రవికిషన్ .. హిందీ .. భోజ్ పురి సినిమాలను చూసేవారికి పరిచయం అవసరం లేని పేరు. 'రేసు గుర్రం' సినిమాతో ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత 'కిక్ 2' .. 'బ్రూస్ లీ' .. ' సుప్రీమ్' వంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ పేరే 'మామ్లా లీగల్ హై'. ఈ సిరీస్ ఈ నెల 1వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. కోర్టు రూమ్ కామెడీ డ్రామాగా, 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది చూద్దాం.

త్యాగి (రవికిషన్) ఢిల్లీ పరిధిలోని 'పట్ పర్ గంజ్' జిల్లా కోర్టులో అడ్వకేట్ గా ఉంటాడు. ఆయన తండ్రి  జడ్జిగా పనిచేసి ఉంటాడు. తండ్రి పేరును ప్రస్తావించకుండానే జీవితంలో ఎదగాలనే ఒక పట్టుదలతో త్యాగి ఉంటాడు. అంచలంచెలుగా ఎదగాలనే ఒక బలమైన కోరిక ఆయనలో ఉంటుంది. అందుకోసం ఎవరిని పట్టుకుంటే .. ఎవరిని ఎలా ఉపయోగించుకుంటూనే త్వరగా ఎదగొచ్చనే విషయాన్ని గురించే ఆయన ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు.

 'ఫట్ పడ్ గంజ్'లోని ప్రతి వకీల్ ఎప్పుడెప్పుడు తమకి కేసు దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. కోర్టు ప్రాంగణంలో ఎవరైనా కాలు పెట్టడమే ఆలస్యం గుమిగూడిపోతుంటారు. ఇక వకీల్ పనిని పక్కన పెట్టేసి, కమీషన్స్ తో సుజాత కాలక్షేపం చేస్తూ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ లో ఆమె టేబుల్ ఉంటుంది. ఎప్పటికైనా తాను ప్రత్యేకమైన ఛాంబర్ లో కూర్చోవాలనేది ఆమె ఆశ. ఇక మున్షీ అనే మరో సీనియర్ వకీల్ .. తన సీనియారిటీకి తగిన ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటూ ఉంటాడు. 

అలాంటి పరిస్థితుల్లోనే ఆ కోర్టులో పని చేయడానికి ఒక వకీలుగా అనన్య వస్తుంది. తన కెరియర్ అక్కడి నుంచే మొదలవుతుంది. ఫస్టు కేసును సాధ్యమైనంత తొందరగా సంపాదించుకుని, మంచి పేరు తెచ్చుకోవాలనే ఆశలతో ఆమె అక్కడికి వస్తుంది. అయితే అక్కడి వాళ్లంతా కమీషన్లపై తప్ప కేసులపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీతి .. నిజాయితీ అనే మాటలు విన్నప్పుడు వాళ్లంతా తనని చిత్రంగా చూడటాన్ని అనన్య గమనిస్తుంది.

అనన్య సంపన్నుల ఫ్యామిలీ నుంచి వచ్చింది. పైగా ఆమె పూర్వీకులు కూడా న్యాయవాదులుగా పనిచేసినవారే. అందువలన అంతా ఆమెను గౌరవంగానే చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆమెకి కమీషన్లతో పనిలేదు గనుక పక్కన పెడుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే కోర్టు  మేనేజర్ విశ్వాస్ తో అనన్యకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే విశ్వాస్ కి కాబోయే భార్య 'వర్ష' .. వీళ్ల పరిచయాన్ని అపార్థం చేసుకుంటుంది.  
 
 
ఈ నేపథ్యంలోనే ఢిల్లీ బార్ అసోసియేషన్  ప్రెసిడెంట్ ఎన్నికల హడావిడి మొదలవుతుంది. తాను గెలవాలనే పట్టుదలతో త్యాగీ ఉంటాడు. అందుకు సంబంధించిన ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉంటాడు. ఇక తాను చదువుకున్న పుస్తకాలలో ఉన్నదానికీ, వాస్తవ పరిస్థితులకు ఎలాంటి పొంతన  లేకపోవడం చూసి అనన్య ఆలోచనలో పడుతుంది. ఆ తరువాత ఆమె ఏం చేస్తుంది? ఆమెకి ఫస్టు కేసు దొరుకుతుందా? బార్ అసోసియేషన్ ఎన్నికలలో త్యాగి గెలుస్తాడా? సుజాత ఛాంబర్ కల నిజమవుతుందా? అనేది ఆసక్తిని పెంచే అంశాలు.

రాహుల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హాస్య ప్రధానంగా సాగుతూనే, అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తుంది. కథలో 80 శాతం వరకూ కోర్టు ప్రాంగణంలోనే నడుస్తుంది.  వకీలు పని చేసే కొంతమంది స్వభావాలు .. బలహీనతలు .. వాళ్లకి తగిలే కేసులు .. వాటి చుట్టూ ఉండే సమస్యలను హాస్యభరితంగా ఆవిష్కరించారు. స్థానిక సమస్యలను ఆధారంగా చేసుకునే ఈ కథ నడుస్తుంది. సహజత్వానికి దగ్గరగా వెళ్లడానికే దర్శకుడు ప్రయత్నించాడు. 

ప్రధానంగా ఈ కథ .. త్యాగి .. అనన్య .. సుజాత .. విశ్వాస్ పాత్రల చుట్టూ తిరుగుతుంది. అయితే కథలో కామెడీ కంటే కూడా అందుకోసం చేసిన ప్రహసనం ఎక్కువగా కనిపిస్తుంది. నవ్వించడానికి చేసిన ప్రయత్నం అక్కడక్కడా మాత్రమే ఫలిస్తుంది. చాలా సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి .. అసహనాన్ని కలిగిస్తాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రతి పాత్రకి ఒక సంతృప్తి కరమైన ముగింపును ఇవ్వడం జరిగింది.

 హాస్య ప్రధానమైన ఈ సిరీస్ లో ఎలాంటి ట్విస్టులకు అవకాశం లేదు. కథ సాదాసీదాగా సాగిపోతూ ఉంటుంది. కథంతా కోర్టు ప్రాంగణంలోనే జరుగుతుంది గనుక, కెమెరా పనితనం గురించి .. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఉండదు. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టుల సహజమైన నటన ప్రధానమైన బలంగా కనిపిస్తుంది. ఒక చిన్న ఆశ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.  హోదా పరంగా కాదు .. వ్యక్తిత్వం పరంగా జీవితంలో ఎదగాలనే సందేశం ఉన్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఈ సిరీస్ ఆకట్టుకోలేపోయిందనే చెప్పాలి.