'ఏ వతన్ మేరే వతన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Movie Name: Ae Watan Mere Watan
అభినందించదగిన ప్రయత్నం
ఆవేశం - ఉద్వేగం లోపించిన పాత్రలు
జీవం లేని సన్నివేశాలు
" rows="2" cols="80" placeholder="Story Line">సారా అలీఖాన్ నుంచి 'ఏ వతన్ మేరే వతన్'
1942 నేపథ్యంలో నడిచే కథాకథనాలు
అభినందించదగిన ప్రయత్నం
ఆవేశం - ఉద్వేగం లోపించిన పాత్రలు
జీవం లేని సన్నివేశాలు
భారతదేశ స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో .. దేశభక్తి నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. పోరాటయోధులు ఎప్పుడూ గుర్తింపును కోరుకోరు. కానీ అలాంటి వారిని గుర్తుపెట్టుకోవలసిన అవసరం భావితరాలవారికి ఉంది. వారి నుంచి స్ఫూర్తిని పొందవలసిన అవసరం ఉంది. అలా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, గుర్తింపుకు దూరంగా ఉండిపోయిన 'ఉష మెహతా' అనే ఒక విప్లవనారి కథగా 'ఏ వతన్ మేరే వతన్' సినిమా రూపొందింది. సారా అలీఖాన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ కథ అంతా కూడా 1930లలో మొదలవుతుంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నేపథ్యంలో నడుస్తుంది. ఉష (సారా అలీఖాన్) తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆంగ్లేయుల ఆగడాలు చూస్తూ పెరుగుతూ ఉంటుంది. ఎంతోమంది దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతూ ఉంటే, ఒక న్యాయమూర్తిగా తన తండ్రి హరిప్రసాద్ (సచిన్ ఖేడ్కర్) ఆంగ్లేయులకి మద్దతుదారుగా ఉండటం ఆమెకి అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. తన మనసులో ఆంగ్లేయుల పట్ల వ్యతిరేక ఆలోచనలు కలగకుండా తండ్రి చేసే ప్రయత్నాల వలన, ఆయన పట్ల ఆమెకి గల గౌరవాన్ని తగ్గించివేస్తాయి.
ఉషతో పాటు దేశం పట్ల ఆమెకి గల భక్తి .. పోరాట వీరుల పట్ల గౌరవం .. ఆంగ్లేయుల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వెళతాయి. కూతురు తన స్వేచ్ఛను మాత్రమే కాదు, దేశానికి కూడా స్వేచ్ఛ కావాలని కోరుకుంటుందనే విషయాన్ని హరిప్రసాద్ గమనిస్తాడు. ఆమెను ఓ గదిలో బంధించడానికి ప్రయత్నిస్తాడు. దాంతో ఆమె తప్పించుకుని .. ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. తన పట్ల .. తన పోరాటం పట్ల అభిమానంతో ఉన్న కౌశిక్ (అభయ్ వర్మ), ఫహాద్ (స్పర్శ్ శ్రీవాత్సవ్) సహాయాన్ని ఆమె తీసుకుంటుంది.
గాంధీజీ సభలకు .. సమావేశాలకు ఉష హాజరవుతూ ఉంటుంది. 'డూ ఆర్ డై' అనే నినాదాన్ని ఆమె బలమైన సంకల్పంగా మార్చుకుంటుంది. బ్రహ్మచారిణిగా ఉంటూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడతానని ఆమె గాంధీజీ సమక్షంలో వాగ్దానం చేస్తుంది. అయితే ఊహించని ఆమె నిర్ణయం, ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్న కౌశల్ కి మనస్ధాపాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో ముందువరుసలో ఉన్న నాయకులను ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటుంది.
దేశవ్యాప్తంగా ప్రజలందరిలో విప్లవ భావాలను వెదజల్లడానికి రేడియోను మించిన సాధనం లేదని ఉష భావిస్తుంది. అయితే ప్రైవేట్ రేడియో స్టేషన్స్ కి అనుమతి లేకపోవడం వలన, అత్యంత రహస్యంగా రేడియో కార్యకలాపాలను నిర్వహించాలనే నిర్ణయానికి వస్తుంది. ఈ విషయంలో ఆమెకి ఇంజనీర్ ఫిర్ దోస్ .. రేడియో టెక్నాలజీ పై మంచి అవగాహన ఉన్న కామత్ సాయపడతారు. ఇదే సమయంలో వాళ్లకి రామ్ మనోహర్ లోహియా (ఇమ్రాన్ హష్మీ) మద్దతు లభిస్తుంది. 'కాంగ్రెస్ రేడియో' పేరుతో ప్రసారం ప్రారంభమవుతుంది.
ఈ విషయం ఆంగ్లేయులకు తెలిసిపోతుంది. రేడియో ప్రసారాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఎవరు వాటిని నిర్వహిస్తున్నారు? అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ రహస్యాన్ని ఛేదించడానికి గాను ఆంగ్లేయుల వైపు నుంచి అలెక్స్ .. లెఫ్టినెంట్ ధార్ .. లెఫ్టినెంట్ రాయ్ రంగంలోకి దిగుతారు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించే వాహనంలో వాళ్లు గాలింపు మొదలెడతారు. పర్యవసానంగా ఏం జరుగుతుంది? ఉష లక్ష్యం ఎంతవరకూ నెరవేరుతుంది? అనేది మిగతా కథ.
రచయిత ఫరూక్ రాసిన కథ ఇది. స్వాతంత్య్ర పోరాటానికి గాను తమ జీవితాన్ని పణంగా పెట్టిన ఒక ఆదర్శమూర్తి కథ ఇది. దర్శకుడు కణ్ణన్ అయ్యర్ ఈ కథకి దృశ్యరూపాన్ని ఇచ్చాడు. 1942లో సాగే కథ గనుక, ఆ కాలాన్ని ప్రతిబింబించే ఫిల్మ్ కలర్ టోన్ ఎంచుకున్న తీరు, సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళుతుంది. ఆనాటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. వాస్తవానికి ఈ తరహా కథలకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ మేకర్స్ చాలా తెలివిగా ఒక రద్దీ కూడలి సెట్ లోనే చాలా వరకూ లాగించారు.
ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ .. వాహనాలు .. ఆయుధాలు .. ఫోన్లు .. రేడియోలు .. ఇవన్నీ కూడా కథను మరింత బలోపేతం చేయడానికి దోహదపడ్డాయి. అమలేందు చౌదరి ఫొటోగ్రఫీ .. ముకుంద్ - అక్షదీప్ - శశి సుమన్ నేపథ్య సంగీతం ఈ కథకు మరింత హెల్ప్ అయ్యాయి. ఆ కాలం తరహా చిత్రీకరణ .. ఆ కాలం నాటి వాద్య పరికరాలకు దగ్గరగా నేపథ్య సంగీతం ఆ కాలంలోనే మనలను ఉంచుతూ, కథను ఫాలో అయ్యేలా చేస్తూ ఉంటాయి.
ఇది దేశభక్తి సినిమా .. ఆవేశమనేది ఉద్యమదారుల మొదటి లక్షణం. సాహసమనేది వారిలో సహజంగా కనిపించే ఒక ఆభరణం. ఈ కథలోని ఉష పాత్ర ధారిణిని ఉద్దేశించి ఆమె తండ్రి 'నీలో విప్లవ భావాలు ఉండటం కాదమ్మా .. నువ్వే ఒక విప్లవానివి' అంటాడు. కానీ ఆ స్థాయిలో ఈ పాత్రను తీర్చిదిద్దలేదు. దేశభక్తి సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూస్తుంటే, గూస్ బంప్స్ రావాలి .. కానీ అలాంటి ఫీలింగ్స్ కలగవు. అంటే ఆ స్థాయి సీన్స్ ను డిజైన్ చేయలేదని అర్థం.
సారా అలీఖాన్ పోషించిన పాత్ర చాలా పవర్ఫుల్. తన ప్రేమను .. పెళ్లిని .. ప్రాణాలను పణంగా పెట్టే పాత్ర ఇది. అలాంటి ఆ పాత్రలో ఆమెను చూస్తే ఏమీ అనిపించదు. అంటే .. ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడంలో విఫలమయ్యారు. ఇక ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోయారు. దేశభక్తిని .. దేశభక్తుల త్యాగాలను గుర్తుకు చేయాలనే ఉద్దేశం మంచిదే. కానీ అలాంటి కథా వస్తువుల్లో ఆత్మను ప్రవేశపెట్టడం ప్రధానమనే విషయాన్ని మరిచిపోకూడదు.