మొదటి నుంచి సందీప్ కిషన్ ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. కొంతకాలం క్రితం తమిళంలో ఆయన చేసిన 'మాయావన్' అక్కడ బాగానే ఆడింది. సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించగా, ఒక కీలకమైన పాత్రలో జాకీ ష్రాఫ్ కనిపిస్తాడు. అలాంటి ఈ సినిమా చాలా గ్యాప్ తరువాత 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. కుమార్ (సందీప్ కిషన్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని బాల్యంలో ఒక సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి అతను నెత్తురు చూస్తే భయపడిపోతాడు. అయినా అలాగే పోలీస్ వృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు. అతను ఒక దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఒక మర్డర్ జరగడం చూస్తాడు. హంతకుడిని వెంబడిస్తాడు. అయితే కుమార్ నుంచి తప్పించుకునే ఆ ప్రయత్నంలో ఆ హంతకుడు చనిపోతాడు.
ఫలితంగా కుమార్ మానసికంగా ఫిట్ గా లేడని చెప్పి, పై అధికారులు కొంతకాలం పాటు అతణ్ణి డ్యూటీకి దూరంగా ఉంచుతారు. దాంతో అతను మానసిక వైద్యురాలైన అనిత ( లావణ్య త్రిపాఠి) దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. కొన్ని రోజుల తరువాత డ్యూటీలో చేరిన కుమార్ కి ఒక కేసు సవాల్ గా మారుతుంది. హంతకుడు వరుస హత్యలు చేస్తూ వెళుతుంటాడు. హత్య చేసిన ప్రదేశంలో హంతకుడు రక్తం అంటిన తన చేతులను అక్కడి గోడకి రాస్తుంటాడు. ఆ రక్తం చూడగానే కుమార్ అదోలా అయిపోతుంటాడు.
చనిపోయిన వాళ్లంతా కొన్ని రోజుల ముందు వింతగా ప్రవర్తించారనే విషయం కుమార్ పరిశోధనలో తేలుతుంది. ఇంగ్లిష్ రానివారు సైతం ఇంగ్లిష్ పేపర్ చదివారని తెలిసి షాక్ అవుతాడు. అలాగే ఎప్పుడూ లేనిది నీట్ గా ఉండటానికి ట్రై చేసేవారనీ, ఖరీదైన బ్రాండ్స్ వాడేవారని తెలిసి నివ్వెరపోతాడు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే అతను ముందుకు వెళతాడు. ఆ క్రమంలో అతను 'రుద్ర'ను కలుస్తాడు. గతంలో చనిపోయినవారి లక్షణాలు అతనిలో గమనించి అలర్ట్ అవుతాడు.
అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే 'రుద్ర' ను అరెస్టు చేస్తాడు. జైల్లోనే మానసిక నిపుణులను ఏర్పాటు చేయిస్తాడు. రుద్రను సైన్ చేయమంటే .. అతను తన పేరు కాకుండా 'ప్రమోద్' అనే సంతకం పెడతాడు. దాంతో ప్రమోద్ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు మొదలవుతుంది. అతను ఓ పెద్ద సైంటిస్ట్ అనే విషయం కుమార్ కి తెలుస్తుంది. అతని సహచరుడైన శ్రీరామ్ (జేపీ) ద్వారా ప్రమోద్ గురించి తెలుసుకుంటాడు.
ప్రమోద్ సైన్స్ లో జీనియస్ .. అతను ఎన్నో ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించగలిగిన మేథావి. అతను చేసిన ఓ ప్రయోగం పేరే 'ప్రాజెక్ట్ z'. అది సాధారణ వ్యక్తులకు అర్థంకానిది .. అంతుబట్టనిది. అతను తన జ్ఞాపకాలను ఒక ల్యాబ్ లో భద్రపరుస్తాడు. తాను అనుకున్న వ్యక్తిలోని జ్ఞాపకాలను చెరిపివేసి .. ఆ స్థానంలో తన జ్ఞాపకాలను పోస్ట్ చేయగలడు. ఇక అప్పటి నుంచి ఆ వ్యక్తి ప్రమోద్ లా వ్యవహరించడం మొదలుపెడతాడు. శరీరం వేరైనప్పటికీ .. లోపల ప్రమోద్ ఉంటాడు.
ప్రమోద్ కి తాను ధరించిన శరీరం రాలిపోతుందని అనిపించినప్పుడు, వెంటనే మరో శరీరంలోకి వెళ్లిపోగలడు. అలాంటి ఒక ముందస్తు జాగ్రత్త చేసుకుంటూనే ఉంటాడు. కుమార్ కి విషయం అర్ధమయ్యే సమయానికి ప్రమోద్ .. ఆర్మీ జనరల్ సత్య (జాకీ ష్రాఫ్) బాడీలో ఉంటాడు. ఆ హోదాలో ప్రమోద్ ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు. అప్పుడు కుమార్ ఏం చేస్తాడు? ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడు? అనేది మిగతా కథ.
ఈ కథ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. తన జ్ఞాపకాలను ఇతరుల మైండులో సెట్ చేస్తూ, వాళ్ల శరీరంలో తాను జీవించి ఉండే ఒక సైంటిస్ట్ కథ ఇది. శరీరాలను ఒక డ్రెస్ ల మార్చేస్తూ ముందుకు వెళ్లే క్రిమినల్ మైండ్ ఉన్న ఒక శాడిస్ట్ కథ ఇది. దర్శకుడు ఈ కథను సాధ్యమైనంత స్పష్టంగా చెప్పడానికే ట్రై చేశాడు. అందువలన యూత్ కి ఈ కథ అర్థమవుతుంది. సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఒక పట్టాన అర్థం కాదు.
అటు సైంటిస్ట్ అరాచకాలు .. ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ తో ఈ సినిమా చకచకా పరుగులు తీస్తూనే ఉంటుంది. అయితే హీరో - హీరోయిన్స్ మధ్య రొమాన్స్ మాత్రం ఉండదు. పైగా రక్తం చూసి భయపడిపోయే హీరోను అక్కున చేర్చుకుని హీరోయిన్ ధైర్యం చెబుతూ ఉంటుంది. హీరో హీరోయిన్స్ వైపు నుంచి రొమాంటిక్ సాంగ్సు ను ఆశించే ప్రేక్షకుడు ఇక్కడే కాస్త డీలాపడతాడు. ఇక ఈ కథలో ఎక్కడా కూడా కామెడీ కాలు పెట్టడానికి ప్లేస్ లేదు. ప్రేక్షకులు సీరియస్ గా పోలీసులను ఫాలో కావలసిందే.
ఈ సినిమాలో పాత్రల పరంగా చాలా సీనియర్ ఆర్టిస్టులు కనిపిస్తారు. అందువలన నటన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ స్థానంలో హీరో అనేవాడు డైనమిక్ గా ఉండాలనే ప్రేక్షకుడు కోరుకుంటాడు. కానీ రక్తం చూసి పడిపోవడం .. దుప్పటి ముసుగేసుకుని దాక్కోవడం వంటివి అతిగా అనిపిస్తాయి. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ను నమ్ముకుని మనం ఎక్కడ ఫాలో అయ్యేది అనిపిస్తుంది.
పాత్ర పరంగా జబ్బున పడిన హీరోయిన్నుంచి రొమాంటిక్ సాంగ్స్ ను ఆడియన్స్ ఆశించరు .. ఇదీ అంతే. అదే ఒక పోలీస్ ఆఫీసర్ ఫిజికల్ గా తన ఇబ్బందిని దాటుకుని వెళ్లి లక్ష్యాన్ని ఛేదించడం వేరు. అప్పుడు ఆడియన్స్ సపోర్టు దక్కుతుంది. ఆ కోణంలో హీరో పాత్రను చూపిస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. గోపీ అమర్నాథ్ ఫొటోగ్రఫీ .. గిబ్రాన్ నేపథ్య సంగీతం .. లియో జాన్ పౌల్ ఎడిటింగ్ కథకి తగినట్టుగానే కొనసాగుతాయి.
'ప్రాజెక్ట్ Z' (ఆహా) మూవీ రివ్యూ!
Project Z Review
- సందీప్ కిషన్ హీరోగా రూపొందిన 'ప్రాజెక్టు Z'
- తమిళంలో 'మాయావన్' గా వచ్చిన సినిమా
- సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఒక వర్గానికి మాత్రమే అర్ధమయ్యే కంటెంట్
Movie Details
Movie Name: Project Z
Release Date: 2024-06-01
Cast: Sundeep Kishan, Lavanya Tripathi ,Jackie Shroff, Daniel Balaji, Mime Gopi, Amarendran
Director: C V Kumar
Music: Ghibran
Banner: Thirukumaran Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer