జయం రవి - కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'సైరెన్ 108' ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, ఇప్పుడు హాట్ స్టార్ లో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించగా, ఖైదీగా జయం రవి కనిపిస్తాడు. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
తిలక్ వర్మ (జయం రవి) భార్య ( అనుపమా పరమేశ్వరన్) ను హత్య చేసిన నేరంపై జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటాడు. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం వలన, 14 రోజుల 'పెరోల్' పై తను జైలు నుంచి బయటికి వస్తాడు. తన తండ్రి ఓ హంతకుడు అనే విషయం నచ్చని తిలక్ వర్మ కూతురు మాల, అతని కంట పడటానికి అయిష్టతను వ్యక్తం చేస్తుంది. తిలక్ వర్మకి షాడో పోలీస్ గా శ్రీశైలం (యోగిబాబు) ఉంటాడు. ఇక ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ.గానందిని (కీర్తి సురేశ్) పని చేస్తూ ఉంటుంది.
ఒక కేసు విషయంలో సస్పెన్షన్ లో ఉన్న నందిని, తిరిగి డ్యూటీలో చేరుతుంది. అయితే ఆమె సస్పెన్షన్ కి కారణం మంత్రి మాణిక్యం .. అతని ప్రధాన అనుచరుడు దామోదర్ (అజయ్) అనే విషయం చాలా మందికి తెలుసు. ఆ ఇద్దరిపై నందిని కోపంగా ఉందని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల వ్యవధిలోనే మాణిక్యం .. అతని అనుచరుడైన దాము దారుణంగా చంపబడతారు. ఆ కేసుపై నందిని విచారణ జరుపుతూ ఉంటుంది.
అయితే మాణిక్యం మర్డర్ జరిగిన ప్రదేశంలో నందిని వాచ్ దొరుకుతుంది. దాంతో ఈ హత్యలో ఆమె హస్తం ఉండొచ్చని డీఎస్పీ నాగలింగం (సముద్రఖని) అనుమానిస్తూ ఉంటాడు. దాంతో ఈ హత్య ఎవరు చేశారో కనుక్కుని, ఈ నింద నుంచి సాధ్యమైనంత త్వరగా బయటాడాలనే ఆలోచనలో నందిని ఉంటుంది. ఎక్కడా ఎలాంటి క్లూ వదలకుండా ఆమె ఈ కేసును పరిశోధిస్తూ ముందుకు వెళుతూ ఉంటుంది.
అదే సమయంలో చిల్లర దొంగతనాలు చేసే విక్కీ కనిపించకుండా పోవడంతో అతని తల్లి నందినికి ఫిర్యాదు చేస్తుంది. విక్కీ కనిపించకుండా పోవడానికి ముందు తిలక్ వర్మతో గొడవపడ్డాడనే విషయం నందిని దృష్టికి వెళుతుంది. తిలక్ బయటికి వచ్చిన తరువాతనే రెండు హత్యలు .. ఒక కిడ్నాప్ జరగడంతో నందిని ఆలోచనలో పడుతుంది. హత్యలు జరిగే తీరు డిఫరెంట్ గా ఉండటంపై ఆమె ఫోకస్ పెడుతుంది. 1995లో డేవిడ్ - రిషి అనేవారు ఇదే పద్ధతిలో హత్యలు చేసేవారనే విషయం ఆమె ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది.
దాంతో ఆమె డేవిడ్ - రిషి గురించిన పూర్తి విషయాలు తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతుంది. డేవిడ్ .. రిషి ఇద్దరు ఖైదీలతో కలిసి కొంతకాలం పాటు తిలక్ వర్మ జైలు జీవితం గడిపినట్టు ఆమె విచారణలో తేలుతుంది. అయితే షాడో పోలీస్ నిరంతరం పక్కనే ఉండగా తిలక్ ఎలా హత్యలు చేస్తాడు? విక్కీ పై చేయి చేసుకున్నంత మాత్రాన అతనిని తిలక్ వర్మ కిడ్నావు చేసి ఉంటాడని అనుమానించడం ఎలా? అనేది నందినికి అర్థం కాదు.
అప్పుడు నందిని ఏం చేస్తుంది? మాణిక్యం హత్యకేసులో నిజంగానే నందిని ప్రమేయం ఉంటుందా? లేదంటే తిలక్ ఈ హత్యలు చేశాడా? ఈ ఇద్దరి జీవితాలలో మాణిక్యం పాత్ర ఏమిటి? తిలక్ వర్మ భార్య మరణానికి కారకులు ఎవరు? విక్కీ ఏమైపోయాడు? తన తండ్రి నేరస్థుడని భావించి అతనికి దూరంగా ఉంటున్న మాల, చివరికి తన అభిప్రాయం మార్చుకుంటుందా? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
ఈ కథకి రచయిత .. దర్శకుడు ఆంటోని భాగ్యరాజ్. ఈ కథ ఫస్టు పార్టు విషయానికి వస్తే, హత్య చేయబడిన ఇద్దరు వ్యక్తులు ఖైదీగా ఉన్న తిలక్ వర్మకు శత్రువులు. అదే ఇద్దరు పోలీస్ ఆఫీసర్ గా ఉన్న నందినికి శత్రువులు. అది ఎలా అనేది మాత్రం సస్పెన్స్. హత్య జరిగిన సమయంలో అదే ప్రదేశంలో ఇటు తిలక్ వర్మ, అటు నందిని ఉంటూ ఉంటారు. ఈ విషయమే ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
ఇక సెకండాఫ్ దగ్గరికి వస్తే, హీరో ఫ్లాష్ బ్యాక్ .. నందిని ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతాయి. హీరోను దోషిగా తేల్చే ప్రయత్నంలో నందిని .. తన కూతురు ముందు దోషిగా నిలబడకూడదనే ఆలోచనలో హీరో చేసే పోరాటంగా ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాకి ప్రధానమైన బలం స్క్రీన్ ప్లే. మొదటి నుంచి చివరి వరకూ అలా కూర్చోబెట్టేస్తుంది. ఒక యజమాని అనేవాడు ఇంటిపట్టునే ఉంటూ కూడా తన భార్యాబిడ్డలను కాపాడుకునే పరిస్థితి లేని ఈ రోజుల్లో, జైల్లో ఉన్న ఒక ఖైదీ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే అంశం ఆలోచన రేకెత్తిస్తుంది.
సాధారణంగా హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ అయినప్పటికీ, ఖైదీగా ఉన్న హీరోను లవ్ చేస్తుంది. కానీ ఈ సినిమాలో అలాంటిదేం ఉండదు. హీరో ఒక ఖైదీగానే వ్యవహరిస్తాడు .. హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ గానే ప్రవర్తిస్తుంది. ప్రధానమైన పాత్రలలో కనిపించే జయంరవి .. కీర్తి సురేశ్ .. యోగిబాబు నటన ఆకట్టుకుంటుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం కథకి ప్రధానమైన బలంగా నిలిచింది. సెల్వ కుమార్ కెమెరా పనితనం .. రూబెన్ ఎడిటింగ్ మంచి మార్కులు కొట్టేస్తాయి. యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ రివేంజ్ డ్రామా, ఈ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.
'సైరెన్ 108' (హాట్ స్టార్) మూవీ రివ్యూ
Siren 108 Review
- జయం రవి హీరోగా రూపొందిన 'సైరెన్'
- పోలీస్ ఆఫీసర్ గా కనిపించే కీర్తి సురేశ్
- ఇద్దరి నటన ఈ సినిమాకి హైలైట్
- ప్రధానమైన బలంగా నిలిచిన స్క్రీన్ ప్లే
- ఈ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చే సినిమా ఇది
Movie Details
Movie Name: Siren 108
Release Date: 2024-04-19
Cast: Jayam Ravi, Keerthi Suresh, Samudrakhani, Ajay, Yogibabu
Director: Antony Bhagyaraj
Music: Sam CS
Banner: Home Movie Makers
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer