోనంటూ తన భార్య సర్టిఫికెట్ ఇచ్చిన కారణంగా, ఆ దారిలోకి అడుగుపెడతాడు. 

నోయిడాలో టికా రామ్ జైన్ (శుభ్రజ్యోతి భరత్) బయట ప్రపంచానికి సంబంధించినంత వరకూ ఒక స్వీట్ షాప్ నడుపుతూ ఉంటాడు. కానీ నిజానికి అతను ఒక మాఫియా డాన్ తో సమానమైన వ్యక్తి. అతని దగ్గర కొంతమంది రౌడీలు పనిచేస్తూ ఉంటారు. అందుకు సంబంధించిన లావాదేవీలన్నీ స్వీట్ షాప్ వెనుక జరుగుతూ ఉంటాయి. అందరూ అతనిని 'రాజా భాయ్' అని పిలుస్తుంటారు.  అతని భార్య పేరు 'బిందీ' .. ఆమెకి సినిమా పిచ్చి ఎక్కువ. ఆ రంగుల కలలోనే బ్రతుకుతూ ఉంటుంది. అలాంటి ఆమె తన భర్త నుంచి ఆశించిన ప్రేమ లభించకపోవడం వలన, త్రిభువన్ సర్వీస్ కి అలవాటు పడుతుంది.  

 ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా ఒక వైపున మగ వేశ్యగా పని చేస్తూనే, మరో వైపున కొన్ని తప్పుడు ఫైల్స్ పై త్రిభువన్ సంతకం చేస్తాడు. ఫలితంగా అతని లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోవడంతో, ఇంట్లో అత్తగారితో సహా, బయటవాళ్లందరికీ అనుమానం వస్తుంది. అదే సమయంలో బిందీ .. త్రిభువన్ ఒక హోటల్లో కలిసి ఉండగా పట్టుకోవడానికి రాజాభాయ్ మనిషి లక్కూ ట్రై చేస్తాడు. లక్కూ నుంచి తప్పించుకోవడానికి అతనిని త్రిభువన్ హత్య చేస్తాడు. 

హంతకుడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ హైదర్ (శ్రీకాంత్ వర్మ) రంగంలోకి దిగుతాడు. హంతకుడు దొరికితే అతనితో తన భార్య ఉందని తెలుస్తుంది గనుక, ఆ లోగానే అతనిని చంపాలని రాజా భాయ్ ప్లాన్ చేస్తాడు. త్రిభువన్ ను తన భర్త చంపేలోగా అతనితో కలిసి ఎక్కడికైనా పారిపోవాలని బిందీ భావిస్తుంది. త్రిభువన్ ప్రవర్తనపై అనుమానం రావడంతో, అతని అత్తగారు రహస్యంగా ఫాలో కావడం మొదలెడుతుంది. ఇంతమంది బారి నుంచి తప్పించుకోవడానికి
త్రిభువన్ పడే అవస్థలే ఈ కథ.

ఈ కథను సుమిత్ పురోహిత్ .. ఆర్తి రావల్ .. కరణ్ వ్యాస్ కలిసి డెవలప్ చేశారు. నిజాయితీపరుడైన ఒక అధికారి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏం చేస్తాడు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? అప్పుడు అతని చుట్టూ ఉన్నవారు ఎలా బలం పుంజుకుంటారు? జీవితంలో డబ్బు సంపాదించడమే ప్రధానమనుకునే వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి? ఫలితంగా పగ - ప్రతీకారాలు ఎలా రాజ్యమేలతాయి? అనే ఈ కథకు స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా నిలిచింది.

కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, కథలో ఉన్న బలం .. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక ఆసక్తి అలా కూర్చోబెట్టేస్తాయి. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం .. ఆ పాత్రలను నడిపించిన విధానం ఆకట్టుకుంటాయి. ఈ కథలో హీరో మగవేశ్య గనుక మొదటి నాలుగు ఎపిసోడ్స్ లో అభ్యంతరకరమైన సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఇక ఆ తరహా డైలాగ్స్ చివరివరకూ వినిపిస్తూనే ఉంటాయి. అక్కడక్కడా ఇచ్చిన కామెడీ టచ్ మాత్రం నవ్విస్తుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించినవారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. అనూజ్ సంతాని కెమెరా పనితనం .. అనురాగ్ సైకా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. అమిత్ కులకర్ణి ఎడిటింగ్ కూడా బాగుంది. ఈ కథలో కామెడీ టచ్ తో కూడిన ఫ్యామిలీ డ్రామా ఉంది. అయితే మొదటి 4 ఎపిసోడ్స్ లో రొమాన్స్ పాళ్లు ఎక్కువ. అందువలన ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ కాదు ఇది. ఎవరికి వారుగా చూడవలసిందే. మొత్తం డ్రామాగా చూసుకుంటే, చివర్లో మరికాస్త నవ్విస్తూనే శుభం కార్డు పడుతుంది.