'భామాకలాపం 2' (ఆహా) మూవీ రివ్యూ!

Bhamakalapam 2

Movie Name: Bhamakalapam 2

Release Date: 2024-02-16
Cast: Priyamani, Sharanya Pradeep, Pradeep Rudra, Sundeep Ved, Seerath Kapoor
Director:Abhimanyu Tadimeti
Producer: Bhogavalli Bapineedu - Sudheer Edara
Music: Prashanth R Vihari
Banner: Dream Farmers
Rating: 2.75 out of 5
  • ప్రియమణి ప్రధానమైన పాత్రగా 'భామాకలాపం2'
  • ఫస్టు పార్టులో కథ ఎక్కువ .. ఖర్చు తక్కువ 
  • సెకండ్ పార్టులో కథ తక్కువ .. హడావిడి ఎక్కువ
  • ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరమైన ప్రధానమైన పాత్ర
  • సెకండ్ పార్టులో తగ్గిన కామెడీ టచ్   

ప్రియమణి ప్రధానమైన పాత్రను పోషించిన 'భామాకలాపం' 2022 ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'భామాకలాపం 2' సినిమా రూపొందింది. 'ఆహా'లో ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త స్టార్స్ ను కలుపుకుని .. మరింత బడ్జెట్ పెంచుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా, ఫస్టు పార్టును మించి ఉందా? .. లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

అనుపమ (ప్రియమణి) ఆమె భర్త మోహన్ (ప్రదీప్ రుద్ర) తమ కొడుకు వరుణ్ తో కలిసి కొత్త ఫ్లాట్ కి మారిపోతారు. ఇకపై ఎవరి విషయాలను పట్టించుకోకుండా ఇంటి పనులపై మాత్రమే దృష్టిపెట్టమని అనుపమను మోహన్ హెచ్చరిస్తాడు. తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన డబ్బుతో అనుపమ హోటల్ పెట్టుకోవడానికి అతను సహకరిస్తాడు. తనకి ఎంతో సాయం చేసిన శిల్పను అనుపమ భాగస్వామిగా తీసుకుంటుంది. రోజులు హాయిగా గడిచిపోతూ ఉంటాయి.

ఇక నగరంలో డ్రగ్ డీలర్ గా ఆంటోని (అనూజ్ గుర్వారా) తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాడు. కుకింగ్ ఐడల్ కాంపిటేషన్ పేరుతో అతను ఒక షోను ఏర్పాటు చేస్తాడు. ఆ షోలో గెలిచినవారికి ఒక షీల్డ్ ను రెడీ చేయిస్తాడు. అచ్చు అలాంటి షీల్డ్ లోనే కొకైన్ దాస్తాడు. ఆ షోలో విజేతను ప్రకటించే రోజునే వెయ్యి కోట్ల విలువైన ఆ కొకైన్ చేతులు మారేలా అతను ప్లాన్ చేస్తాడు. ఈ విషయంలో అతను 'జుబేదా' (శీరత్ కపూర్) మాట వినడంతో, సరుకు తమకే అమ్మాలని ఒక వైపున  తాషీ .. మరో వైపున మాణిక్యం నుంచి బెదిరింపులు వస్తుంటాయి. 

ఆంటోని నిర్వహించే కుకింగ్ ఐడల్ కాంపిటేషన్ లో పాల్గొనడానికి అనుపమ - శిల్ప సెలెక్ట్ అవుతారు. అదే సమయంలో అనుపమ కారణంగా మల్లేశం అనే రౌడీ పోలీసులకు పట్టుబడతాడు. జైలు నుంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి వాడు అనుపమను బెదిరిస్తూ ఉంటాడు. తన స్నేహితురాలు పార్వతికి తెలిసిన ఒక వ్యక్తి ఇంటెలిజెన్స్ డిపార్టుమెంట్ లో పని చేస్తున్నాడనీ, అతనికి విషయం చెప్పడం వలన ప్రయోజనం ఉండొచ్చని శిల్ప అతని దగ్గరికి తీసుకుని వెళుతుంది. మల్లేశం మళ్లీ కాల్ చేస్తే తాను చూసుకుంటానని సదానంద్ అనడంతో, అతనికి తన ఫోన్ ఇచ్చి వచ్చేస్తుంది.  
 

ఆ మరునాడు ఉదయమే మల్లేశం శవం తమ హోటల్లో ఉండటం చూసి అనుపమ - శిల్ప షాక్ అవుతారు. అది తన పనేననీ సదానంద్ చెబుతాడు. ఆ హత్య కేసులో ఆ ఇద్దరినీ ఇరికించడానికి ఎక్కువ సమయం పట్టదని అంటాడు. ఆంటోని తన ఫైవ్ స్టార్ హోటల్లో దాచిన కొకైన్ షీల్డ్ ను తనకి అప్పగించమని అంటాడు. కుకింగ్ ఐడల్ పోటీలు జరిగే రోజున ఈ పని జరిగిపోవాలని చెబుతాడు. అతని ప్లాన్ ప్రకారం చేయడానికి అంగీకరించిన అనుపమ - శిల్ప ఆ హోటల్లోకి అడుగుపెడతారు. 

అదే రోజున ఒక వైపు నుంచి తాషీ .. మరో వైపున మాణిక్యం అక్కడికి చేరుకుంటారు. తాషీ అక్కడికి అక్కడికి వస్తాడని తెలిసిన ఇంటెలిజెన్స్ వారు అక్కడే వెయిట్ చేస్తుంటారు. అలాంటి సమయంలోనే అనుపమ - శిల్ప  ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సదానంద్ ప్లాన్ ఫలిస్తుందా? 1000 కోట్ల విలువైన కొకైన్ ఎవరికి దక్కుతుంది? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతూ ఉంటుంది. 


'భామాకలాపం 2'లో అనుపమ ఒక వ్యక్తి చేసే బ్లాక్ మెయిల్ కి భయపడి, ఆ వ్యక్తి చెప్పిన దొంగతనం చేయడానికి అంగీకరించడం  .. అందుకోసం యాక్షన్ ప్లాన్ లోకి  ఆమె దిగిపోవడం ప్రధానమైన కథాంశంగా కనిపిస్తుంది. ఒక వైపున ఓ సాధారణమైన గృహిణి .. మరో వైపున డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్న ముగ్గురు వ్యక్తులు .. ఓ బ్లాక్ మెయిలర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పాత్రలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకోగా, కథ ఎక్కువగా అక్కడే జరుగతుంది.

ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి రహస్యంగా ప్రవేశించడం .. సీసీ టీవీల కళ్లుగప్పడం .. లిఫ్ట్ ఆపేయడం .. పవర్ ఆఫ్ చేయడం .. సెక్యూరిటీ గార్డుల వాకీ టాకీలు పని చేయకుండా చేయడం వంటివి సాధారణమైన వ్యక్తులు చేసే తేలికైన పనులేం కాదు. నిజానికి ఈ తతంగాన్ని తమిళ సినిమాల్లో మాదిరిగా చాలా హడావిడిగా చూపించవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పనులు నిదానంగా .. నింపాదిగా జరగడం కనిపిస్తుంది. 

దీపక్ యరగేరా ఫొటోగ్రఫీ బాగుంది. అలాగే ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం సన్నివేశాలకి తగినట్టుగానే సాగుతుంది. విప్లవ్ నైషధం ఎడిటింగ్ కూడా ఫరవాలేదు. భామాకలాపం 2'  చూసిన తరువాత, .. ఫస్టు పార్టు బాగుందా? సెకండ్ పార్టు ఇంట్రెస్టింగ్ గా ఉందా? అనే సందేహం కలగడం సహజం. అలా చూసుకుంటే ఈ రోజున వచ్చిన సెకండ్ పార్టు కంటే, ఫస్టు పార్టు బాగుందని చెప్పక తప్పదు. ఫస్టు పార్టును మించి ఉండటం కాదు .. ఆ స్థాయికి కూడా సెకండ్ పార్టు దూరంగానే అనిపిస్తుంది. అందుకు కారణం ఫస్టు పార్టులో ఉన్న సహజత్వం ... సెకండు పార్టులో లోపించడం. 

ఈ సినిమాను ఫస్టు పార్టుకు మించి చూపించాలనే ఉద్దేశంతో అన్ని విషయాల్లో డోస్ పెంచేశారు. ఫస్టు పార్టులో అనుపమ ఒక సాధారణ గృహిణిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. సెకండ్ పార్టులో ఆమె పాత్ర సాధారణ మహిళల స్థాయిని దాటుకుని ముందుకు వెళ్లిందనే అనాలి. ఆ పాత్ర లైఫ్ స్టైల్ .. ఏకంగా మాఫియా గ్యాంగ్స్ తోనే తలపడటం వంటివి కారణాలతో పాటు, ఫస్టు పార్టులో ఉన్న సున్నితమైన కామెడీ కూడా ఇందులో మిస్సయిందనే చెప్పాలి. 

Trailer

More Reviews