నటుడిగా అజయ్ ఘోష్ కి మంచి పేరు ఉంది. సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రస్థానం, ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యేవరకూ సాగింది. ఆయన ప్రధానమైన పాత్రగా రూపొందిన సినిమానే 'మ్యూజిక్ షాప్ మూర్తి'. మొదటిసారిగా ఆయన టైటిల్ రోల్ చేసిన సినిమా ఇది. జూన్ 14వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

మూర్తి (అజయ్ ఘోష్) వయసు 52 ఏళ్లు .. భార్య జయశ్రీ (ఆమని) .. ఇద్దరు ఆడపిల్లలు .. ఇదీ అతని జీవితం. గుంటూరు సమీపంలోని 'వినుకొండ'లో అతను కేసెట్ షాపు నడుపుతుంటాడు. ఒకప్పటిలా ఇప్పుడు పాటల కేసెట్లు కొనే అవసరం లేకుండా పోవడం వలన, అతని షాపు నడవక చాలా కాలమే అవుతుంది. దాంతో ఇల్లు గడవడం కష్టమవుతుంది. కేసెట్లు తీసేసి .. సెల్ ఫోన్స్ షాపుగా మార్చమని జయశ్రీ గోల చేస్తూ ఉంటుంది. కానీ అందుకు అతని మనసు అంగీకరించదు. 

కేసెట్ల షాపులో కొన్నేళ్లుగా ఉండటం వలన .. పాటలు వింటూ ఉండటం వలన, అతనికి మ్యూజిక్ పై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఆ నాలెడ్జ్ తోనే ఒక ఫంక్షన్ లో 'డీజే'గా వ్యవహరిస్తాడు. సిటీకి వెళితే డీజేగా లక్షల్లో సంపాదించవచ్చని అక్కడివాళ్లు ఆయనతో చెబుతారు. దాంతో డీజే నేర్చుకోవాలని ఆయన అనుకుంటాడు. హైదరాబాద్ వెళ్లి డీజే కావాలని కలలు కంటాడు. అదే సమయంలో ఆయనకి అంజన ( చాందినీ చౌదరి) పరిచయమవుతుంది. ఆమె కూడా డీజే కావాలనే పట్టుదలతో సాధనచేస్తూ ఉంటుంది. 

మూర్తి ఆసక్తిని .. మ్యూజిక్ పట్ల అతనికి గల ఇష్టాన్ని అర్థం చేసుకున్న అంజన, ఆయనకి డీజే నేర్పడం మొదలుపెడుతుంది. ఆ క్రమంలో ఇద్దరూ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండటంతో, ఇటు మూర్తి ఇంట్లోను .. అటు అంజన ఇంట్లోను అపార్థం చేసుకుంటారు. దాంతో అంజన కనిపించకుండా పోతుంది. ఆమెను మూర్తి కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి రంగారావు (భానుచందర్) కేసు పెడతాడు. ఆ సంఘటన మూర్తి ఇంట్లో గొడవకు దారితీస్తుంది. 

మూర్తి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేలోగా ఆ షాప్ అమ్మేసిన జయశ్రీ, అతనికి ఆ డబ్బు ఇచ్చి హైదరాబాద్ వెళ్లమంటూ బ్యాగ్ బయట పడేస్తుంది. ఆ డబ్బు తీసుకోకుండానే మూర్తి హైదరాబాద్ కి చేరుకుంటాడు. మొదటిసారిగా హైదరాబాద్ రావడం .. అక్కడ తెలిసినవారు ఎవరూ లేరు. ఎవరిని కలవాలో  తెలియదు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆ తరువాత ఆయన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.

జీవితంలో కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వాళ్లు తాము ఇష్టపడిన పనిని మాత్రమే చేయగలరు .. మరో పనిని చేయడానికి వాళ్ల మనసు అంగీకరించదు. డబ్బు కంటే వాళ్లు అనుభూతికి .. జ్ఞాపకాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఆదాయం కోసం అనుభూతిని చంపుకోవడానికి వాళ్లు ఎంతమాత్రం ఒప్పుకోరు. అలాంటి వ్యక్తిగా మనకి ఈ సినిమాలో మూర్తి కనిపిస్తాడు. 

50 ఏళ్లు రాగానే చాలామంది నిరాశలోకి వెళ్లిపోతుంటారు. కొత్తగా నేర్చుకోవడానికి ఏముంది? నేర్చుకుని చేసేదేముంది? అనే ఒక నిరాశావాదంలోకి జారిపోతారు. కానీ వయసనేది ఒక నెంబర్ మాత్రమే .. అనుకున్నది సాధించడానికి అది ఎంతమాత్రం అడ్డుకాదు. ఇదే ఆలోచన కలిగిన వ్యక్తిగా మనకి మూర్తి కనిపిస్తాడు. తన కుటుంబం నుంచి వ్యతిరేకత ఎదురైనా అతను తాను అనుకున్న దిశగానే ముందుకు సాగుతాడు. 

ఇలా సందేశాత్మకంగా ఈ కథ నడుస్తుంది. ఈ  కథలో హీరో - హీరోయిన్స్ ఉండరు. అందువలన లవ్ .. రొమాంటిక్ సాంగ్స్ అనేవి కనిపించవు. కథనే హీరో .. అదే అన్ని పాత్రలను టచ్ చేస్తూ వెళుతుంటుంది. వినోదపరమైన పాళ్లు పెద్దగా లేని సినిమా ఇది. సందేశమే ప్రధానంగా వినిపించే సినిమా ఇది. అందువలన అందుకు సిద్ధమై చూస్తే, కథలోని ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. అజయ్ ఘోష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ లుక్ పరంగా ఆయన మీసాల విషయంలో కొంచెం కేర్ తీసుకోవలసింది.

 సహజత్వానికి దగ్గరగా ఈ కథను నడిపించడంలో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. పవన్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. శ్రీనివాస్ ఫొటోగ్రఫీ ఓకే. కాలంతో పాటు మారాలి. ఇష్టమైన పనినే ప్రొఫెషన్ గా ఎంచుకోవాలి. వయసైపోయిందనే ఉద్దేశంతో ఆగిపోకుండా అనుకున్నది సాధించాలనే ఒక స్ఫూర్తిని కలిగించే ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.