'ఆపరేషన్ వాలెంటైన్' - మూవీ రివ్యూ!

Operation Valentine

Movie Name: Operation Valentine

Release Date: 2024-03-01
Cast: Varun Tej, Manushi Chhillar, Ruhani Sharma, Mir Sarwar, Sampath Raj
Director:Shakti Pratap Singh Hada
Producer: Sony Pictures - Sandeep Mudda
Music: Mickey J. Meyer
Banner: Sony Pictures Renaissance Pictures
Rating: 2.50 out of 5
  • వరుణ్ తేజ్ నుంచి 'ఆపరేషన్ వాలెంటైన్'
  • యాక్షన్ దృశ్యాలపై మాత్రమే ఫోకస్ చేసిన డైరెక్టర్
  •  ఏ వైపు నుంచి కనెక్ట్ కాని ఎమోషన్స్
  •  తన పాత్రలో మెప్పించిన వరుణ్ తేజ్ 
  • మిగతా పాత్రలకి పెద్దగా లేని ప్రాధాన్యత  

వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా రూపొందింది. సోనీ పిక్చర్స్ - రిలయన్స్ పిక్చర్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించారు. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో ఈ రోజునే థియేటర్లకి వచ్చేసింది. మానుషీ చిల్లర్ ను కథానాయికగా పరిచయం చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

అర్జున్ రుద్రదేవ్ (వరుణ్ తేజ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పనిచేస్తూ ఉంటాడు. మరో వింగ్ కమాండర్ అహాన (మానుషి చిల్లర్)తో అతనికి పరిచయమవుతుంది. వారి పరిచయం ప్రేమగా మారడం .. పెళ్లిచేసుకోవడం జరిగిపోతాయి. అయితే ఈ ఇద్దరూ కూడా కొంతకాలం క్రితం జరిగిన 'ఆపరేషన్ వజ్ర'లో మరో వింగ్ కమాండర్ కబీర్ సింగ్ (నవదీప్)తో కలిసి పనిచేస్తారు. అయితే ఆ ఆపరేషన్ లో కబీర్ సింగ్ చనిపోతాడు. ఈ ఆపరేషన్ విషయంలో అర్జున్ రుద్రదేవ్ తొందరపాటును డిపార్టుమెంట్ తప్పుబడుతుంది. 

 అర్జున్ రుద్రదేవ్ తరచూ 'ఆపరేషన్ వజ్ర' గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. కబీర్ సింగ్ చనిపోవడం గురించి బాధపడుతూ ఉంటాడు. అతని ఆవేశం .. కీలకమైన సమయంలో పై అధికారుల ఆదేశాలను సైతం ఖాతరు చేయని స్వభావం గురించి అహాన ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించుకోమని అతనికి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. తనతో పాటు కలిసి పనిచేసేవారిని కాపాడుకునే ప్రయత్నంలో ఆలోచిస్తూ కూర్చోవడం తన వలన కాదనేది అర్జున్ రుద్రదేవ్ సమాధానం.

కశ్మీర్ - శ్రీనగర్ ప్రాంతాల్లో ఉగ్రచర్యలు ఊపందుకుంటాయి. ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సాయం చేస్తూ ఉంటుంది. దాంతో వాళ్లు ఇండియాలోని పలు ప్రదేశాల్లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఆల్రెడీ వాళ్లు మానవ బాంబును ఉపయోగించి 40 మంది భారతీయ జవాన్లను పొట్టన పెట్టుకుంటారు. దాంతో పైఅధికారుల ఆదేశం మేరకు, అర్జున్ తన సహచరులతో కలిసి, ఆ ఉగ్రవాదుల గుడారాలపై విరుచుకుపడతాడు. పై అధికారుల అభినందనలు అందుకుంటాడు. 

అయితే ఒక వైపున భారత్ పైకి తీవ్రవాదులను ఉసిగొల్పే పాకిస్థాన్, భారత్ లోని వేరే ప్రదేశాన్ని తన టార్గెట్ గా పెట్టుకుని, ఆ దిశగా పావులు కదుపుతూ ఉంటుంది. తమ లక్ష్యం పాకిస్థాన్ కాదనీ .. దాని సపోర్టుతో ఎదుగుతున్న ఉగ్రవాదమని ఎయిర్ ఫోర్స్ అధికారులు చెబుతున్నా వినిపించుకోకుండా, వాళ్లు యుద్ధ విమానాలను రంగంలోకి దింపుతారు. ఊహించని విధంగా మిస్సైల్స్ సిద్ధం చేస్తారు. పాకిస్థాన్ ఉద్దేశం ఏమిటనేది ఇక్కడి అధికారులకు అర్థమవుతుంది. అప్పుడు అర్జున్ రుద్ర దేవ్  ఏం చేస్తాడు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేదే కథ.

ఇది దేశ భక్తి నేపథ్యంతో కూడిన కథనే .. ఒక సిన్సియర్ ఆఫీసర్ కథనే. దేశరక్షణ .. అందుకు సంబంధించిన ఆపరేషన్స్ ఎయిర్ ఫోర్స్ వైపు నుంచి ఎలా జరుగుతాయనేది చూపించడంలో దర్శకుడు కొంత వరకూ సక్సెస్ అయ్యాడు. యుద్ధ విమానాల విన్యాసాలను అలా పక్కన పెడితే, హీరో పైఅధికారుల హడావిడి తప్ప మరేమీ కనిపించదు. హీరో ఆవేశం .. హీరోయిన్ నచ్చజెప్పడం అంతే. 

దర్శకుడు కేవలం హీరో .. హీరోయిన్ .. ఇద్దరు ముగ్గురు పై అధికారుల పాత్రలపై మాత్రమే దృష్టి పెట్టాడు. హీరో వైపు నుంచి గానీ .. హీరోయిన్ వైపు నుంచి గాని ఫ్యామిలీస్ కనిపించవు. అలాగే ఆ రెండు పాత్రల ద్వారా ఇచ్చిన రొమాంటిక్ టచ్ కూడా నామ మాత్రమే. హీరో ఫ్రెండ్ యశ్ .. అభినవ్ గోమఠం .. రుహాని శర్మ పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా అలా వదిలేశారు. ఇటు తీవ్రవాదుల వర్గం నుంచి గానీ, అటు పాక్ ఆర్మీ వైపు నుంచి గాని బలమైన విలనిజం లేకుండా పోవడం నిరాశను కలిగిస్తుంది.  

బాంబ్ బ్లాస్ట్ నుంచి ఒక పదేళ్ల పాప కోసం ఒక ఆర్మీ జవాన్ తన ప్రాణాలను ఇచ్చే సీన్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇక యుద్ధ విమానాలకు సంబందించిన దృశ్యాలను .. మిస్సైల్ దాడులను ఆడియన్స్ పట్టుకోలేరు. తెరపై అంత వేగంగా చూపించే సన్నివేశాలు వారికి రిజిస్టర్ కావు. అందువలన సాధారణ ప్రేక్షకులకు కాస్త అయోమయం ఉంటుంది. 

నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా. మానుషి చిల్లర్ పాత్రకి గ్లామర్ టచ్ లేదు. ఒక ఆఫీసర్ లానే చూపించారు గనుక, ఆ పాత్రలో మెప్పిస్తుంది. పాటలకి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. మిక్కీ జె మేయర్ బాణీలు గుర్తుండేలా కూడా లేవు. హరి కె వేదాంతం కెమెరా పనితనం బాగుంది. మంచుకొండలకి సంబంధించిన లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. 
                

ఇలాంటి కంటెంట్ తో వచ్చిన ఫస్టు తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు. కానీ ఈ తరహా సినిమాలు హాలీవుడ్ లో చాలానే వచ్చాయి. ఓటీటీ వచ్చిన తరువాత అవి అందుబాటులోనే ఉన్నాయి. ఆ స్థాయికి మించి ఇక్కడ చూపించగలిగేది ఏదైనా ఉందంటే అది ఎమోషన్ మాత్రమే. ఆ ఎమోషన్ ను ఏ వైపు నుంచీ కూడా దర్శకుడు కనెక్ట్ చేయలేకపోయాడు. తెరపై అలా యుద్ధ విమానాల విన్యాసాలను చూస్తూ కూర్చోవడమంటే కష్టమే.

Trailer

More Reviews