'గామి' - మూవీ రివ్యూ!

Gaami

Movie Name: Gaami

Release Date: 2024-03-08
Cast: Vishwak Sen, Chandini Chowdary, Abhinaya, Dayanand Reddy,
Director:Vidyadhar Kagita
Producer: Karthik Sabareesh
Music: Naresh Kumaran
Banner: Karthik Kult Kreations
Rating: 2.50 out of 5
  • విష్వక్ అఘోరాగా కనిపించే 'గామి'
  • క్లైమాక్స్ కి ముందు కథను కనెక్ట్ చేసే పాయింట్ 
  • అప్పటివరకూ అయోమయాన్ని కలిగించే సీన్స్ 
  • హైలైట్ గా నిలిచే ఫొటోగ్రఫీ   

విష్వక్సేన్  మొదటి నుంచి కూడా మాస్ కంటెంట్ ఉన్న కథలను ఎక్కువగా ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆయన నుంచి అలాంటి సినిమాలనే మాస్ ఆడియన్స్ ఆశిస్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఆయన తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన సినిమానే 'గామి'. కొత్త దర్శకుడు విద్యాధర్ కి అవకాశాన్నిస్తూ విష్వక్ చేసిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. అఘోర లుక్ తో విష్వక్ కనిపించిన ఈ సినిమా, శివరాత్రి సందర్భంగా ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టిందనేది చూద్దాం. 
 
అఘోరాగా ఉన్న శంకర్ (విష్వక్సేన్) ఒక రకమైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. మనుషుల స్పర్శ తగిలితే చాలు, ఆయన శరీరమంతా రంగు మారిపోతూ ఉంటుంది. కొంతసేపటి వరకూ విపరీతమైన బాధను అనుభవిస్తూ ఉంటాడు. ఆ బాధను తట్టుకోలేక అతను తన గురువైన కేదార్ బాబాను వెతుక్కుంటూ 'ప్రయాగ్ రాజ్' వెళతాడు. అయితే అప్పటికి రెండేళ్ల క్రితమే ఆయన చనిపోయాడని తెలుసుకుని బాధపడతాడు. 

కేదార్ బాబా దగ్గర చాలా కాలం నుంచి శిష్యుడిగా ఉన్న ఓ వ్యక్తి, శంకర్ పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుంటాడు. ప్రతి 36 ఏళ్లకి హిమాలయాల్లో ఒక అద్భుతం జరుగుతుందనీ, ఆకాశంలో మూడు తోకచుక్కలు పుట్టిన సమయంలో 'మాలి పత్రాలు' వికసిస్తాయనీ, ఆ పత్రాల స్పర్శ కారణంగా అతని వ్యాధి తగ్గిపోతుందని చెబుతాడు. 'మాలి పత్రాలు' వికసించిన 12 గంటలలోపు తమ ప్రభావాన్నీ కోల్పోతాయనీ, ఈ లోగానే వాటిని సంపాదించాలని అంటాడు.  
 
36 ఏళ్ల తరువాత మరో 15 రోజుల్లో ఆ అద్భుతం హిమాలయాల్లో జరుగుతుందనీ, సాధ్యమైనంత త్వరగా బయల్దేరమని కేదార్ బాబా శిష్యుడు అంటాడు. అక్కడికి వెళ్లే దారి జాహ్నవి అనే డాక్టర్ కి తెలుసనీ, ఆమె కూడా మూడేళ్లుగా ఆ పత్రాల కోసం ప్రయత్నం చేస్తోందని చెబుతాడు. అడుగడుగునా ఎదురయ్యే ప్రమాదాలను గురించి హెచ్చరించి పంపిస్తాడు. జాహ్నవి దారి చూపుతుండగా శంకర్ ఆమెను అనుసరిస్తాడు.

ఇదిలా ఉండగా .. ఒక నిర్జన ప్రదేశంలో అమ్మాయిలపై .. అబ్బాయిలపై ఒక రహస్య ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అక్కడికి రహస్యంగా తరలించబడిన వారెవరూ ఎలాంటి పరిస్థితుల్లో బయటపడలేరు. చుట్టూ అంతటి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అక్కడ బంధించబడిన ఒక అబ్బాయి తప్పించుకోవడానికి తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ చీకటి కోటలో రహస్యంగా లింగమార్పిడికి సంబంధించిన సర్జరీలు జరిగిపోతుంటాయి. 

ఇదే సమయంలో ఒక గ్రామంలో 'దుర్గ' (అభినయ) దేవదాసీగా ఉంటుంది. ఆమెకి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, ఆమె 12 ఏళ్ల కూతురును 'దేవదాసీ'గా మార్చడానికి గ్రామా పెద్దలు ప్రయత్నిస్తారు. అది ఎంతమాత్రం ఇష్టం లేని దుర్గ, తన కూతురును తీసుకుని ఆ ఊరు నుంచి వెళ్లిపోవాలని భావిస్తుంది. వెనకా ముందూ ఎవరూ లేని శంకర్ కీ, ల్యాబ్ లోని ఆ కుర్రాడు .. విలేజ్ లోని ఉమ .. కళ్లలో మెదులుతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటి? వాళ్లతో శంకర్ కి ఉన్న సంబంధం ఏమిటి? హిమాలయాల్లో శంకర్ కి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది కథ.

'గామి' టైటిల్ .. అఘోరాగా విష్వక్ లుక్ ..  అందరిలో చాలా ఆసక్తిని పెంచాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. విజువల్స్ పరంగా ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండొచ్చని అంతా భావించారు. అలా పెరిగిన అంచనాలకు తగినట్టుగానే ఈ రోజున థియేటర్స్ దగ్గర రద్దీ కనిపించింది. మరి ఈ సినిమా ఆడియన్స్ అనుకున్న స్థాయికి తగినట్టుగా ఉందా  అంటే .. లేదనే చెప్పాలి.

ఈ కథ మూడు వైపుల నుంచి నడుస్తూ ఉంటుంది. మూడు ట్రాకులకు సంబంధించిన సన్నివేశాలు గొలుసుకట్టుగా వచ్చి వెళుతూ ఉంటాయి. విష్వక్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఆయనకి ఆ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? ల్యాబ్ లో ఉన్న అబ్బాయి ఎవరు? విలేజ్ లో దేవదాసీగా ఉన్న దుర్గ ఫ్యామిలీ ట్రాక్ కి ముగింపు ఏమిటి? ఇలా అనేక సందేహాలు ఆడియన్స్ లో తలెత్తుతూ ఉంటాయి. కానీ వాటికి సమాధానం ముగింపుకి ముందుగానీ రివీల్ చేయలేదు. 

సాధారణంగా కథ ఆరంభంలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని కొద్దిగా చూపించి .. ఆ తరువాత దానిని లాక్ చేసి .. ఎక్కడోగానీ రివీల్ చేయరు. అలాంటప్పుడు లాక్ చేసి సీన్ ను తిరిగి ఎక్కడ రివీల్ చేస్తారా అని ఆడియన్స్ వెయిట్ చేస్తారు. అదేమీ లేకుండా తెరపైకి సీన్స్ వచ్చి వెళుతుంటే .. ఏది ఎందుకు జరుగుతుందో తెలివని ఒక అయోమయంలోనే సగటు ప్రేక్షకుడు ఉండిపోతాడు. ఈ సినిమా విషయంలోను అదే జరిగింది. 

నిజానికి దర్శకుడు ఎంచుకున్న కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కానీ నేను ఆ విషయాన్ని చివర్లో చెబుతాను .. అప్పటి వరకూ అలా చూస్తూ కూర్చోండి అన్నట్టుగా అర్థంకాని సన్నివేశాలతో కథ నడుస్తుంది. సిటీ బస్సులో చాలాసేపు నిలబడి ప్రయాణం చేసినవాడికి, తీరా దిగిపోయేముందు సీటు దొరికినట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇక దర్శకుడు సీక్రెట్ ల్యాబ్ కి సంబంధించిన సన్నివేశాలపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపిస్తుంది. ఇక విలేజ్ నేపథ్యంలోని సీన్స్ పై ఆర్ట్ ఫిలిమ్స్ ఛాయలు లేకపోలేదు. 

విష్వక్సేన్ లుక్ కాస్త కొత్తగానే అనిపించినా, ఈ పాత్ర విషయంలో ఆయన తన డైలాగ్ డెలివరీ మార్చుకుంటే బాగుండేది. నరేశ్ కుమరన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు. విశ్వనాథ్ రెడ్డి కెమెరా  పనితనం బాగుంది. హిమాలయాల  నేపథ్యంలోని సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. రాఘవేంద్ర తిరున్ ఎడిటింగ్ ఓకే. ఆసక్తికరమైన అంశాన్ని చివరివరకూ గుప్పెట్లో దాచడం .. వినోదపరమైన మరే అంశాలకు చోటు ఇవ్వకపోవడం కాస్త అసంతృప్తిని కలిగిస్తుంది. దీనిని ఒక ప్రయోగంగానే భావించాలనేవారికి నచ్చొచ్చు. 

Trailer

More Reviews