సుహాస్ .. కార్తీక్ రత్నం .. విరాజ్ అశ్విన్ ఈ ముగ్గురూ కూడా తమ బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అలాంటి ఈ ముగ్గురూ కలిసి చేసిన సినిమానే 'శ్రీరంగనీతులు'. ఏప్రిల్ 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు 'ఆహా' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం. 
 
శివ (సుహాస్) ఓ చిన్న సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. తల్లితో కలిసి ఒక బస్తీలో నివసిస్తూ ఉంటాడు. పెద్ద ఫ్లెక్సీలో తన ఫొటోను చూసుకోవాలనేది తన కోరిక. ఫ్లెక్సీ తో ఫేమస్ అవుతామనే ఆలోచన ఆయనది. అలా అతను ఎంతో ముచ్చటపడి పెట్టించిన ఫ్లెక్సీ కనిపించకుండా పోతుంది. దాంతో మరో ఫ్లెక్సీ కోసం అతను ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంటిమీద .. డ్యూటీ మీద కాకుండా అతని మనసంతా ఆ ఫ్లెక్సీ పైనే ఉంటుంది. 

ఇక కార్తీక్ (కార్తీక్ రత్నం) విషయానికి వస్తే, అతను గంజాయికి బానిస అవుతాడు. తల్లి .. తండ్రి .. తమ్ముడు .. వీరిలో ఎవరినీ అతను పట్టించుకోడు. ఏదో ఒక కేసుపై అతను పోలీస్ స్టేషన్ కి వెళ్లడం .. తండ్రి విడిపించుకురావడం .. ఇది అతని జీవితం. అతనితో గంజాయి మాన్పించడానికి తండ్రి నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అతనిని మనిషిగా మార్చడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు.   

ఇక ఐశ్వర్య (రుహాని శర్మ) .. వరుణ్ (విరాజ్ అశ్విన్) ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. తమ ప్రేమ విషయం తండ్రితో చెప్పడానికి భయపడుతూనే ఐశ్వర్య గర్భవతి అవుతుంది. సాధ్యమైనంత త్వరగా ఆ విషయం వాళ్లకి చెప్పి పెళ్లి చేసుకుందామని వరుణ్ చెబుతున్నా ఆమె వినిపించుకోదు. దాంతో అతను తీవ్రమైన అసహనానికి లోనవుతూ ఉంటాడు.  

ఇలా ఒక వైపున శివ .. మరో వైపున కార్తీక్ .. ఇంకో వైపున ఐశ్వర్య జీవితాలు గాడితప్పి ముందుకు సాగుతూ ఉంటాయి. శివ ఆలోచనా విధానం మారుతుందా? కార్తీక్ ను అతని తండ్రి దారిలో పెడతాడా? ఐశ్వర్య తన పరిస్థితిని తండ్రికి చెప్పి ఒప్పించగలుగుతుందా? ఆమె విషయంలో అసహనానికి లోనైన వరుణ్ ఏం చేస్తాడు? అనేది మిగతా కథ.

ఇది ముగ్గురు జీవితాలకి సంబంధించిన కథ .. ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. ఆ సమస్యలను టచ్ చేస్తూ సన్నివేశాలు సాగుతూ ఉంటాయి. సాధారణంగా ఈ తరహా కథల్లో ఏదో ఒక ట్రాక్ ఆడియన్స్ కి కనెక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఏ ట్రాక్ ను పట్టుకున్నా ఏ మాత్రం బలం లేకుండా పాలిపోయిన .. పలచబడిపోయిన సన్నివేశాలు మాత్రమే కనిపిస్తాయి. ఏ ట్రాక్ లోను విషయం కనిపించదు. 

ఫ్లెక్సీ సమస్య ఒక ప్రపంచ సమస్య అన్నట్టుగా దిగాలు పడిపోయి శివ తిరుగుతూ ఉంటాడు. డబ్బు .. చదువు .. తెలివి తేటలున్న ఐశ్వర్య, తన ప్రేమ గురించిగానీ .. నెల తప్పిన విషయం గాని .. ఇంట్లో చెప్పదు. అలాగని ఎలా చెప్పాలో తెలియని అమాయకురాలు కాదు. చెబితే తట్టుకోలేనంత సెన్సిటివ్ గా కూడా ఆ కుటుంబ సభ్యులు ఉండరు. పైగా తండ్రి మాట కాదనలేక, ఆయన చూపించిన సంబంధానికి కూడా కుర్చుంటుంది. 

ఇక కార్తీక్ విషయానికి వస్తే, అలా గంజాయి తాగుతూనే ఉంటాడు. 'తప్పు నాన్నా' అన్నట్టుగా తండ్రి అతని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. బలం లేని సమస్యను .. బలహీనతను వంటబట్టించుకున్న పాత్రలను ఫాలో కావడానికి మించిన అసహనం ప్రేక్షకులకు మరొకటి ఉండదు. విషయమే లేని కథను .. వినోదమే లేని కథను ప్రేక్షకులు ఎలా ఫాలో అవుతారు? కథను తనికెళ్ల భరణి పాత్రతో ఎందుకు మొదలుపెట్టారో .. మధ్య మధ్యలో ఆ పాత్రను తెరపైకి ఎందుకు తెచ్చారనేది కూడా అర్థం కాదు. అసలు ఈ సినిమాకి 'శ్రీరంగనీతులు' అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది ప్రేక్షకుడి ముందు నిలిచే పెద్ద ప్రశ్న. 

టిజో టామీ ఫోటోగ్రఫీ .. హర్షవర్ధన్ రామేశ్వర్ - అజయ్ అరాసాడ సంగీతం .. శశాంక్ ఉప్పుటూరి ఎడిటింగ్ కంటెంట్ కి తగినట్టుగానే అనిపిస్తాయి. సుహాస్ ట్రాక్ లో విషయం లేకపోవడం విచిత్రం. ఆయన ఎందుకంతలా బాధపడుతున్నాడు? కొంపదీసి ముందు కథ మనమేమైనా మిస్సయ్యామా? అనే అనుమానం మనకి తప్పకుండా కలుగుతుంది. సుహాస్ ఇకపై పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తగా లేకపోతే కష్టమే.

కథలో బలం ఉంటేనే .. కథనం ఆసక్తికరంగా ముందుకు వెళుతుంది. కథాకథనాల్లో విషయం ఉన్నప్పుడే సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా వెళతాయి. అప్పుడే సంభాషణలు కూడా కనెక్ట్ అవుతాయి. అలాంటప్పుడే ఇతర విభాగాలు చేసే కృషి ఆ కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. లేదంటే ఎవరెన్ని జాకీలు పెట్టినా కంటెంట్ లేని కథను లేపడం వృథా ప్రయాస మాత్రమే అవుతుంది.