'అదృశ్యం' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Movie Name: Adrishyam
- అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రగా 'అదృశ్యం'
- క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథాకథనాలు
- ఆసక్తికరమైన మలుపులతో ఆకట్టుకునే కంటెంట్
- ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ
- తక్కువ పాత్రలతో మెప్పించిన సినిమా
మలయాళం ప్రేక్షకులు క్రైమ్ థ్రిల్లర్ కథలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అక్కడి మేకర్స్ చాలా సహజంగా ఆ కథలను తెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు. ఈ జోనర్ కి చెందిన మలయాళ సినిమాలను ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఎక్కువగా చూస్తుంటారు. అలా 2022 అక్టోబర్ 7వ తేదీన వచ్చిన సినిమానే 'ఇని ఉత్తరం'. అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, 'అదృశ్యం' పేరుతో ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
జానకి (అపర్ణ బాలమురళి) అశ్విన్ ( సిద్ధార్థ్ మీనన్) ప్రేమించుకుంటారు. జానకి డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. అశ్విన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ కూడా సాధ్యమైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. స్నేహితుడు వివేక్ వైపు నుంచి కూడా వాళ్ల ప్రేమకి మంచి మద్దతు లభిస్తుంది. జానకి - అశ్విన్ ఇద్దరూ కూడా సహజీవనం చేస్తుంటారు .. సరదాగా షికార్లు చేస్తుంటారు. ఓ రెండు రోజుల్లో ఒక పెళ్లికి వెళ్లాలని వాళ్లు నిర్ణయించుకుంటారు. కానీ ఆ పెళ్లికి వెళ్లలేకపోతారు.
ఓ రోజున జానకి 'సంతన్ పరా' పోలీస్ స్టేషన్ కి వస్తుంది. తాను తన స్నేహితుడైన వివేక్ ను వారంరోజుల క్రితం హత్యచేశానని సీఐ కరుణన్ (కళాభవన్ షాజోన్)కి చెబుతుంది. అక్కడి సమీపంలోని అటవీ ప్రాంతంలో వివేక్ శవాన్ని పాతిపెట్టానని అంటుంది. తనతో వస్తే శవాన్ని ఎక్కడ పూడ్చినది చూపిస్తానని చెబుతుంది. ఆమె మెంటల్ కండిషన్ సరిగ్గా లేకపోవడం వలన అలా మాట్లాడుతుందని అతను భావిస్తాడు. ఆమె అడ్రెస్ ఇచ్చి వెళ్లమనీ, తాము ఇన్వెస్టిగేట్ చేస్తామని కరుణన్ చెబుతాడు.
అయితే ఈ విషయం బయటికి వెళ్లడం .. మీడియా అక్కడికి వచ్చేయడం కూడా జరిగిపోతుంది. వాళ్లంతా ఏం జరిగిందని జానకిని నేరుగా అడుగుతారు. తాను తన స్నేహితుడైన వివేక్ ను హత్య చేశాననీ, అడవిలో పూడ్చిన చోటును చూపిస్తానని చెబుతూ ఉంటే, సీఐ కరుణన్ పట్టించుకోవడం లేదని జానకి చెబుతుంది. ఈ లోగా ఫామ్ హౌస్ నుంచి వారం రోజుల క్రితం వివేక్ అనే వ్యక్తి మిస్సయిన విషయంలో సీఐ కరుణన్ కి సమాచారం అందుతుంది. దాంతో తన టీమ్ తో అతను .. ఆ వెనుకే మీడియా వెళుతుంది.
అడవిలో ఒక ప్రదేశానికి వాళ్లను తీసుకుని వెళ్లిన జానకి, అక్కడే శవాన్ని పూడ్చానని చెబుతుంది. ఆ హత్యలో ఎవరైనా సహకరించారా అని మీడియా అడుగుతుంది. తానే సహకరించాననీ, హత్య చేసింది సీఐ కరుణన్ అని మీడియాతో చెబుతుంది. ఆ మాటకి అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. సీఐ కరుణన్ కూడా నివ్వెరపోతాడు. తాను నిజమే చెబుతున్నానని అక్కడి పబ్లిక్ తోను జానకి అంటుంది. విచారణ జరిపితే నిజాలు బయటికి వస్తాయని చెబుతుంది.
సీఐ కరుణన్ కేంద్రమంత్రి దినేశన్ (సిద్ధిక్)కి నమ్మినబంటు. దినేశన్ అండదండలు కోరుకునే ఆఫీసర్ ఎస్పీ ఇళవరసన్ (హరీశ్ ఉత్తమన్) కరుణను ఆ కేసులో చిక్కుకోకుండా కాపాడాలనుకుంటాడు. కానీ జానకి చెప్పినట్టుగానే ఆ ప్రదేశంలో శవం బయటపడుతుంది. ఊహించని విధంగా మరో శవం కూడా బయటపడటంతో అంతా బిత్తరపోతారు. ఆ రెండు శవాల్లో ఏదీ కూడా వివేక్ ది కాదని తేలడంతో పోలీస్ డిపార్టుమెంట్ కంగుతింటుంది.
జానకి పూడ్చినట్టుగా చెబుతున్న ఆ ప్రదేశంలో బయటపడిన రెండు శవాలు ఎవరివి? అక్కడ వివేక్ శవం లేకపోవడానికి కారణం ఏమిటి? జానకి లవర్ అశ్విన్ ఏమయ్యాడు? ఆమె చెబుతున్నట్టుగా ఆ హత్యలో కరుణన్ పాత్ర ఉందా? అతనిని ఆ కేసు నుంచి ఎస్పీ ఇళవరసన్ తప్పించగలుగుతాడా? వంటి సందేహాలను రేకెత్తిస్తూ ఈ కథ ముందుకు వెళుతుంది.
రంజిత్ ఉన్ని రాసిన కథ ఇది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి .. ముల్లును ముల్లుతోనే తీయాలి అనే నానుడిని దృష్టిలో పెట్టుకుని అల్లుకున్న కథ ఇది. చాలా తక్కువ పాత్రలతో సిద్ధం చేసుకున్న కంటెంట్ ఇది. దర్శకుడు సుధీశ్ రామచంద్రన్ ఈ కథను చాలా నీట్ గా తెరకెక్కించాడు. ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా కథ మలుపులు తిరుగుతూ వెళుతుంటుంది. సింపుల్ కాన్సెప్ట్ గానే కనిపించినా, చివరివరకూ ఇంట్రస్టింగ్ గా నడుస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగానే అనిపిస్తుంది.
ఈ కథలో ప్రధానమైన పాత్రలు మూడే. మిగతావన్నీ సపోర్టింగ్ రోల్స్. ప్రధానమైన పాత్రలను పోషించిన అపర్ణ బాలమురళి .. హరీశ్ ఉత్తమన్ .. కళాభవన్ షాజోన్ నటన ఆకట్టుకుంటుంది. ఫారెస్టు నేపథ్యంలోని లొకేషన్స్ ను కవర్ చేయడంలో రవిచంద్రన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. హేషమ్ అబ్దుల్ వాహెబ్ నేపథ్య సంగీతం, సన్నివేశాలతో పాటు ప్రేక్షకులను పరిగెత్తిస్తుంది. జితిన్ ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది.
కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు, రాజకీయనాయకులను కాపాడుతూ ఉంటారు. తమకి అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులు ఆపదలో ఉంటే రాజకీయనాయకులు రక్షిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక సాధారణ యువతి తనకి జరిగిన ఒక అన్యాయానికి తాను అనుకున్న ముగింపును ఎలా ఇవ్వగలిగింది? అనేదే ఈ కథ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లోని కథలను ఇష్టపడేవారు, ఈ సినిమాను చూడొచ్చు.