'ఏడు చేపల కథ' మూవీ రివ్యూ

ఒక వైపున ఆత్మల ఆవాహన .. మరో వైపున అరుదైన వ్యాధితో బాధపడే హీరో బృందం .. ఇంకో వైపున తనకి తెలియకుండానే తాను ఎలా గర్భవతినయ్యాననే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించే హీరోయిన్. ఇలాంటి ముఖ్యమైన అంశాలను ముడివేసుకుంటూ వెళ్లిన కథే .. 'ఏడు చేపల కథ'. అడల్ట్ కంటెంట్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఓ మాదిరిగా అనిపించడం కష్టమేనేమో.
శృంగారభరితమైన సన్నివేశాలతో కూడిన కథను అల్లుకోవడం .. ఆ శృంగారాన్ని సమర్ధించే కారణమేదో చూపించేస్తూ ముగింపును ఇచ్చేయడం చాలా చిత్రాలలో జరుగుతూనే వచ్చింది. తనకి గల ఒక వ్యాధి నుంచి బయటపడటం కోసం హీరో ఇతరులతో శృంగారానికి సిద్ధపడినట్టుగా దర్శకుడు శ్యామ్ జె. చైతన్య చూపించాడు. ఆయనకే అది అంత సమర్థనీయంగా అనిపించలేదేమో, ఆత్మల ఆవాహన అంశాన్ని కూడా జోడించాడు. అలా ఆయన చేసిన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందో ఇప్పుడు చూద్దాం.
రవి(అభిషేక్ రెడ్డి) థలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. నెలరోజులకొకసారి కొత్త రక్తం ఎక్కించుకోకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం. అదే వ్యాధితో బాధపడుతున్న రాధ (భానుశ్రీ) మరో ఇద్దరు కలిసి ఒకే రూములో ఉంటూ వుంటారు. తమ గ్రూప్ రక్తం డోనర్లను తామే వెతుక్కుంటూ జీవితాన్ని సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే రవి తనకి బ్లడ్ డొనేట్ చేసిన భావన (ఆయేషా సింగ్) ప్రేమలో పడతాడు. రవిని ఒక పేషంట్ గానే చూసిన భావనకి, తాను గర్భవతిననే విషయం తెలిసి ఆశ్చర్యపోతుంది. తనకి తెలియకుండా తను గర్భవతిని కావడాన్ని జీర్ణించుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ సమయంలోనే సుందరం (నగరం సునీల్) ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. సుందరం ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? రవి - భావనల జీవితంతో అతను ఎలా ఆడుకుంటాడు? అనే మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
'A సర్టిఫికెట్ తో కూడిన 'ఏడు చేపల కథ' అనే టైటిల్ ను పోస్టర్ పై చూడగానే, హీరో గారు ఏడుగురు అమ్మాయిలను ఎరవేసి పట్టే కథ అనుకుంటారు. కానీ ఈ కథ నడిచిన దిశ వేరు .. పాత్రలను నడిపించిన తీరు వేరు. హీరో రొమాంటిక్ గా అమ్మాయిల వెంటపడుతూ .. అల్లరి చేస్తూ ప్రేక్షకుల ముచ్చట తీరిస్తే బాగానే వుండేది. కానీ హీరో థలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆయన ఆరాధించే భావన ఆత్మలను ఆవాహన చేసే సుందర్ మాయలో పడుతుంది. ఇలా ఈ రెండు పాత్రలను లాక్ చేసేయడంతో, వాళ్ల కోసం పాటలను వండలేదు .. వాళ్ల నుంచి ప్రేక్షకులకు కావలసిన మసాలాలేవీ అందలేదు.
దర్శకుడు కథను ఫ్లాష్ బ్యాక్ నుంచి మొదలుపెట్టడం .. హీరో హీరోయిన్ల పాత్రలను పాట ద్వారా పరిచయం చేయడం అంతగా ఆకట్టుకోలేదు. ప్రమాదకరమైన వ్యాధితో బాధపడే వ్యక్తి, అందమైన అమ్మాయిలను చూడగానే టెంప్ట్ కావడమనేది అంతగా జీర్ణించుకోలేని విషయంగానే కనిపిస్తుంది. ఇక 'అమృత' అనే పాత్ర హఠాత్తుగా ఎంట్రీ ఇవ్వడం కూడా అయోమయానికి గురిచేస్తుంది. తేడా మనస్తత్వం కలిగిన వ్యక్తిగా సుందర్ పాత్రను దర్శకుడు ఒక క్లారిటీతో తీర్చిదిద్దలేకపోయాడు. అనవసరమైన సన్నివేశాలను అతికించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఈ సినిమాకి మైనస్ మార్కులను తెచ్చిపెడతాయి.
రవి పాత్రలో అభిషేక్ రెడ్డి సహజంగా నటించడానికి ప్రయత్నించాడు. 'ఇతను హీరో ఏంటి' అనే కామెంట్లు వస్తాయనుకున్నారేమో, 'నీ పర్సనాల్టీకి .. నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం వుందారా' అని ఆయనతోనే మనసులో మాటగా అనిపించారు. రాధ పాత్రలో భానుశ్రీ చాలా యాక్టివ్ గా చేసింది. ఎలాంటి ఎక్స్ పోజింగ్ లేకుండానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయేషా సింగ్ అందంగా కనిపించడమే కాకుండా, నటన పరంగా కూడా ఫరవాలేదనిపించింది. సుందర్ పాత్రధారి కూడా పాత్రకి న్యాయం చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. ఇక మిగతా పాత్రలన్నీ గాలి బుడగల్లాగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటాయి.
నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ఇంకా కత్తెరకి పని చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. తక్కువ నిడివిలోనే అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా ఉండటం నిరాశపరిచే విషయం. భావన .. తండ్రి తాలూకు సీన్స్ .. బ్లడ్ డొనేట్ చేయమని భానుశ్రీ ఒక శ్రీమంతుడి ఇంటికి వెళ్లడం .. రవి - అమృత చిన్ననాటి సన్నివేశాలు అనవసరమనిపిస్తాయి. భయం .. బాధ .. శృంగారం ఈ మూడింటికి పొంతన కుదరదు. అలాంటి ఈ మూడు అంశాలను కలిపి ముడి వేయడానికి దర్శకుడు ప్రయత్నించడమే, ఈ సినిమా నిరాశపరచడానికి కారణంగా కనిపిస్తుంది.
























