'భీమా' - మూవీ రివ్యూ

Bhimaa

Movie Name: Bhimaa

Release Date: 2024-03-08
Cast: Gopichand, Malavika Sharma, Priya Bhavani Shankar, Nassar, Mukesh Tiwari,Vennela Kishore
Director:Harsha
Producer: K K Radhamohan
Music: Ravi Basrur
Banner: Sri Sathya Sai Arts
Rating: 2.75 out of 5
  • గోపీచంద్ మార్క్ సినిమాగా 'భీమా' 
  • ఆకట్టుకున్న ఫైట్స్ .. ఫొటోగ్రఫీ 
  • గ్లామరస్ గా మెరిసిన మాళవిక శర్మ
  • హైలైట్ గా నిలిచే క్లైమాక్స్ 
  • కాస్త కన్ఫ్యూజన్ గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్

గోపీచంద్ కథానాయకుడిగా 'భీమా' సినిమా రూపొందింది. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమాకి, హర్ష దర్శకత్వం వహించాడు. ప్రియా భవాని శంకర్ - మాళవిక శర్మ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చాడు. గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా, భారీ అంచనాల మధ్య ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.  ఇంతవరకూ ఇలాంటి సినిమా చేయలేదంటూ గోపీచంద్ ఆసక్తిని పెంచిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

సప్త చిరంజీవులలో పరశురాముడు ఒకరు. ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశం పేరే పరశురామ క్షేత్రం. ఇప్పుడు ఆ ఊరును 'మహేంద్రగిరి'గా పిలుస్తుంటారు. అక్కడి ప్రాచీనమైన శివాలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నదని గ్రామస్తులు విశ్వసిస్తూ ఉంటారు. నిరంతరం గంగా జలంతో అభిషేకించబడే అక్కడి 'శక్తి లింగం' ఎంతో మహిమాన్వితమైనదని భావిస్తూ ఉంటారు. చనిపోయిన తరువాత 11వ రోజు నాటికి తమకి కావలసిన వారిని ఆత్మలు ఆవహించి, తమ చివరి కోరికను తీర్చుకుంటాయనే ఒక బలమైన విశ్వాసం అక్కడి వారిలో ఉంటుంది.

పరశురాముడు పాద స్పర్శ కారణంగా ఆ నేలకి ఒక పవిత్రత వస్తుంది. ఔషధ గుణాలున్న అనేక రకాల మొక్కలు అక్కడ లభిస్తూ ఉంటాయి. ఆ మొక్కలతో రవీంద్ర వర్మ ( నాజర్) వైద్యం చేస్తూ ఉంటాడు. ఆ ఊళ్లోనే దాదాగిరి చేస్తూ భవాని ( ముఖేశ్ తివారి) అందరినీ భయపెడుతూ ఉంటాడు. తన కొడుకు 'రుద్ర'తో కలిసి అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తూ ఉంటాడు. ప్రతిరోజు రాత్రివేళ ఆయనకి సంబంధించిన ట్యాంకర్లు ఊరు దాటుతూ ఉంటాయి. అందుకు అధికారులు కూడా ఆయనకి సహకరిస్తూ ఉంటారు. 

అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఊరుకి పోలీస్ ఆఫీసర్ గా 'భీమా' (గోపీచంద్) వస్తాడు. వచ్చి రావడంతోనే భవాని మనుషులతో గొడవపడతాడు. ఆ ఊళ్లో ఏమేం జరుగుతున్నాయనే విషయంపై దృష్టిపెడతాడు. ఆ ఊరును అడ్డాగా చేసుకుని తనకి తెలియకుండా ఏదో జరుగుతోందనే అనుమానం అతనికి కలుగుతుంది. అలాగే ఆలయాన్ని మూసి ఉంచడంపై కూడా ఆయనకి సందేహాలు ఉంటాయి. అసలు సూత్రధారి ఎవరో తెలుసుకునే పనిలో పడతాడతను. 

ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన విద్య ( మాళవిక శర్మ)తో అతను ప్రేమలో పడతాడు. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే అతను, 'రామ' అనే పేరు విన్నా .. అన్నయ్య అనే పిలుపు విన్నా చాలా ఎమోషనల్ అవుతుంటాడు. తమ వ్యాపారానికి అడ్డొస్తున్న 'భీమా'ను అంతం చేయడానికి భవాని ముఠా స్కెచ్ వేస్తుంది. అప్పుడు 'భీమా' ఏం చేస్తాడు? అతనికి తెలియకుండా జరుగుతున్న అక్రమ వ్యాపారం ఏమిటి? ఆలయం తలుపులు ఎందుకు మూశారు? 'రామ' అనే పేరు వినగానే 'భీమా' ఎందుకు ఎమోషనల్ అవుతున్నాడు? అనేది మిగతా కథ. 

2003లో ఈ కథ మొదలవుతుంది .. దర్శకుడు హర్ష ఈ కంటెంట్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా రెడీ చేసుకున్నాడు. గోపీచంద్ ఇంట్రడక్షన్ సీన్ ను .. సాంగ్ ను ప్లాన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ లో కామెడీకీ .. యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, విలన్ వైపు నుంచి .. హీరో ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు నుంచి సస్పెన్స్ మెయింటెయిన్ చేశాడు.  అలాగే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ ను .. మాళవిక శర్మను గ్లామరస్ గా చూపించడంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. 

ఇంటర్వెల్ బ్యాంగ్ ను డైరెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు, సెకండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచేదిలానే ఉంటుంది. సెకండాఫ్ లో మరో గోపీచంద్ .. మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి వాళ్ల జోరు కొనసాగుతుంది. ఈ ట్రాక్ కాస్త బలహీనంగా అనిపించినప్పటికీ, వేరియేషన్ పరంగా ఓకే అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లోని ట్విస్ట్ ను కొంతమంది ఆడియన్స్ ఊహించే అవకాశం ఉంది. క్లైమాక్స్ ను మాత్రం గెస్ చేయలేరు .. ఈ కథ పరశురామ క్షేత్రంలో జరుగుతున్నట్టుగా దర్శకుడు ఎందుకు చెబుతూ వచ్చాడనేది ఇక్కడ అర్థమవుతుంది. 

గోపీచంద్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. రెండు పాత్రలకి సంబంధించిన వేరియేషన్ ను చూపించాడు. ఆయన లుక్ కొత్తగా అనిపిస్తుంది. మంచి ఫిట్ నెస్ తో కనిపించాడు కూడా. కాకపోతే అక్కడక్కడా ఆయన వైపు నుంచి కాస్త కామెడీ పాళ్లు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇక మాళవిక శర్మ చాలా అందంగా కనిపించింది. తరచూ రొమాంటిక్ గా ఆమె పెట్టే ఒక ముద్రను డైరెక్టర్ చాలా తెలివిగా డిజైన్ చేశాడు. అయినా కొంతమందిని అది ఇబ్బంది పెడుతుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లోకి తరచూ వెళ్లడం .. రావడం కాస్త కన్ఫ్యూజన్ కలిగిస్తుంది   

 వెన్నెల కిశోర్ వైపు నుంచి నడిపించిన కామెడీ బాగుంది. 'కనబడుట లేదు' అని ఊరంతా పోస్టర్లు అంటించారు . దొరికిన తరువాత 'దొరికాడు' అని మళ్లీ పోస్టర్లు వేయాలా వద్దా? అంటూ నవ్వించాడు. నరేశ్ కామెడీ కూడా అంతగా అతకదు. మిగతా వాళ్లంతా తమ పాత్రలలో నుంచి బయటికి రాకుండా న్యాయం చేశారు. రవి బస్రూర్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. 'ఏదో ఏదో మాయ' అనే పాట ఎక్కువ మార్కులు దక్కించుకుంటుంది.  నేపథ్య సంగీతం మాత్రం అంత పెర్ఫెక్ట్ గా అనిపించదు. అలాగే స్వామి జె గౌడ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ అనే చెప్పాలి. ఫారెస్టు .. నైట్ ఎఫెక్ట్ .. సముద్రం .. ప్రాచీన కాలం నాటి టెంపుల్ నేపథ్యంలోని సీన్స్ ను చిత్రీకరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది.


 గోపీచంద్ సినిమా అనగానే ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ను ఊహించుకుని ఆయన అభిమానులు థియేటర్స్ కి వస్తారు. అలాంటివారిని  ఈ సినిమా ఎంత మాత్రం నిరాశపరిచదు. రామ్ - లక్ష్మణ్, రవివర్మ .. వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ పెర్ఫెక్ట్ గా అనిపిస్తాయి. ఇక డైలాగులు అక్కడక్కడా బాగానే అనిపించినా, కొన్ని చోట్ల అవసరానికి మించి వినిపిస్తాయి. చందమామ కథలో మాదిరిగా ఇంకా అన్నదమ్ములకు రామ - భీమ అనే  పేర్లు పెట్టడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్లు కాస్త అతిగా .. అతకలేదన్నట్టుగా అనిపించినా, గోపీచంద్ అభిమానులను ఆకట్టుకునే అవకాశాలైతే ఉన్నాయి. 

ప్లస్స్  పాయింట్స్: కథ .. కథనం .. గోపీచంద్ లుక్ .. ఫైట్స్ .. మాళవిక శర్మ గ్లామర్ .. వెన్నెల కిశోర్ కామెడీ .. క్లైమాక్స్. 

మైనస్ పాయింట్స్: గోపీచంద్ వైపు నుంచి ఉన్న కామెడీ .. నరేశ్ కామెడీ .. అవసరానికి మించి వినిపించే డైలాగ్స్    

Trailer

More Reviews