'యాక్షన్' మూవీ రివ్యూ

16-11-2019 Sat 08:24
Movie Name: Action
Release Date: 2019-11-15
Cast: Vishal, Tamannah, Aishwarya Lakshmi, Akanksha Puri, Ramki, Kabir Duhan Singh, Yogi Babu
Director: Sundar C.
Producer: Srinivas Adepu
Music: Hiphop Tamizha
Banner: Sri Karthikeya Cinemas

ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఆర్మీ ఆఫీసర్ సుభాశ్, ఒకానొక సంఘటనలో తాను ప్రేమించే అమ్మాయినీ .. తనని ప్రేమించే అన్నయ్యను పోగొట్టుకుంటాడు. తమ కుటుంబ సభ్యుల కారణంగానే కాబోయే ప్రధాని కూడా చనిపోయాడనే నిందను భరించలేకపోతాడు. ఆ సంఘటన వెనక ఎవరున్నారో తెలుసుకుని చట్టానికి అప్పగించి, తన కుటుంబ పరువు ప్రతిష్ఠలను నిలబెట్టడం కోసం సుభాశ్ చేసే ప్రయత్నమే ఈ కథ. 

తెలుగు .. తమిళ భాషల్లో మాస్ యాక్షన్ హీరోగా విశాల్ కి మంచి క్రేజ్ వుంది. అందువల్లనే తమిళంతో పాటు సమానంగా తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతుంటాయి. యాక్షన్ సినిమాలతో ఎక్కువ ఆదరణ పొందిన విశాల్ ఈ సారి 'యాక్షన్' నే టైటిల్ గా చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఒక వైపున విశాల్ మాస్ యాక్షన్ ను .. మరో వైపున తమన్నా గ్లామర్ ను కలుపుకుని వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించిందో, ఈ జంటతో దర్శకుడు సుందర్ .సి చేసిన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఇప్పుడు చూద్దాం.

కథగా చూస్తే .. సుభాశ్ (విశాల్) ఇండియన్ ఆర్మీలో కల్నల్ గా పనిచేస్తుంటాడు. ఆయన తోటి ఆఫీసర్ గా దియా (తమన్నా) పనిచేస్తుంటుంది. ఆమె సుభాశ్ ను ఆరాధిస్తూ ఉంటుందిగానీ, అతని మనసు మాత్రం తనకి వరసకి మరదలైన మీరా (ఐశ్వర్య లక్ష్మి) పై ఉంటుంది. వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారు కూడా. సుభాశ్ తండ్రి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ కుర్చీని తన పెద్ద కొడుకైన శ్రవణ్ (రాంకీ)కి అప్పగించి తను విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. ఓ వేదిక ద్వారా ఆ విషయాన్ని వెల్లడించడానికి సన్నాహాలు చేస్తాడు. కాబోయే ప్రధాని కూడా  ఆ కార్యక్రమానికి  హాజరవుతాడు.

ఆ వేదికపై జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లో కాబోయే ప్రధానితో పాటు 'మీరా' కూడా చనిపోతుంది. శ్రవణ్ చేసిన ఒక పొరపాటు కారణంగా, బాంబు బ్లాస్టింగ్ కుట్రలో అతను భాగస్వామి అనే ప్రచారం ఊపందుకుంటుంది. ఆ అవమానాన్ని భరించలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు. జరిగిన సంఘటనకి అసలు కారకులెవరో తెలుసుకుని, తన కుటుంబంపై పడిన నిందను తుడిచేయడం కోసం సుభాశ్ రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి? ఎటువంటి నిజాలు తెలుస్తాయి? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకెళుతుంది.

ఇది దర్శకుడు సుందర్ .సి నుంచి వచ్చిన భారీ యాక్షన్ చిత్రం. యాక్షన్ సన్నివేశాలను ఒక రేంజ్ లో డిజైన్ చేసుకుని ఆయన రంగంలోకి దిగాడనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇస్తాంబుల్ .. పాకిస్థాన్ .. లండన్ .. వీధుల్లో ఆయన ఈ కథను పరుగులు తీయించాడు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో .. ఛేజింగ్ లతో ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశాడు. ఈ లొకేషన్స్ లో ఆయన వందలమంది జూనియర్ ఆర్టిస్టులను ఉపయోగించాడు. ఎక్కడా భారీతనం తగ్గకుండా తనవంతు ప్రయత్నం చేశాడు.

అయితే దర్శకుడు అసలు కథపై పెద్దగా శ్రద్ధ పెట్టకుండా, హడావిడి ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. ఖర్చుపైనే తప్ప కథపై దృష్టి పెట్టలేదు. అందువల్లనే సాధారణ ప్రేక్షకుడికి కథలో స్పష్టత కనిపించదు. ఎవరు ఎందుకు చేశారు? వాళ్ల ఉద్దేశం ఏమిటి? అనే విషయం అర్థం కాదు. 'హీరో ఏదో చేస్తున్నాడుగా చేయనీ .. చూద్దాం' అని ఆడియన్స్ ఆ పాత్రను ఫాలో కావడంతోనే చాలా సమయం గడిచిపోతుంది. చివరాఖరికి కూడా సగటు ప్రేక్షకుడికి ఆ డౌట్ అలాగే ఉండిపోవడమే  విచారకరం. ఇస్తాంబుల్ బ్యాంక్ లోని సీక్రెట్ రూమ్ కి వెళ్లి 4 వేల కోట్లను ట్రాన్స్ ఫర్ చేయించే సీన్ ను .. అంతర్జాతీయ క్రిమినల్ 'కైరా'ను బహుళ అంతస్తుల భవనాలపై వెంటాడే సీన్ ను .. మాఫియా సామ్రాజ్యంలో నుంచి విశాల్ - తమన్నా బయటపడే సీన్ ను .. విలన్ ను కిడ్నాప్ చేసి ఇండియాకి తీసుకెళ్లే సీన్ ను మాత్రం సుందర్.సి  చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించాడు.

సుభాశ్ పాత్రలో విశాల్ నటన ఆకట్టుకుంటుంది. యాక్షన్ సీన్లు ఆయనకి కొట్టిన పిండి కాబట్టి ..ఆయన నుంచి ఫ్యాన్స్ ఆశించేవి అవే కనుక ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు. సిన్సియర్ ఆఫీసర్ గాను.. గ్లాపర్ పరంగాను తమన్నా మెప్పించింది. ఆమె బాగా ఒళ్లు చేసినట్టు కనిపిస్తోంది. ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ సింగ్ తనదైన స్టైల్లో నటించాడు. అంతర్జాతీయ క్రిమినల్ గాను.. గ్లామర్ పరంగాను ఆకాంక్షపురి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక యోగిబాబుతోపాటు మిగతా వాళ్లంతా తమ పాత్రలకి న్యాయం చేశారు.

కథాకథనాలు వీక్ గా ఉన్నప్పటికీ ఈ సినిమాను రీ రికార్డింగ్ .. ఫొటోగ్రఫీ కలిసి నిలబెట్టేశాయి. హిపాప్ తమిజా రీ రికార్డింగ్ .. డుడ్లీ ఫొటోగ్రఫీ ప్రధానమైన బలంగా నిలిచాయి. టెన్షన్ బిల్డప్ చేయడంలో రీ రికార్డింగ్ మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇస్తాంబుల్ .. పాకిస్థాన్ .. లండన్ లొకేషన్స్ లోని ఛేజింగ్ సీన్స్ ను 'డుడ్లీ' తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు. పాటల్లోను విదేశాల్లోని లొకేషన్లను చాలా అందంగా చూపించాడు. రిస్కీ యాక్షన్ సీన్స్ ను సైతం ఆయన గొప్పగా తెరకెక్కించాడు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, ఎన్.బి. శ్రీకాంత్ కొన్ని సాగతీత సీన్లను వదిలేశాడనే చెప్పాలి. విశాల్ ఫ్యామిలీ నేపథ్యంలో వచ్చే ఏ సీన్ పండలేదు. అర్థంలేని కామెడీతో విసుగు తెప్పిస్తాయి కూడా.

భారీతనం వుంది.. బలమైన కథే లేదు. కథ.. దేశ దేశాలు దాటి వెళ్లిపోతూ ఉంటుంది.. ఎందుకనే విషయంలో సగటు ప్రేక్షకుడికి క్లారిటీ రాదు. అసాధ్యమైన చాలా విషయాలను హీరో సుసాధ్యం చేయడం వరకూ బాగానే వుందిగానీ, 'పద్మవ్యూహం' వంటి ఆ ప్రదేశాల్లోకి ఎంటర్ కావడానికి ఆయన ఎంచుకున్న మార్గాలు సిల్లీగా అనిపిస్తాయి. ఇక చివర్లోను తమని ఎవరూ గుర్తుపట్టకుండా విశాల్ వేసుకున్న మారువేషం.. విలన్ కి వేసిన మారువేషం చాలా అతిగా అనిపిస్తాయి. సాయాజీ షిండేకి ఆయన డైలాగ్ డెలివరీనే ప్రత్యేక ఆకర్షణ.. ఆయన పాత్రకి అతకని వాయిస్ తో వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సినిమాకి 'యాక్షన్' అనే టైటిల్ పెట్టేసి ఓన్లీ యాక్షన్ సీన్స్ పై మాత్రమే శ్రద్ధ పెట్టారు గనుక, కథను పట్టించుకోవడం మానేసి కామ్ గా కూర్చుని ఆ యాక్షన్ ఎపిసోడ్స్ వరకూ చూస్తే మాత్రం, ఈ సినిమా ఫరవాలేదనే అనిపిస్తుంది.  


More Articles