'తంత్ర' - (ఆహా) మూవీ రివ్యూ!
Movie Name: Tantra
- మార్చి 15న థియేటర్లకు వచ్చిన సినిమా
- నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్
- అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా
- సాదాసీదాగా సాగిపోయే సన్నివేశాలు
- భయపెట్టడంలో విఫలమైన 'తంత్ర'
క్షుద్ర విద్యలు .. క్షుద్ర శక్తులు .. క్షుద్ర ప్రయోగాల నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత కాలంలో ఈ తరహా కంటెంట్ తెరపై పెద్దగా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు హారర్ థ్రిల్లర్ జోనర్లోకి ఈ తరహా సినిమాలు ఎక్కువగా వచ్చి చేరుతున్నాయి. అలా వచ్చిన సినిమానే 'తంత్ర'. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మార్చి 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. నెల తిరగక ముందే 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమైంది. ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
రేఖ (అనన్య నాగళ్ల) ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి .. తల్లి లేని పిల్ల. పుట్టగానే తల్లిని చంపేసిందని చెప్పి, తండ్రి ఆమెను అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇక నాయనమ్మ మాత్రమే ఆమె ఆలనా పాలన చూస్తూ ఉంటుంది. రేఖ మంచి అందగత్తె .. అందువలన తేజ (ధనుశ్ రఘుముద్రి) ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. అతను కూడా తన తల్లిని కోల్పోతాడు. ఆ ఊళ్లో లైటింగ్ సెట్ చేసే పనులు చేస్తూ జీవిస్తూ ఉంటాడు. రేఖతో కలిసి కాలేజ్ కి వెళ్లి వస్తుంటాడు.
రేఖకి అప్పుడప్పుడు ప్రేతాత్మలు కనిపిస్తూ ఉంటాయి. పౌర్ణమి వస్తుందంటే చాలు .. రేఖలో మార్పులు వస్తుంటాయి. అయితే రాత్రి ఏం జరిగిందనేది ఉదయానికి మరిచిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే రేఖ స్నేహితురాలు శైలజపై క్షుద్ర ప్రయోగం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన రేఖ, ఆ ప్రమాదం నుంచి శైలజను బయటపడేస్తుంది. అంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటూ ఉండగా, ఆ ఊళ్లోకి మాంత్రికుడు 'విగతి' అడుగుపెడతాడు.
అతను ఆ ఊళ్లో రాజేశ్వరి (సలోని) గురించి ఆరాతీయడం మొదలుపెడతాడు. రాజేశ్వరీ చనిపోయిందనీ, ఆమె కూతురు రేఖ కాలేజ్ లో చదువుకుంటోందని తెలుసుకుంటాడు. రేఖపై క్షుద్రశక్తిని ప్రయోగించడానికి రంగంలోకి దిగుతాడు. పథకం ప్రకారం అతను ఉంచిన మంత్రించిన నిమ్మకాయపై రేఖ అడుగుపెడుతుంది. అప్పటి నుంచి ఆమెకి అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. రేఖ విషయంలో చండీస్వామిని కలవమని తేజకి శంకరం చెబుతాడు.
చండీ స్వామిని కలిసిన తేజ రేఖ పరిస్థితి వివరిస్తాడు. రేఖ పరిస్థితి ప్రమాదంలో ఉంటే తన దగ్గరున్న కొబ్బరికాయ అపసవ్య దిశలో తిరుగుతుందనీ, అలా జరిగితే తాను చేయగలిగేదేం ఉండదని అయన అంటాడు. అతని పరీక్షలో ఆ కొబ్బరికాయ అపసవ్యంగానే తిరుగుతుంది. అప్పుడు తేజ ఏం చేస్తాడు? రేఖను కాపాడుకోవాలనే అతని కోరిక నెరవేరుతుందా? శంకరం ఎవరు? క్షుద్రశక్తుల గురించి అతనికి ఎలా తెలుసు? రేఖ తల్లి రాజేశ్వరికి .. మాంత్రికుడైన విగతికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
ఈ కథ రేఖ .. మాంత్రికుడు - తేజ - శంకరం అనే నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ నాలుగు పాత్రలను ప్రధానంగా చేసుకునే ఈ కథ నడుస్తుంది. క్షుద్రప్రయోగాలు .. వాటి ప్రభావం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. తన మనసుకి నచ్చిన అమ్మాయికి కోసం క్షుద్రప్రయోగాలను వదిలేసిన శంకరం ఒక వైపు .. తాను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడం కోసం క్షుద్ర మాంత్రికుల సాయాన్ని కోరే యువకుడిగా తేజ కనిపిస్తారు. ఈ ఇద్దరి పాత్రలలోను నిజాయితీ కనిపిస్తుంది. ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు కూడా బాగుంది.
ఇక తన క్షుద్ర ప్రయోగాలతో రాజేశ్వరి ప్రాణాలను తీసిన మాంత్రికుడికి, ఆమె కూతురు రేఖ వలన ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కూడా ఆసక్తిని రేపుతోంది. గ్రామీణ నేపథ్యంలోని ఈ కథను సహజత్వానికి దగ్గరగా నడిపించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే తన ప్రయత్నంలో అతను ఎంతవరకూ సక్సెస్ కాగలిగాడు అంటే, కొంతవరకు మాత్రమేనని చెప్పాలి. ప్రేక్షకులను భయపెట్టడంలో అతను మరింత కసరత్తు చేయవలసిన అవసరం కనిపిస్తుంది.
హారర్ థ్రిల్లర్ జోనర్ ద్వారా భయపెట్టడానికి కథ మాత్రమే ఉంటే సరిపోదు. ఆ కథను ఆసక్తికరంగా చెప్పడానికి అవసరమైన స్క్రీన్ ప్లే ఉండాలి. ఆ తరువాత ఆ భయాన్ని రెట్టింపు చేసే ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండాలి. అవసరమైతే గ్రాఫిక్స్ .. ఆ తరువాత సౌండ్ ఎఫెక్ట్స్ తో కూడా గట్టిగానే పని ఉంటుంది. దెయ్యాల సినిమాలను పట్టపగలు చూస్తే ఎలా కిక్ ఉండదో , సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని యాడ్ చేసుకోని హారర్ సినిమాల పరిస్థితి కూడా అంతే ఉంటుంది.
ఇక సాంకేతిక పరిజ్ఞానమనేది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు అవి భరించడం కష్టమే. అలాంటప్పుడు కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉండాలి. ప్రెజెంటేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అందుకు అవసరమైన కసరత్తు జరగాలి. కానీ ఆ విషయంలోనే అసంతృప్తి కలుగుతుంది. క్షుద్రశక్తుల రూపాలను .. అవి ఆవహించినవారి ధోరణినికి సంబంధించిన సన్నివేశాలలోను డిజైన్ చేయడంలో అనుభవరాహిత్యం కనిపిస్తుంది. తెరపై అలా దృశ్యాలు కదులుతూ వెళుతూ ఉంటాయి. ఆడియన్స్ లో మాత్రం ఎలాంటి టెన్షన్ ఉండదు.
ధృవన్ నేపథ్య సంగీతం .. సాయిరామ్ ఉదయ్ - విజయ్ భాస్కర్ అందించిన ఫొటోగ్రఫీ .. ఉద్ధవ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఈ కథలో మలుపులు ఉన్నాయి. హారర్ థ్రిల్లర్ జోనర్ కి తగిన అంశాలు ఉన్నాయి. కానీ వాటికి సాంకేతిక పరిజ్ఞానం తోడై ఉంటే బాగుండేది. అలా కాకుండా సాదాసీదాగా ప్రేక్షకుల ముందుంచడం ద్వారా, వాళ్ల నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుందనడానికి ఈ సినిమా కూడా ఒక నిదర్శనమే.