'విజయ్ సేతుపతి' మూవీ రివ్యూ

Vijay Sethupathi

Movie Name: Vijay Sethupathi

Release Date: 2019-11-15
Cast: Vijay Sethupathi, Rasi Khanna, Nivetha Pethuraj, Nassar,Ashuthosh Rana, Ravi Kishan, Soori
Director:Vijay Chandar 
Producer: Ravuri Srinivas 
Music: Vivek - Mervin 
Banner: Harshitha Movies
Rating: 1.75 out of 5
పచ్చదనానికీ .. మంచితనానికి ప్రతీకగా కనిపించే పల్లెటూరు అది. ఆ ఊరు బాగు కోసం తపించే దేవరాజ్ కొడుకే విజయ్ సేతుపతి. రాజకీయనాయకుడైన చంటబ్బాయ్ .. పారిశ్రామికవేత్త అయిన సంజయ్ కలిసి ఆ ఊళ్లో 'కాపర్ ఫ్యాక్టరీ' పెట్టాలనుకుంటారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కారణంగా తన తల్లిదండ్రులనీ, కాబోయే భార్యని విజయ్ సేతుపతి పోగొట్టుకుంటాడు. ఆ తరువాత ఆయన ఏం చేస్తాడు? అనేదే కథ. ఏ మాత్రం కొత్తదనం లేని ఈ కథ సహనానికి పరీక్ష పెడుతూ సాగుతుంది. 

తమిళనాట విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉంది. విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకి ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన ఇమేజ్ కి తగినట్టుగా సినిమాలో మాస్ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. అలా తమిళంలో ఆయన తాజా చిత్రంగా వచ్చిన 'సంఘ తమిజన్' .. తెలుగులో 'విజయ్ సేతుపతి' పేరుతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడో లేదో చూద్దాం.

'మంగళాపురం' గ్రామానికి దేవరాజ్ (నాజర్) పెద్దగా వ్యవహరిస్తూ ఉంటాడు. సహనంతో ఆయన గ్రామ సమస్యలను పరిష్కరిస్తూ వుంటే, ఆయన కొడుకు విజయ్ సేతుపతి (విజయ్ సేతుపతి)తన కండబలంతో మరికొన్ని పనులను చక్కబెడుతుంటాడు. ఆ ఇంటిని ఓ దేవాలయంగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు. అలాంటి ఊరుపై పారిశ్రామికవేత్త అయిన సంజయ్ (రవికిషన్) కన్నుపడుతుంది. అక్కడ 'కాపర్ ఫ్యాక్టరీ' పెట్టాలనే ఆయనకి, ఆ ఊరు ఎమ్మెల్యే అయిన చంటబ్బాయ్ (అషుతోష్ రాణా) సహకరిస్తాడు. ఈ విషయంలో గ్రామస్థులను ఏకం చేసి ఎదిరించిన కారణంగా, విజయ్ సేతుపతి తల్లిదండ్రులను .. ఆయన కాబోయే భార్యను చంటబ్బాయ్ హతమారుస్తాడు. అప్పుడు విజయ్ సేతుపతి ఏం చేస్తాడు? శత్రువులకు బుద్ధి చెప్పడానికి ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడనేదే మిగతా కథ.

దర్శకుడు విజయ్ చందర్ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చిత్రం ఇది. గ్రామీణ నేపథ్యం నుంచి తమిళ మాస్ ఆడియన్స్ ఆశించే అవుట్ పుట్ ను ఆయన కొంతవరకూ రాబట్టాడు. అయితే తెలుగు ఆడియన్స్ కి అది కాస్త 'అతి'గా అనిపిస్తుంది. గతంలో మాస్ ఇమేజ్ వున్న తమిళ హీరోలు చేసిన కథనే ఇప్పుడు విజయ్ సేతుపతి చేశాడంతే. కథలోగానీ .. కథనంలోగాని ఎక్కడా కొత్తదనం కనిపించదు.

 విజయ్ సేతుపతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి వెళ్లకముందు, 'చరణ్' పేరుతో సినిమాల్లో కమెడియన్ వేషాలకి ప్రయత్నించే సాధారణమైన వ్యక్తిగా చూపిస్తారు. ఆ విధంగా చూపించడం వలన ఏం ఒరిగిందనేది అర్థం కాదు. యుద్ధం చేయవలసింది తను మాత్రమేనని తెలిసినప్పుడు, తనకి తానుగా కథానాయకుడు అజ్ఞాతంలో ఉండటంలో అర్థం లేదు. బలహీనమైన కథనంతో విశ్రాంతికి ముందువరకూ ఈ సినిమా 'తూతూ మంత్రం .. తుమ్మకాయ మంత్రం' మాదిరిగా విషయంలేని సన్నివేశాలతో కాలక్షేపం చేయిస్తుంది. అప్పటివరకూ కంటెంట్ లో ఏ మాత్రం పసలేని ఈ కథను విజయ్ సేతుపతి ఎలా ఒప్పుకున్నాడనే ఆశ్చర్యం కలగక మానదు.

విజయ్ సేతుపతి మంచి నటుడు అని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు కొన్ని విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న సందర్భాలు వున్నాయి. అలాంటి విజయ్ సేతుపతి .. కథలో 'దమ్ము'లేని కారణంగా, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే మెప్పించగలిగాడు. కథలో పట్టులేని కారణంగానే రాశి ఖన్నా పాత్ర కూడా తేలిపోయింది. గ్లామర్ పరంగా చూసుకుంటే, ఆమెకి ఎప్పుడూ పడే మార్కులే పడతాయి. ప్రతినాయకులుగా రవికిషన్ .. అశుతోష్ రాణా తమదైన శైలిలో నటించారు. దేవరాజ్ పాత్రలో నాజర్ చాలా సహజంగా చేశారు. కమెడియన్ సూరి తదితరులు పాత్ర పరిథిలో నటించారు.

వివేక్ - మెర్విన్ సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. పాటల్లోని సాహిత్యం .. సాధారణమైన పదాలను పాట రూపంలో పేర్చినట్టుగా అనిపిస్తుంది. 'అనువాద చిత్రంలోని పాటలు కదా' అన్నట్టుగానే సాగుతాయి. రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ కూడా ఓ మాదిరిగానే అనిపిస్తాయి. ప్రవీణ్ ఎడిటింగ్ కి కూడా చాలా తక్కువ మార్కులు పడతాయి. హీరోకి కమెడియన్ రాజేంద్రన్ జాతకం చెప్పడం .. హీరో చెల్లెలి పెళ్లిచూపుల తతంగం వంటి అనవసరమైన సీన్స్, హీరోయిన్ ఫ్రెండ్ అబార్షన్ సీన్ .. హీరోయిన్ తాగేసి హీరోకి కాల్ చేసే సీన్ వంటి ట్రిమ్ చేయాల్సిన సీన్స్ చాలానే కనిపిస్తాయి. అనల్ అరసు యాక్షన్ సీన్స్ మాత్రం ఫరవాలేదు.

ఆసక్తికరంగా లేని కథాకథనాలు  .. వైవిధ్యభరితంగా మలచని పాత్రలు .. ఇది అనువాద చిత్రమే అనే విషయాన్ని తరచూ గుర్తుచేసే పాటలతో సాగే ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పొచ్చు.  

More Reviews